సరైన బ్రాంచ్.. కాలేజీ ఎంపికకు మార్గదర్శకాలు.. | Guidelines the selection of the correct branch College | Sakshi
Sakshi News home page

సరైన బ్రాంచ్.. కాలేజీ ఎంపికకు మార్గదర్శకాలు..

Published Thu, Aug 7 2014 3:12 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

సరైన బ్రాంచ్.. కాలేజీ ఎంపికకు మార్గదర్శకాలు.. - Sakshi

సరైన బ్రాంచ్.. కాలేజీ ఎంపికకు మార్గదర్శకాలు..

ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఆగస్టు 31లోగా కౌన్సెలింగ్ పూర్తిచేయాలంటూ సుప్రీంకోర్టు ఆగస్టు 4న ఆదేశాలు జారీచేసింది. మొత్తంమీద పరిస్థితులు ఎలా ఉన్నా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం వీలైనంత  త్వరగా కౌన్సెలింగ్ పూర్తి కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సరైన కాలేజీ, బ్రాంచ్ ఎంపికకు విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలపై స్పెషల్ ఫోకస్..
 
 బ్రాంచ్ ఎంపికకు సూచికలు!
 అభిరుచి (Aptitude)ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎంపికలో ప్రధానమైంది అభిరుచి. తుది నిర్ణయం విద్యార్థి ఆసక్తి, వ్యక్తిగత సామర్థ్యాల ఆధారంగానే తీసుకోవాలి. ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల కోర్సును పూర్తిచేశాక, వృత్తిగత జీవితం మొత్తం దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇంతటి కీలకమైన బ్రాంచ్ ఎంపిక చేసుకోవడంలో అభిరుచికి ప్రాధాన్యం ఇవ్వాలి.    ఆసక్తి లేకుండా తల్లిదండ్రులు, స్నేహితులు చెప్పారనో లేదంటే ఉద్యోగావకావకాశాలు బాగుంటాయనో ఏదో ఒక బ్రాంచ్‌లో చేరితే కెరీర్‌లో తుది ఫలితం నిరాశాజనకంగా ఉంటుంది.
 
 సరైన కాలేజీ ఎంపికకు సూచికలు:
 మౌలిక వసతులు: విద్యార్థులు ప్రాక్టికల్స్ చేసేందుకు అవసరమైన లేబొరేటరీలు, గ్రంథాలయం, ఇంటర్నెట్ సౌకర్యం, ఆట స్థలం ముఖ్యమైనవి. వీటికి సంబంధించి ఇంజనీరింగ్ విద్యకు గుర్తింపునిచ్చే ఆలిండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) కొన్ని నిబంధనలు రూపొందించింది. వీటికి అనుగుణంగా ఆయా కళాశాలల్లో మౌలిక సౌకర్యాలు ఉన్నాయో లేదో పరిశీలించాలి.
 
 బోధనా సిబ్బంది:
 విద్యార్థి భావి జీవితాన్ని ప్రభావితం చేసే అంశాల్లో బోధనా సిబ్బంది (ఫ్యాకల్టీ) పాత్ర కీలకమైంది. బోధానా సిబ్బందిలో పీహెచ్‌డీ చేసిన వారు ఉన్నారా? వారి అనుభవం? ప్రస్తుతం ఎంత మంది పీహెచ్‌డీ చేస్తున్నారు? ట్రాక్ రికార్డు? వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
 
 పరిశ్రమలతో అనుసంధానం:
 ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు వీలుగా కాలేజీకి పరిశ్రమతో అనుసంధానం ముఖ్యం. ఇలాంటి అనుసంధానం ఉన్న కాలేజీలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
 
 ప్రాంగణ నియామకాలు:
 చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరడానికి కారణం.. చదువు పూర్తయ్యేసరికి తమకు ఉద్యోగ ఆఫర్ లభిస్తుందనే. కాబట్టి కేవలం కోర్సు బోధనకే పరిమితం కాకుండా... ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకనుగుణంగా వివిధ రకాల నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణతోపాటు ప్లేస్‌మెంట్ సెల్ ఉన్న కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం మూడేళ్ల కాలంలో ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంతమంది ప్రాంగణ నియామకాల్లో ఎంపిక అయ్యారు అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కొన్ని కాలేజీలు కేవలం ఒక్కరిద్దరు విద్యార్థులకు వచ్చిన అవకాశాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటాయి. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ వివరాలను ఆ కాలేజీలో చదివిన సీనియర్ విద్యార్థుల ద్వారా తెలుసుకోవచ్చు.
 
 కో-కరిక్యులర్ - ఎక్స్‌ట్రా కరిక్యులర్ కార్యక్రమాలు:
 కాలేజీలు విద్యార్థి సమగ్రాభివృద్ధి కోసం దోహదపడేలా క్విజ్, ఎస్సే రైటింగ్, పేపర్ ప్రెజంటేషన్ వంటి కో-కరిక్యులర్ యాక్టివిటీస్‌తోపాటు గేమ్స్, కల్చరల్ ప్రోగ్రామ్‌లు, ఎన్‌ఎస్‌ఎస్ తరహా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తుంటాయి. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసంతోపాటు ప్రెజంటేషన్ స్కిల్స్, ఆర్గనైజ్డ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, సోషలైజేషన్ స్కిల్స్ వంటి ప్రస్తుత జాబ్ మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్ మెరుగవుతాయి. కాబట్టి కాలేజీ ఎంపికకు సంబంధించి ఈ అంశానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.
 
 ఉన్నత విద్య:
 గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక నచ్చిన స్పెషలైజేషన్‌లో పీజీ చేయడానికి ఉన్న అవకాశాలను విశ్లేషించుకోవాలి. కొన్ని బ్రాంచ్‌లకు సంబంధించిన స్పెషలైజేషన్లతో పీజీ చేసేందుకు తక్కువ అవకాశాలు అందుబాటులో ఉంటాయి.పరిశోధనల దిశగా వెళ్లాలనుకుంటే ఆ కోణంలోనూ ఉన్న అవకాశాలను బేరీజు ేసుకోవాలి.ఒకవేళ విదేశాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకుంటే అందుకు వివిధ దేశాల్లో ఉన్న అవకాశాలు, ఉపకారవేతనాలు తదితరాల గురించి తెలుసుకోవాలి.
 
 ఉద్యోగాలు:
 గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో చేరినా, చివరకు కోరుకున్న కొలువును దక్కించుకోవడమే ప్రధానం. అందువల్ల బ్రాంచ్ ఎంపికలో అందుబాటులో ఉన్న ఉద్యోగావకాశాలు అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. ప్రస్తుతం ఏ రంగాల్లో ఉద్యోగావకాశాలు బాగున్నాయో పరిశీలించడంతో పాటు భవిష్యత్‌లో ఆయా రంగాల పరిస్థితి ఎలా ఉంటుందన్నది కూడా విశ్లేషించుకోవాలి. దీనికోసం నాస్కామ్, సీఐఐ వంటి సంస్థల నివేదికలు ఉపయోగపడతాయి. ఉదాహరణకు మౌలిక వసతుల రంగంలో ఉజ్వల భవిష్యత్తుకు అవకాశమున్న నేపథ్యంలో కోర్ బ్రాంచ్‌లైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌ల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
 
 వేతనాలు:
 ఉద్యోగానికి సంబంధించిన వేతనాలు వ్యక్తిగత సామర్థ్యంపై ఆధారపడి ఉంటాయే తప్ప బ్రాంచ్‌పై కాదన్నది గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఐటీ రంగంలో పనిచేస్తున్న ఇంజనీర్లుకు మాత్రమే రూ.లక్షల ప్యాకేజీలతో వేతనాలు అందుతున్నాయనే భావన ఉంది. ఇది వాస్తవం కాదు. ఐటీ రంగంలో అందరికీ ఎక్కువ వేతనాలు ఉండవు. కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. అవకాశాలు అందిపుచ్చుకోవాలేగానీ మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జికల్ ఇలా వివిధ విభాగాల ఇంజనీర్లకు ఆకర్షణీయ వేతనాలు వచ్చే ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయి. ఏ బ్రాంచ్ వారైనప్పటికీ సంబంధిత రంగంలో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకొని, వ్యక్తిగత ప్రతిభ, శ్రమించే తత్వం ఉంటే మంచి వేతనాలు అందుతాయని కచ్చితంగా చెప్పొచ్చు.
 
 బ్రాంచ్ ఎంపికకు ఆసక్తి ప్రధానం..
 కాలేజీ ఎంపికకు బోధనా సిబ్బంది, లేబొరేటరీలు కీలకం. మంచి నైపుణ్యాలున్న బోధనా సిబ్బంది, ప్రాక్టికల్ పరిజ్ఞానం సముపార్జనకు వీలుకల్పించే అధునాతన లేబొరేటరీలు ఉన్న కళాశాలలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మంచి భవంతి ఉండి, అందులో సరైన బోధనా సిబ్బంది లేకపోతే అలాంటి కాలేజీ వల్ల ప్రయోజనం శూన్యం. కాలేజీ ఎంపికకు ప్రాంగణ నియామకాల తీరుతెన్నులను పరిశీలించడం కూడా ముఖ్యం. అవకాశాల పరంగా చూస్తే ఫలానా బ్రాంచ్ మంచిది? ఫలానా బ్రాంచ్ మంచిది కాదు? అని కచ్చితంగా చెప్పలేం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా ఉద్యోగావకాశాలకు కొదవలేదు. అయితే సంబంధిత రంగానికి సంబంధించి నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి. నైపుణ్యాల పరంగా సరిగా ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకొని, ముందుకు సాగాలంటే బ్రాంచ్‌ను ఎంపిక చేసుకునేటప్పుడు ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  డాక్టర్ జె.సురేశ్‌కుమార్,
 ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్
 ఇంజనీరింగ్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్, జేఎన్‌టీయూహెచ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement