సాక్షి, సిటీబ్యూరో: పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి పోటాపోటీగా ఖర్చు చేస్తున్నారు. ఓట్ల వేటలో వీలైనన్ని మార్గాలను అన్వేషిస్తూ.. పరిమితికి మించి డబ్బులు పెడుతున్నారని వ్యయ పరిశీలకుల విభాగం నిగ్గుదేల్చే పనిలో పడింది. అభ్యర్థుల వ్యయంపై నియోజకవర్గానికి మూడు ప్రత్యేక బృందాలు డేగకన్ను వేశాయి. అయినా.. అధికారుల లెక్కలకు, అభ్యర్థులు ఇస్తున్న నివేదికలకు పొంతన లేకపోవడం గమనార్హం.
నియోజకవర్గానికో వ్యయ పరిశీలకుడు
గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాలకు ఒక్కొక్కరి చొప్పున ఎన్నికల సంఘం వ్యయ పరిశీకులను నియమించింది. వీరంతా అభ్యర్థుల రోజువారీ ఖర్చులను లెక్కిస్తున్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోజువారీ కార్యకర్తల భోజనాలు తదితర ఖర్చులపై వీడియో బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలైన్ టీంలు డేగకన్ను వేశాయి. అయినా ఎప్పటికప్పుడు వీడియోలో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన లెక్కల ప్రకారం మదింపు చేస్తున్నారు.
ఏదీ పొంతన..?
గ్రేటర్ పరిధిలోని అభ్యర్థులు అందజేస్తున్న లెక్కలకు, వ్యయ పరిశీకుల మదింపునకు పొంతన కుదరడం లేదు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలకయ్యే ఖర్చులతో పాటు ప్రచార సామగ్రి ఖర్చులను అభ్యర్థులు తక్కువగా చూపిస్తున్నారు. వ్యయ పరిశీలకుల వీడియో బృందాలు, ఫ్లయింగ్ స్వా్కడ్, స్టాటిక్ సర్వేలైన్ టీంలు అందిస్తున్న వివరాలను పరిశీలించగా.. అభ్యర్థులు అందించిన ఖర్చుల వివరాలకు పొంతన కుదరడంలేదు. మరోవైపు ఎన్నికల సంఘం నిర్ధారించిన ధరల ప్రకారం లెక్కలు వేసిన ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఉంటున్నాయి.
అభ్యర్థులకు నోటీసులు ఇస్తారా..?
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల వ్యయ పరిమితి రూ.28 లక్షలు మాత్రమే. ఎన్నికల నోటిఫికెషన్ విడుదలకు ముందు నుంచే పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఈ ఖర్చులు సైతం అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 12న విడుదలైంది. అంటే ఇప్పటి వరకు సుమారు 25 రోజులుగా అభ్యర్థులు ప్రచారానికి ఖర్చు చేస్తూనే ఉన్నారు. వారు చేసిన ఖర్చులు ఎన్నికల కమిషన్ వ్యయ పరిధి కంటే మూడు నుంచి నాలుగింతలు పెరిగేందుకు అవకాశముంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు ఇప్పటివరకు నోటీసులు జారీ చేయకపోవడం గమన్హారం. పరిమితికి మించి ఖర్చు చేసిన అభ్యర్థులపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోనుందో ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment