► రిజర్వ్‌డ్ అభ్యర్ధులకు నష్టం జరగకుండా చర్యలు
► ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ ప్రతిపాదనలు
► త్వరలో మరికొన్ని నోటిఫికేషన్లు: చైర్మన్ ఉదయభాస్కర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెలువరించే నోటిఫికేషన్లకు సంబంధించి ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్టు)లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులతో మెయిన్స్‌కు అర్హులను ఎంపిక చేయాలని కమిషన్ భావిస్తోంది. ఆయా రిజర్వుడ్ కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి ఆ మేరకు మెయిన్స్ పరీక్షకు అభ్యర్ధులను ఎంపిక చేయాలని తలస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ పి.ఉదయభాస్కర్ బుధవారం తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే రానున్న కాలంలో వెలువరించే కొత్త నోటిఫికేషన్లన్నిటికీ వర్తింపచేస్తామని వివరించారు.
ఏ రిజర్వుడ్ కేటగిరీకి ఎంత శాతం మేర మార్కులను కటాఫ్‌గా నిర్ణ యించాలని, మెయిన్స్ పరీక్షకు ఏ నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలన్న అంశాలపై ప్రభుత్వ ఉత్తర్వుల తర్వాతనే కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. జనరల్ కటాఫ్‌తో రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్ధులకు తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త ప్రతి పాదనను ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆమోదం వచ్చాక కొత్త నిబంధనలను అమల్లోకి తెస్తామని, రానున్న కాలంలో కొత్త నోటిఫికేషన్లు వెలువరించి తాజా నిబంధనలతో ప్రిలిమ్స్ నిర్వహిస్తామని చెప్పారు
పాత ప్రతిపాదనలకు సర్కారు నో...
ఏపీపీఎస్సీ నిర్వహించే వివిధ గ్రూపు కేటగిరీ పోస్టుల భర్తీ పరీక్షల్లో గ్రూప్–1 మినహా తక్కిన గ్రూపు కేటగీరీ పరీక్షలకు ప్రిలిమ్స్ విధానం లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని గ్రూపు పోస్టులకు కొత్తగా ప్రిలిమ్స్‌ను తెర పైకి తెచ్చింది. గ్రూప్–1 ఒక్కటే కాకుండా గ్రూప్–2,3 పోస్టులకు 25 వేలకు మించి దరఖాస్తులు వస్తే స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. స్క్రీనింగ్ టెస్టులో రిజర్వేషన్ల వారీగా కటాఫ్ నిర్ణయించి అభ్యర్థులను ఎంపిక చేయాలని ముందు భావించారు. తద్వారా రిజర్వుడ్ కేటగిరీల్లోని పోస్టులకు మెయిన్స్ పరీక్షకు అర్హులైన అభ్యర్ధులు ఎంపికవుతారని, పోస్టులు ఖాళీగా ఉండిపోకుండా భర్తీకి అవకాశముంటుందని ప్రభుత్వా నికి నివేదించారు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఏపీపీఎస్సీలో కూడా ప్రిలిమ్స్ (స్క్రీనింగ్ టెస్టు) నుంచి మెయిన్స్‌కు అర్హులను ఎంపిక చేయడానికి జనరల్ కటాఫ్‌తో కాకుండా కేటగిరీల వారీగా కటాఫ్ తీసుకొని 1:12 లేదా 1:15 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేయాలని భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ప్రతిపాదనలను పక్కన పెట్టి 1:50 చొప్పున ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు అభ్యర్ధులను ఎంపిక చేయాలని ఆదేశించింది. దాదాపు 4,250 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 32 నోటిఫికేషన్లు వెలువరించింది. వీటిలో 25 వేలకు మించి దరఖాస్తులు వచ్చే అన్ని పోస్టులకూ స్క్రీనింగ్ టెస్టు పెట్టడంతో పాటు మెయిన్స్‌కు జనరల్ కటాఫ్‌తో 1:50 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు.
