దక్షిణాఫ్రికా సేవా సంస్థకు అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి | South Africa's service organization, the International Gandhi Peace Prize | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా సేవా సంస్థకు అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి

Published Thu, Sep 11 2014 3:41 AM | Last Updated on Sun, Sep 2 2018 5:48 PM

దక్షిణాఫ్రికా సేవా సంస్థకు అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి - Sakshi

దక్షిణాఫ్రికా సేవా సంస్థకు అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి

 సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా హెచ్‌ఎల్ దత్తు
 సుప్రీంకోర్టు 42వ ప్రధాన న్యాయమూర్తిగా హంద్యాల లక్ష్మీ నారాయణస్వామి దత్తు సెప్టెంబర్ 5న నియమితులయ్యారు. ప్రస్తుత సీజే ఆర్‌ఎం లోధా సెప్టెంబర్ 27న పదవీ విరమణ చేయనున్నారు. ఆ స్థానంలో  బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ దత్తు డిసెంబర్ 2, 2015 వరకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. కొలీజియం విధానం ద్వారా ఎంపికైన చిట్టచివరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దత్తూనే కావడం విశేషం. సుప్రీం కోర్టు, హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకానికి నేషనల్ జుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఏర్పడనున్న నేపథ్యంలో కొలీజియం విధానం రద్దుకానుంది. జస్టిస్ దత్తు ఛత్తీస్‌గడ్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.
 
 కేరళ గవర్నర్‌గా జస్టిస్ సదాశివం
 కేరళ గవర్నర్‌గా జస్టిస్ పి. సదాశివం సెప్టెంబర్ 5న బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ సదాశివం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు. భారత్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి గవర్నర్‌గా నియమితులవడం  ఇదే తొలిసారి. హోదా రీత్యా గవర్నర్ పదవి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది.  
 
 ఐరాస ఫౌండేషన్ సలహా మండలిలో ఇద్దరు భారత మహిళలు
 బాలికల సమస్యలపై చైతన్యం కల్గించేందుకు ఐక్యరాజ్యసమితి ఫౌండేషన్ చేపట్టిన ‘గర్ల్ అప్’ కార్యక్రమం సలహామండలికి ఎంపికైన 12 మందిలో భారత సంతతికి చెందిన అఖిల సోమశేఖర్ (సియాటెల్), అంజులా ఆచారియా బాత్ (అమెరికా)లు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బాలికల కోసం పనిచేస్తున్న వివిధ నేపథ్యాలకు చెందిన ప్రతినిధులకు ఈ మండలిలో సభ్యత్వం క ల్పిస్తారు.
 
  బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా గాంధీ
 పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కె.పి.సి.గాంధీ నియమితులయ్యారు.  ఈయన ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. పశ్చిమ బెంగాల్‌లో అత్యాచార ఘటనల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఫోరెన్సిక్ విభాగాన్ని కట్టుదిట్టం చేసేందుకు గాంధీని సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
 
 అత్యంత వృద్ధ క్రికెటర్ నార్మన్‌గోర్డాన్ మృతి
 ప్రపంచంలో అత్యంత వృద్ధ క్రికెటర్ నార్మన్ గోర్డాన్ (103) జోహానెస్‌బర్గ్ (దక్షిణాఫిక్రా)లో సెప్టెంబర్ 2న మరణించారు. ‘మొబైల్’ అనే నిక్‌నేమ్ కలిగిన ఆయన దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ ఫాస్ట్ బౌలర్‌గా సేవలందించారు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు క్రికెట్ ఆడి సజీవంగా ఉన్న చివరి వ్యక్తిగా గోర్డాన్ ఉండే వారు.
 
 మాజీ అటార్నీ జనరల్ వాహనవతి మృతి
 భారత మాజీ అటార్నీ జనరల్ జి.ఇ. వాహనవతి (65) సెప్టెంబర్ 2న ముంబైలో కన్నుమూశారు. భారత అటార్నీ జనరల్‌గా ఎంపికైన తొలి ముస్లిం మతస్థుడు ఆయనే. 2009లో యూపీఏ-2 పాలనలో భారతదేశ 13వ అటార్నీ జనరల్‌గా సేవలందించారు. అలాగే సొలిసిటర్ జనరల్, మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. 2004లో జింబాబ్వేలో చోటుచేసుకున్న జాతివివక్ష ఆరోపణలపై దర్యాప్తునకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆయనను నియమించింది.
 
