
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నేడే నగారా మోగనుంది. తెలంగాణ శాసనసభ తొలి సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాష్ట్ర శాసనసభ పరిధిలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాలతో సహా మొత్తం 119 నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారు(ఆర్‌ఓ)లు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 19తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. 20న నామినేషన్లను పరిశీలించనున్నారు.
నామినేషన్ల ఉపసంహరణ గడువు 22తో ముగియనుంది. ఎన్నికల బరిలో మిగిలిన అభ్యర్థుల తుది జాబితా అదే రోజు వెల్లడికానుంది. డిసెంబర్ 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని 32,791 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,73,18,603 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 19న ఓటర్ల జాబితా రెండో అనుబంధాన్ని ప్రచురించిన అనంతరం మొత్తం ఓటర్ల సంఖ్య 2.75 కోట్లకు పెరిగే అవకాశాలున్నాయి. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. శాసనసభ ఎన్నికల ప్రక్రియ 13తో ముగియనుంది.
రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం...
గడువుకు ముందే ఎన్నికలకు దూకిన అధికార టీఆర్‌ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో నెగ్గి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. కేసీఆర్‌ను గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ నేతృత్వంలో టీడీపీ, టీజేఎస్, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీ మహాకూటమిగా ఏర్పడి టీఆర్‌ఎస్‌కు సవాల్ విసిరాయి. సామాజిక న్యాయం పేరుతో సీపీఎం నేతృత్వంలో బడుగు, బలహీనవర్గాల సంఘాలు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్)గా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ నేతృత్వంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు, మద్యం, ఇతర కానుకలను పంపిణీ చేసి ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది.
ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని జిల్లాల్లో వీడియో నిఘా బృందాలు, వీడియో వ్యూవింగ్ టీమ్‌లు, అకౌంటింగ్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలియన్స్ టీంలు, ఖర్చుల పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 68 మంది సాధారణ పరిశీలకులను నియమించింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిఘా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న 53 మంది అధికారులను వ్యయ పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. శాంతిభద్రతల పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లు, పరిపాలన, పోలీసు విభాగల మధ్య సమన్వయం కోసం 10 మంది ఐపీఎస్ అధికారులను సైతం పోలీస్ అబ్జర్వర్లుగా నియమించింది. పోలింగ్ రోజు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఏర్పాట్లన్నీ పూర్తి: సీఈఓ రజత్‌కుమార్
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. సోమవారం గజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నాం. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణను ప్రారంభించేందుకు సంసిద్ధతతో ఉన్నాం. రాజకీయ పార్టీలతో సమావేశమై ఈ విషయాన్ని తెలియజేశాం. బందోబస్తు ఏర్పాట్ల కోసం 275 కంపెనీల కేంద్ర బలగాలను కోరాం.
అంకెల్లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు
1) అక్టోబర్ 12న ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో ఉన్న ఓటర్లు
మహిళా ఓటర్లు : 1,35,28,020
పురుష ఓటర్లు : 1,37,87,920
ఇతరులు : 2,663
మొత్తం ఓటర్ల సంఖ్య : 2,73,18,603
మొత్తం సర్వీస్ ఓటర్లు : 9,451
ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు : 6
2) శాసనసభ నియోజకవర్గాలు
ఎస్సీ రిజర్వ్‌డ్ : 19
ఎస్టీ రిజర్వ్‌డ్ : 12
జనరల్ : 88
మొత్తం :119
3) పోలింగ్ కేంద్రాలు
పట్టణ పోలింగ్ కేంద్రాలు : 12,514
గ్రామీణ పోలింగ్ కేంద్రాలు : 20,060
మొత్తం పోలింగ్ కేంద్రాలు : 32,574
అనుబంధ పోలింగ్ కేంద్రాలు : 217
సున్నిత పోలింగ్ కేంద్రాలు : 10,280
4) ఈవీఎంలు
బ్యాలెట్ యూనిట్లు : 51,529
కంట్రోల్ యూనిట్లు :39,763
వీవీ ప్యాట్స్ : 42,751
5) పోలింగ్ అధికారులు, సిబ్బంది
రిటర్నింగ్ అధికారులు : 119
అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు : 645
పోలింగ్ సిబ్బంది : 1,62,870
6) భద్రత ఏర్పాట్లు
రాష్ట్ర పోలీసు బలగాలు : 54 వేల మంది
అవసరమైన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు : 275 కంపెనీలు
2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం
పురుషులు 68.64 శాతం
మహిళలు 69.03 శాతం
మొత్తం 68.78 శాతం
Comments
Please login to add a commentAdd a comment