ఏపీపీఎస్సీ ఏఈ, ఏఈఈ పోస్టులకు, 2016 గ్రూప్–2 పోస్టులకు ప్రిలిమ్స్ నిర్వహించింది. కానీ స్క్రీనింగ్ టెస్టుల్లో జనరల్ కటాఫ్‌తో మెయిన్స్‌కు అర్హులను ఎంపిక చేయడం ద్వారా తమకు అన్యాయం జరుగుతోందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్రూప్–2 పరీక్షలో జనరల్ కటాఫ్ మార్కులతో మెయిన్స్‌కు ఎంపికయ్యే వారిలో తమ వర్గాల వారికన్నా ఇతరులకే ఎక్కువ అవకాశాలుం టాయని, తమకు అన్యాయం జరుగుతుందని వారు ఏపీపీఎస్సీకి మొరపెట్టుకున్నారు. ప్రిలిమ్స్ రాసినా జన రల్ కటాఫ్ మార్కులు సాధించకపోతే పలు రిజర్వుడ్ పోస్టులకు అభ్యర్ధులు ఎంపికయ్యే అవకాశమే లేదన్నారు. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్ధులు జనరల్ కటాఫ్‌తో మెరిట్ మార్కులు సాధించినా వారిని ఓపెన్ కేటగిరీలో కాకుండా రిజర్వుడ్ కోటాలోకి తరలిస్తే ఆయావర్గాల్లోని ఇతర అభ్యర్ధులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తపరి చారు. దీనిపై ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
రిజర్వుడ్ అభ్యర్ధులున్నా జనరల్ కటాఫ్ మార్కుల పేరిట ఆయా పోస్టులకు ఎంపిక కాకుండా అవి మిగిలిపోయే అవకాశ ముందని పేర్కొన్నారు. ఈ తరుణంలో ఏపీపీఎస్సీ ప్రభు త్వానికి తాజా ప్రతిపాదనలను సమర్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్క్రీనింగ్ టెస్టు నుంచి జనరల్ కటాఫ్ మార్కులతో కాకుండా రిజర్వుడ్ కేటగిరీల వారీగా అభ్యర్ధులను ఎంపిక చేసేలా ఉన్న ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే ఆయా వర్గాలకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్త మవుతోంది. కటాఫ్ మార్కులు ఎన్ని? ఏ నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేయాలి? అన్నది ఏపీపీఎస్సీ నిర్ణయిస్తుంది.
కొత్త నోటిఫికేషన్లకు మాత్రమే...
ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే కొత్త నోటిఫికేషన్లకు మాత్రమే వర్తిస్తుంది తప్ప ఇప్పటికే వెలువడిన 2016 గ్రూప్–2కు కానీ, ఇతర నోటిఫికేషన్ల ప్రిలిమ్స్ పరీక్షలకు వర్తించదని ఏపీపీఎస్సీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాత నోటిఫికేషన్లకు వర్తింప చేస్తే న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయంటున్నారు. నోటిఫికేషన్‌కు భిన్నంగా ఎంపికలు చేస్తే ఎవరైనా అభ్యంతరంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తే మొత్తం ప్రక్రియే నిలిచిపోతుందని పేర్కొంటున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారమే మెయిన్స్‌కు అభ్యర్ధులను పిలుస్తామని, అర్హులైన వారు ఆయా పోస్టులకు లేకపోయినా, లేదా పోస్టుల సంఖ్య కన్నా తక్కువగా ఉన్నా ప్రిలిమ్స్ జాబితాల నుంచి మళ్లీ తీసుకోవడమో, ఇతర ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెడతామని వివరిస్తున్నారు.
ఇటీవల గ్రూప్–2 ప్రిలిమ్స్‌లో హాల్‌టిక్కెట్ల జారీలో అభ్యర్ధుల రిజర్వేషన్, స్థానికత సమాచారంలో తప్పులు దొర్లిన సంగతి తెలిసిందే. వీటిని సవరించుకొనేందుకు అవకాశమిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. కానీ ఎవరైనా అభ్యర్ధులు ఓసీ కేటగిరీలో ఉంటూ రిజర్వుడ్ కేటగిరీగా మార్పు చేసుకొని మెయిన్స్‌కు ఎంపికైతే అర్హులైన అసలు అభ్యర్ధులకు నష్టం జరుగుతుందేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపైనా ఏపీపీఎస్సీ దృష్టి సారించింది.