 సామాజిక వెబ్‌సైట్ల వినియోగంలో ప్రధాని మోడీది రెండోస్థానం
 ట్విట్టర్, ఫేస్‌బుక్ తదితర సామాజిక వెబ్‌సైట్ల వినియోగంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోడీ రెండో వ్యక్తిగా నిలిచారు. జూన్‌లో నాలుగో స్థానంలో ఉన్న ఆయన తాజాగా రెండో స్థానానికి చేరుకున్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రథమ స్థానం దక్కింది.
 
 ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ను గెలుచుకున్న భారత్
 ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు వన్డేల క్రికెట్ సిరీస్‌ను భారత్  3-1 తేడాతో  కైవసం చేసుకుంది.  24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో భారత్ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది.
 
 యూఎస్ ఓపెన్ టెన్నిస్
 యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ విజేతగా సానియా -బ్రునో సొరెస్ (బ్రెజిల్) జంట నిలిచింది. సెప్టెంబర్ 5న జరిగిన ైఫైనల్లో స్పియర్స్ (అమెరికా)-గొంజాలెజ్ (మెక్సికో) జోడిని ఓడించింది. సానియాకు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్.
 
 మహిళల సింగిల్స్: ఈ విభాగంలో సెరెనా విలియమ్స్ విజేతగా నిలిచింది. ైఫైనల్లో  కరోలైన్ వోజ్నియాకి (డెన్మార్క్)ను  ఓడించింది.  సెరెనాకు ఇది ఆరో యూఎస్  టైటిల్ కాగా తన కెరీర్‌లో 18వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్.
 
 మహిళల డబుల్స్: ఈ విభాగంలో ఎకటెరీనా మకరోనా-ఎలెనా వెస్నినా (రష్యా) విజేతలుగా నిలిచారు.
 పురుషుల డబుల్స్: ఈ విభాగం టైటిల్‌ను అమెరికాకు చెందిన మైక్ బ్రయాన్-బాబ్ బ్రయాన్  సోదరులు గెలుచుకున్నారు. వీరికిది వందో డబుల్స్ టైటిల్. యూఎస్ ఓపెన్‌లో ఐదో సారి విజేతలుగా నిలిచారు. మొత్తం మీద  16వ గ్రాండ్ స్లామ్ టైటిల్.
 
 హామిల్టన్‌కు ఇటలీ గ్రాండ్ ప్రి ైటె టిల్
 ఫార్ములా వన్ ఇటలీ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెస్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. మోంజా (ఇటలీ)లో సెప్టెంబర్ 7న జరిగిన పోటీలో  రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలిచారు.
 
 బంగారుతల్లి పథకం పేరు మార్పు
 బాలికా సంరక్షణ కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకం పేరును మా ఇంటి మహాలక్ష్మిగా  మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బాలికల సాధికారత కోసం ఉద్దేశించిన ఈ పథకం కింద పేదింట్లో అమ్మాయి పుట్టిన దగ్గరి నుంచి డిగ్రీ పూర్తి చేసేంత వరకూ రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది.
 
 రాజ్యసభ కమిటీ చైర్మన్‌గా సుబ్బరామిరెడ్డి
 రాజ్యసభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్‌గా టి సుబ్బరామిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభ నుంచి వచ్చే వివిధ బిల్లులను ఈ కమిటీ నిశితంగా పరిశీలించాకే, రాజ్యసభలో ప్రవేశపెడతారు. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన బిల్లులపై ఈ కమిటీ ఏమైనా అభ్యంతరాలుంటే వ్యక్తం చేయవచ్చు.
 
 ఆరోగ్యశ్రీ ట్రస్టుకి ఫిక్కీ పురస్కారం
 ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) పురస్కారాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు దక్కించుకుంది. ఆరోగ్య పరిరక్షణలో చూపిన చొరవ, కృషి అసాధారణ సేవల విభాగాల్లో ఈ అవార్డును బహుకరిస్తారు.
 
 అక్కినేని పేరుతో అమెరికాలో పోస్టల్ స్టాంపు
 దివంగత అక్కినేని నాగేశ్వరరావు ముఖచిత్రంతో కూడిన స్టాంపును అమెరికా పోస్ట్ సర్వీసు విడుదల చేయనుంది. ఆయన జయంతి సెప్టెంబర్ 20న డల్లాస్‌లో స్టాంపు విడుదల చేయనున్నట్లు అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆగస్టు 31న ప్రకటించింది. అమెరికా పోస్ట్ సర్వీసు తొలిసారి భారతీయ నటుడి స్టాంపును విడుదల చేయనుంది.
 
 విజయవాడ పరిసరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని
 ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసరాల్లోనే ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 4న శాసనసభలో ప్రకటించారు. రాజధాని అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉండాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలను మెగాసిటీలుగా, మరో 14 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.
 
 వరల్డ్ ఎకనమిక్ ఫోరం పోటీ  జాబితాలో భారత్‌కు 71వస్థానం  
 వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ప్రపంచ పోటీ జాబితాలో భారత్ 71వ స్థానంలో నిలిచింది. 2014, సెప్టెంబర్ 3న జెనీవాలో విడుదల చేసిన నివేదిక ప్రకారం మొత్తం 144 దేశాలు పోటీపడగా స్విట్జర్లాండ్, సింగపూర్, అమెరికా మొద టి మూడు స్థానాల్లో నిలిచాయి. బ్రిక్స్ దేశాల కూటమిలో భారత్‌ది చివరి స్థానం. 2013-14లో భారత్‌కు 60వ ర్యాంక్ దక్కగా ఈసారి 11 స్థానాలను కోల్పోయింది. గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ రిపోర్టు (జీసీఆర్)ను వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2004 నుంచి ఒక వార్షిక నివేదికగా ప్రచురిస్తోంది.
 
 ఆస్ట్రేలియాతో భారత్ అణు ఒప్పందం
 భారత్-ఆస్ట్రేలియాల మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత్ పర్యటించిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్, భారత ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశారు. అణు ఇంధనాన్ని శాంతియుత ప్రయోజనాల వినియోగానికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. దీని ప్రకారం భారత్‌కు యురేనియం సరఫరా, రేడియో ఐసోటోపుల ఉత్పత్తి, అణుభద్రతతో పాటు ఇతర రంగాలలో ఆస్ట్రేలియా సహకరిస్తుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయడానికి నిరాకరించడంతో 2012లో ఆస్ట్రేలియా తన విధానాన్ని మార్చుకొని బారత్‌కు అణు సహకారాన్ని నిరాకరించింది. అప్పటి నుంచి ఐదు దఫాల చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది.
 
 దక్షిణాఫ్రికా సేవా సంస్థకు అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి
  ప్రపంచ వ్యాప్తంగా శాంతి సాధనకు, దక్షిణాఫ్రికాలో వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ‘ది ఆఫ్రికన్ సెంటర్ ఫర్ కన్‌స్ట్రక్టివ్ రిసల్యూషన్ ఆఫ్ డిస్‌ప్యూట్స్’ అనే సంస్థకు ప్రతిష్టాత్మక మహాత్మాగాంధీ అంతర్జాతీయ శాంతి బహు మతి-2014 లభించింది. దివంగత నెల్సన్ మండేలా భార్య గ్రాకామషేల్ ఈ సంస్థ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పిల్లల హక్కుల కోసం మషేల్ ఈ సంస్థ ద్వారా  కృషి చేస్తున్నారు. డర్బన్‌లోని గాంధీ అభివృద్ధి ట్రస్టు ఏటా ఈ అవార్డును ప్రకటిస్తుంది.
     
 రైస్ బకెట్ తోడ్పాటుకు యు.ఎన్. అవార్డు
 రైస్ బకెట్ ఛాలెంజ్‌ను చేపట్టి ఆన్‌లైన్‌లో ప్రాచుర్యంలోకి తెచ్చిన హైదరాబాద్‌కు చెందిన మంజులత కళానిధి (38) అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్య సమితి అందించే అవార్డుకు ఎంపికయ్యారు. ఐస్ బకెట్ ఛాలెంజ్ తరహాలో పేదలకు బియ్యం అందించే రైస్ బకెట్ ఛాలెంజ్‌ని ఆమె చేపట్టి ఆన్‌లైన్‌లో ప్రాచుర్యం కల్పించారు. దీంతో 10 వేల కిలోల బియ్యం పేదలకు అందించేందుకు తోడ్పడ్డారు. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్యసమితితో కూడిన సమాఖ్య ఐసీఓఎన్‌జీఓ ఆమెకు కర్మవీర చక్ర అవార్డు, రెక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ ప్రకటించింది. ఈ అవార్డును 2015 మార్చి 25న న్యూఢిల్లీలో ప్రదానం చేస్తారు.
 
 బోయిభీమన్న సాహితీ పురస్కారాలు
 డాక్టర్ బోయి భీమన్న సాహితీ పురస్కారాలను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సెప్టెంబర్ 4న ప్రకటించింది. డాక్టర్ సి. నారాయణరెడ్డికి జీవన సాఫల్య పురస్కారానికి, పద్య కవితా పురస్కారాలకు కేశవరెడ్డి, డా. నలిమెల భాస్కర్, పి సత్యవతిలను ఎంపిక చేసింది.   
 
 టాటా ఇంటికి యునెస్కో అవార్డు
 టాటా సంస్థ స్థాపకుడు జెంషెడ్‌జీ టాటాకు చెందిన ముంబైలోని ఎస్‌ప్లాండే హౌస్‌కు యునెస్కో ఆసియా-పసిఫిక్ వారసత్వ అవార్డు లభించింది. మహారాష్ట్ర కిన్హాల్ గ్రామం సతారాలోని శ్రీ సఖరగద్ నివాసిని దేవి దేవాలయ ప్రాంగణం కూడా ఈ అవార్డుకు ఎంపికైంది. వారసత్వ నిర్మాణాలు, భవనాల సంరక్షణకు కృషి చేసిన సంస్థలు, వ్యక్తులకు గుర్తుగా ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
 
 భారత్‌లోఅత్యధిక ఆత్మహత్యలు
 2012లో ఆగ్నేయాసియాలో జరిగిన ఆత్మహత్యల్లో అత్యధికంగా భారత్‌లోనే నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సెప్టెంబర్ 4న విడుదల చేసిన నివేదిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 8.04 లక్షల మంది బలవన్మరణాలు నమోదవగా వీరిలో భారతీయుల సంఖ్య 2,58,077. ప్రపంచం మొత్తం మీద 40 నిమిషాలకు ఒక ఆత్మహత్య చోటు చేసుకుంటుందని పేర్కొంది.
 
 తీరగస్తీ నౌక ఐఎన్‌ఎస్ సుమిత్ర జాతికి అంకితం
 తూర్పు తీర భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో రూపొందిన అతిపెద్ద తీరగస్తీ నౌక ఐఎన్‌ఎస్ సుమిత్రను భారత నౌకాదళ ఛీఫ్ అడ్మిరల్ ఆర్‌కే ధోవన్ సెప్టెంబర్ 4న చెన్నైలో జాతికి అంకితం చేశారు. గోవా నౌకా నిర్మాణ కేంద్రంలో నిర్మించిన ఐఎన్‌ఎస్ సుమిత్ర అత్యాధునిక ఆయుధాలను, కమ్యూనికేషన్ వ్యవస్థను కలిగి ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న నౌకలలో ఇది నాలుగోది. గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించే ఈ నౌక బరువు 2,200 టన్నులు, పొడవు 105 మీటర్లు, వెడల్పు 13 మీటర్లు.
 
 ఇండో-నేపాల్ సంయుక్త విన్యాసాలు
 భారత్-నేపాల్ దేశాలు సంయుక్తంగా పితోరాఘర్‌లో నిర్వహించిన సైనిక విన్యాసాలు ఆగస్టు 31తో ముగిశాయి. వీటికి సూర్యకిరణ్-7గా నామకరణం చేశారు. 14 రోజుల విన్యాసాల్లో భాగంగా విపత్తు నిర్వహణతోపాటు పలు అంశాలపై ప్రదర్శన లిచ్చారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement