నీట్ హీట్ | Sakshi Bhavitha | Sakshi
Sakshi News home page

నీట్ హీట్

Published Sat, Apr 30 2016 1:13 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

నీట్ హీట్ - Sakshi

నీట్ హీట్

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్
నీట్-NEET (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్).. గత రెండు రోజులుగా సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది. జాతీయ స్థాయిలో అన్ని మెడికల్, డెంటల్ కళాశాలల్లో నీట్ ఆధారంగానే ఈ ఏడాది నుంచి ప్రవేశాలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార వర్గాలు రివ్యూ పిటిషన్లు వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్ ముగిసింది. మరోవైపు తెలంగాణలోనూ ఎంసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఈ తరుణంలో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులపై విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిపుణులు మాత్రం విద్యార్థులు నీట్ దిశగా సన్నద్ధం కావడమే మేలంటున్నారు. ఈ నేపథ్యంలో.. అనుసరించాల్సిన వ్యూహాలు..
 
‘నీట్‌లో ర్యాంకు ఆధారంగానే ప్రవేశాలు నిర్వహించాలి. ఇందుకోసం మే 1న నిర్వహించే ఏఐపీఎంటీని నీట్-1గా పరిగణించాలి. దీనికి దరఖాస్తు చేయని విద్యార్థుల కోసం జూలై 24న నీట్-2 పేరుతో ప్రత్యేక పరీక్ష నిర్వహించాలి’
- సుప్రీంకోర్టు ఉత్తర్వులు.
 
‘నీట్ నిర్వహణపై సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్లు దాఖలు చేస్తాం’
- ప్రభుత్వ వర్గాల ప్రకటన.
 
న్యాయస్థానం ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుంటే..  విద్యార్థులు ఈ ఏడాది నీట్‌కు హాజరవ్వాల్సిన ఆవశ్యకత, అందులో ప్రతిభ కనబర్చాల్సిన పరిస్థితి స్పష్టమవుతోంది’
- నిపుణులు, విద్యావేత్తల అభిప్రాయం.
 
సరితూగే సిలబస్
నీట్ యూజీకి నిర్దేశించిన సిలబస్ ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ఆధారంగా ఉంటుంది. ఇది తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు కలిసొచ్చే అంశం. కారణం.. ప్రస్తుత ఇంటర్మీడియెట్ సిలబస్ ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌కు అనుగుణంగా అమలవుతోంది. అంతేకాకుండా మన సిలబస్‌లో కొన్ని అదనపు అంశాలు సైతం ఉన్నాయి. అయితే సమస్య ప్రధానంగా మాధ్యమంతోనే!దాంతోపాటు ఇప్పటివరకు విద్యార్థులు ఎంసెట్‌కు ప్రిపేర్ అయిన తీరుకు.. నీట్ తీరుకు కొంత వైవిధ్యం ఉండటం మరో సమస్య.
 
ప్రిపరేషన్ శైలి
నీట్‌కు హాజరుకానున్న విద్యార్థులు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను, ఇంటర్మీడియెట్ బోర్డ్ పుస్తకాలను బేరీజు వేసుకోవాలి. అందులో నీట్ సిలబస్, బోర్డ్ సిలబస్‌లో ఉన్న కామన్ అంశాలను గుర్తించాలి. ఆయా టాపిక్స్‌పై ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల ఆధారంగా పట్టు సాధించాలి. ఎక్కువగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అధ్యయనం చేయడం మేలు.  
 
ఏఐపీఎంటీ పాత ప్రశ్నలు
ఏఐపీఎంటీని నిర్వహించే సీబీఎస్‌ఈనే నీట్‌ను కూడా నిర్వహించనుంది. నీట్-2013 పరీక్షను సైతం సీబీఎస్‌ఈనే నిర్వహించింది. ఈ ఏడాది మే1న నిర్వహించే ఏఐపీఎంటీని నీట్-1గా పరి గణించాలని కోర్టు స్పష్టం చేసింది. వీటన్నింటినీ పరిశీలిస్తే నీట్-      2013, ఏఐపీఎంటీ పరీక్ష విధానం, సిలబస్ సైతం ఒకే విధంగా ఉంది. కాబట్టి విద్యార్థులు ఏఐపీఎంటీ పాత ప్రశ్న పత్రాల సాధన ద్వారా ప్రశ్నల తీరుపై అవగాహన పెంచుకోవచ్చు.
 
ప్రశ్నల సాధనలోనూ ప్రత్యేకంగా
సీబీఎస్‌ఈ నిర్వహించే ఏఐపీఎంటీ పరీక్ష, గతంలో నిర్వహించిన నీట్‌లో ఎక్కువ శాతం మ్యాచ్ ది ఫాలోయింగ్, మల్టిపుల్ ఛాయిస్, అసెర్షన్ అండ్ రీజన్, డయాగ్రమ్ ఆధారిత ప్రశ్నలే! విద్యార్థులు కూడా తమ ప్రిపరేషన్‌ను ఈ పద్ధతిలోకి అన్వయించుకోవాలి. డెరైక్ట్ కొశ్చన్ అండ్ ఆన్సర్ తరహా ప్రిపరేషన్‌కు స్వస్తి పలకాలి.  అప్లికేషన్ ఓరియెంటేషన్, కాన్సెప్ట్ బేస్డ్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యమివ్వాలి. బయాలజీ (బోటనీ, జువాలజీ)లో డయాగ్రమ్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఫిజిక్స్‌లో న్యూమరికల్ ఎబిలిటీ ఆధారిత ప్రశ్నలు ప్రాక్టీస్ చేయడం ఎంతో అవసరం. నీట్ ప్రిపరేషన్ పరంగా అనుసరించాల్సిన మరో ముఖ్యమైన వ్యూహం.. ఇప్పుడు కొత్త అంశాల జోలికి వెళ్లకుండా ఎంసెట్, ఐపీఈ ఎగ్జామ్స్ కోసం బాగా చదివిన అంశాలపైనే మరింత పట్టు సాధించాలి.
 
తగిన సమయం ఇస్తే బాగుంటుంది
నీట్ నిర్వహణ.. అమలు పరంగా విద్యార్థులకు కొంత సమయం ఇస్తే బాగుంటుంది. ఈ ఏడాది నుంచే అమలు చేయాలనే నిర్ణయం వల్ల విద్యార్థులు ఇబ్బందికి గురవుతారు. దీనివల్ల వారు పరీక్షకు సంసిద్ధత అయ్యే తీరు, సీట్ల భర్తీ విధానం వంటి విషయాల్లో ఎంతో గందరగోళం నెలకొంటుంది. ఇప్పటికే ఏపీలో ఎంసెట్ ముగిసింది. తెలంగాణలోనూ ఎంసెట్ నిర్వహణ తుది దశకు చేరుకుంది.
- డాక్టర్. జి. సుబ్బారావు, ప్రిన్సిపాల్, గుంటూరు మెడికల్ కాలేజ్
 
అనుకూలతలే సాధనంగా
ఒకవేళ నీట్ తప్పనిసరైతే తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కారణం.. మన సిలబస్ సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల మేరకు ఉంది. విద్యార్థులు తమ ప్రిపరేషన్ శైలిని మార్చుకుంటే సరిపోతుంది.  
 - విజయ్ కిశోర్, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్
 
కాన్సెప్ట్ ఆధారితం
నీట్ తప్పనిసరైతే విద్యార్థులు ఎంసెట్ ప్రశ్నల శైలి, నీట్ గత ప్రశ్నల శైలిని గమనించి తమ ప్రిపరేషన్ సాగించాలి. నీట్‌లో అధికంగా కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు, అప్లికేషన్ ఓరియెంటెడ్ ప్రశ్నలు వస్తాయి.      - రాజేంద్ర, బోటనీ, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్
 
నీట్ స్వరూపం
నీట్-2013లో నిర్వహించిన ప్రకారం, అదే విధంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏఐపీఎంటీని పరిశీలిస్తే నీట్ పరీక్ష ఈ విధంగా ఉండొచ్చు.

* ఇంగ్లిష్ / హిందీ (నీట్-2013లో ఆంధ్రప్రదేశ్, అసోం, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లకు చెందిన విద్యార్థులు తమ రాష్ట్రాల్లో స్థానిక కోటాలో సీటు పొందాలనుకుంటే తమ మాతృ భాషలో పరీక్ష రాసుకునే వెసులుబాటు ఇచ్చారు. ఈ విషయమై ఈసారి ఇంకా స్పష్టత రాలేదు.)
* మొత్తం విభాగాలు -4 అవి.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ + జువాలజీ)
* ప్రశ్నల సంఖ్య - 180. నాలుగు విభాగాల్లో ఒక్కో విభాగం నుంచి  45 ప్రశ్నలు చొప్పున అడిగే అవకాశముంది.
* ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. తప్పు సమాధానానికి ఒక మార్కు కోల్పోతారు.
* సమయం మూడు గంటలు.
నీట్ అర్హత:  ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సులో గ్రూప్ సబ్జెక్ట్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 25 ఏళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement