HL Dattu
-
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ హెచ్.ఎల్. దత్తు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
ఇక ఫాస్ట్‌ట్రాక్ విచారణ
సీజేఐ జేఎస్ ఖేహర్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న దాదాపు 61వేల కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ మోడ్‌లో పనిచేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ స్పష్టం చేశారు. పలు అంశాలపై వేసిన వ్యాజ్యాలను తొలగించబోమని ఆయన భరోసా ఇచ్చారు. ‘మేం ఫాస్ట్‌ట్రాక్‌లో పనిచేస్తాం. ఆందోళన వద్దు. ఏ వ్యాజ్యాన్నీ రద్దుచేసే ప్రసక్తే లేదు’ అని సీజేఐ జస్టిస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకున్న 15 రోజుల్లోనే సామాజిక న్యాయానికి సంబంధించిన కేసుల వాదనలు వినే ధర్మాసనాన్ని జస్టిస్ ఖేహర్ పునరుద్ధరించారు. ఈ సామాజిక న్యాయ బెంచ్‌ను మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు 2014లో స్థాపించారు. కాగా, ఈ ధర్మాసనానికి జస్టిస్ మదన్ బీ లోకుర్ నాయకత్వం వహిస్తారు. ఈ బెంచ్ ప్రతి శుక్రవారం రెండు గంటలపాటు కూర్చుని.. ప్రజాపంపిణీ వ్యవస్థ మొదలుకుని కరువు పరిస్థితులు, కబేళాలు, రాత్రి ఆవాసాలు, ఆరోగ్యం, శుభ్రత, పిల్లల అక్రమ రవాణా వంటి కేసులను విచారించనుంది. -
హక్కుల చట్టాన్ని సవరించాలి: హెచ్ఎల్ దత్తు
భువనేశ్వర్: వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మావోలు, భద్రతా సిబ్బంది మధ్య ప్రజలు నలిగిపోతున్నారని, వారిని రక్షించలేకపోతున్నామని అందుకు వీలుగా మానవహక్కుల పరిరక్షణ చట్టం, 1993ను సవరించాలని జాతీయ మానవహక్కుల సంఘం(ఎన్‌హెచ్చార్సీ) కోరింది. ఇక్కడ మూడు రోజుల పాటు నిర్వహించిన కమిషనర్ల శిబిరంలో ఎన్‌హెచ్చార్సీ చైర్పర్సన్ జస్టిస్ హెచ్ ఎల్ దత్తు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1993లో మానవహక్కుల పరిరక్షణ చట్టం వచ్చినప్పటి నుంచి అనేక మంది బాధితులకు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ఇవ్వగలిగిందని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టానికి సవరణ అవసరమని పేర్కొన్నారు. కమిషన్ ఆదేశాలను పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకునే అధికారం కమిషన్‌కు ఉండాలని అన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి మెరుగుపడుతోందని అన్నారు. -
ఎన్‌హెచ్చార్సీ చైర్మన్ హెచ్ ఎల్ దత్తూ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్చార్సీ) చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది మేలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పదవీకాలం ముగియడంతో ఎన్ హెచ్చార్సీ చైర్మన్ పదవికి ఖాళీ ఏర్పడింది. అప్పటినుంచి జస్టిస్ సిరియాక్ జోసెఫ్ ఇన్ చార్జి చైర్ పర్సన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. దత్తూ నియామకంతో ఎన్ హెచ్చార్సీ పదవికి పూర్తికాల చైర్మన్ ను నియమించినట్లైంది. ఆ పదవి చేపట్టినవారిలో దత్తూ ఏడోవారు. న్యాయమూర్తిగా సుదీర్ఘ అనుభవం ఉన్న హెచ్ ఎల్ దత్తూ అనేక కేసుల్లో చట్టాల్ని అనుసరించి విభిన్న తీర్పులు చెప్పారు. 1950, డిసెంబర్ 3న కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లా కాదూర్ లో జన్మించిన దత్తూ.. కాదూర్, తరికేరి, బిరూరుల్లో ప్రాధమికవిద్యను పూర్తిచేశారు. ఉన్నత చదువుల కోసం బెంగళూరు వచ్చిన ఆయన అక్కడే ఎల్ఎల్ బీ పూర్తిచేశారు. 1975లో కర్ణాటక బార్ అసోసియేషన్ లో పేరు నమోదుచేయించుకున్న ఆయన పలు సివిల్, క్రిమినల్ కేసులను సమర్థవంతంగా వాదించి పేరుతెచ్చుకున్నారు. 1995లో కర్ణాటక హౌకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన హెచ్ఎల్ దత్తూ.. 2008లో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. 2014లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీఐజే)గా ఎంపికై 2015, డిసెంబర్ 2 వరకు కొనసాగారు. అపార అనుభవం ఉన్న హెచ్ ఎల్ దత్తు సేవలను వినియోగించుకోవాలనుకున్న కేంద్రం ఆయనను ఎన్ హెచ్ ఆర్సీ చైర్మన్ గా నియమించింది. -
మరోసారి శ్రీవారి సేవలో..
తిరుమల: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు బుధవారం మరోసారి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. సోమవారం రాత్రి కాలినడకన తిరుమలకు వచ్చిన జస్టిస్ దత్తు మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఇతర భక్తులకు ఇబ్బంది లేకుండా ఆయన ఓ సామాన్య భక్తుడిలా తిరుమలలో కలియ తిరిగారు. బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలసి మరోసారి ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకున్నారు. వకుళామాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ చీఫ్ జస్టిస్‌ను శ్రీవారి పట్టు వస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన తిరుచానూరు చేరుకుని పద్మావతీ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. -
‘ఫైవ్‌స్టార్’ వివాదం!
సంపాదకీయం ఏడాదికోసారి జరిగే ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జాతీయ సదస్సులో ఎన్నో ముఖ్యాంశాలు చర్చకొస్తుంటాయి. న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి అసంఖ్యాకంగా పేరుకుపోతున్న వ్యాజ్యాలు అందులో ఒకటి. మిగిలిన విషయాల మాటెలా ఉన్నా పెండింగ్ కేసుల వ్యవహారం మాత్రం ఎప్పటికీ పరిష్కారం కాదు. మళ్లీ మరో జాతీయ సదస్సు వరకూ ఆ సమస్య ఎవరికీ గుర్తుండదు. ఆదివారం జరిగిన జాతీయ సదస్సులోనూ యథాప్రకారం పెండింగ్ కేసుల ప్రస్తావన వచ్చింది. అయితే, అంతకన్నా ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై అందరి దృష్టీ పడింది. న్యాయవ్యవస్థ తీరుతెన్నులపై ఆయన నిశిత వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే న్యాయవ్యవస్థ నిర్భయంగా లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. రాజ్యాంగానికీ, చట్టానికీ అనుగుణంగా న్యాయాన్ని కలగజేసే దైవ సమానమైన విధి నిర్వహణలో తలమునకలయ్యే న్యాయమూర్తులు ‘ఫైవ్‌స్టార్ క్రియాశీలుర’ స్పందనలకు భయపడాల్సిన పనిలేదని కూడా మోదీ చెప్పారు. ప్రధాని స్థానంలో ఉన్నవారు న్యాయవ్యవస్థ భయపడుతున్నదనడమే కాదు... ఎవరి కారణంగా వారిలో ఆ భయం ఉన్నదో చెప్పడం అసాధారణమైన విషయం. తాము ఎప్పటిలా నిర్భయంగానే వ్యవహరిస్తున్నామని ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్. ఎల్. దత్తు జవాబిచ్చారు. మోదీ చెబుతున్న ‘ఫైవ్‌స్టార్ క్రియాశీలురు’ చేపట్టే సమస్యలు సామాన్యులకు సంబంధించినవి. న్యాయస్థానాల్లోనూ, వెలుపలా ఆ సమస్యలపై పోరాడటం వారికి నిత్యకృత్యం. ఆ సమస్యలకు వారు చూపుతున్న పరిష్కారాలపై ఎవరికైనా అభ్యంతరాలుండొచ్చు. కానీ వారి చిత్తశుద్ధిని శంకించలేం. ఉదాహరణకు గుజ రాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలగుండా ప్రవహించే నర్మదా నదిపై నిర్మించతలపెట్టిన సర్దార్ సరోవర్ డ్యాంకు వ్యతిరేకంగా మేథాపాట్కర్, బాబా ఆమ్టే తదితరులు ఉద్యమించారు. సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేశారు. భారీ డ్యాంల నిర్మాణంవల్ల అడవులు నాశనమై పర్యావరణం దెబ్బతింటున్నదని, లక్షలాదిమంది ఆదివాసీలు నిరాశ్రయులై జీవిక కోల్పోతున్నారని ఆ సంస్థ వాదించగా...కరువు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించే మంచి ప్రాజెక్టును అడ్డుకుంటున్నా రని మరికొందరు విమర్శించారు. ఇక మధ్యప్రదేశ్‌లోని మహాన్‌లో ఎస్సార్, హిండాల్కో సంస్థలకు విద్యుదుత్పాదన కోసం కేటాయించిన బొగ్గు గనులవల్ల పర్యావరణం దెబ్బతింటుందని గ్రీన్‌పీస్ సంస్థ ఆరోపిస్తున్నది. వాటిని వెనక్కు తీసుకోవాలని కోరుతున్నది. అలాగే ఒడిశాలో బాక్సైట్ నిక్షేపాల వెలికితీత కోసం బహుళజాతి సంస్థలకు ఇచ్చిన అనుమతులను వెనక్కు తీసుకోవాలని ఉద్యమాలు సాగుతున్నాయి. దేశంలో భారీ కర్మాగారాలు నెలకొల్పకపోతే ఉపాధి, ఆర్థికాభి వృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించేవారూ ఉన్నారు. నోరులేని ఆదివాసీల తరఫున, సామాన్యుల తరఫున పోరాడుతున్న వ్యక్తులు, సంస్థలకు ఉద్దేశాలు ఆపాదించే బదులు వారు లేవనెత్తే అంశాల్లోని సహేతుకతపైనా...వారు సూచిస్తున్న పరిష్కా రాల్లోని సాధ్యాసాధ్యాలపైనా చర్చించడం అవసరం. అప్పుడు దేశానికి ఏది మంచో ప్రజలే నిర్ణయిస్తారు. ‘ఫైవ్‌స్టార్ క్రియాశీలురు’ లేకపోతే 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, బొగ్గు స్కాం వంటివి బయటికొచ్చేవి కాదన్నది నిజం. లక్షల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న ఈ స్కాంలను సామాన్యులెవరైనా బయట పెట్టడం అసాధ్యం. అయితే, మోదీ అభ్యంతరం వీటికి సంబంధించి కాదని స్పష్టం గానే చెప్పవచ్చు. ఎందుకంటే ఇవన్నీ వరసబెట్టి బయటపడ్డాక కాంగ్రెస్ అన్ని విధాలా భ్రష్టుపట్టడం...అది సహజంగానే బీజేపీకి లాభించడం కాదనలేని సత్యం. అయితే ఇటీవలికాలంలో న్యాయస్థానాలిచ్చిన రెండు కీలక తీర్పులు పాలకులను ఇరకాటంలోకి నెట్టాయి. గ్రీన్‌పీస్ ఉద్యమ కార్యకర్త ప్రియాపిళ్లై మొన్న జనవరిలో లండన్ వెళ్లబోతుండగా విమానంలోనుంచి ఆమెను బలవంతంగా దింపేయడం... అనంతరం ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పుడు కేంద్ర ప్రభుత్వ చర్యను న్యాయస్థానం తప్పుబట్టడం అందరికీ తెలుసు. అలాగే, సామాజిక మాధ్యమాల్లో విమర్శలను నియంత్రించేందుకు ప్రభుత్వాలకు విశేషాధికారాలిస్తున్న ఐటీ చట్టం లోని సెక్షన్ 66 ఏ ఉంచడం అవసరమని కేంద్ర ప్రభుత్వం వాదించగా సుప్రీంకోర్టు ఆ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని, భావప్రకటనా స్వేచ్ఛకు భంగకరమని తీర్పు నిచ్చింది. ఇలాంటి తీర్పులు రావడంపై మోదీ కినుక వహించారని కొందరంటున్న దాంట్లో వాస్తవం లేకపోలేదు. 1979 ప్రాంతంలో జైళ్లలో విచారణ లేకుండా మగ్గిపోతున్న ఖైదీల స్థితిగతులపై మీడియా కథనాలనే సుప్రీంకోర్టు పిటిషన్‌గా స్వీకరించడంతో మన దేశంలో ‘న్యాయవ్యవస్థ క్రియాశీలత’ ప్రారంభమైంది. అటు తర్వాత ఆగ్రాలోని నారీ సంర క్షణ కేంద్రంలో అమానవీయ పరిస్థితులు, ఆసియాడ్ నిర్మాణపనుల కార్మికులకు అత్యల్ప వేతనాలివ్వడం, క్వారీల్లో వెట్టిచాకిరీ వంటి అనేకానేక అంశాల్లో న్యాయ స్థానాలు విలువైన తీర్పులిచ్చాయి. అనంతరకాలంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) ఉద్దేశమే దెబ్బతింటున్నదని, పాలనా వ్యవహారాల్లో సైతం న్యాయ స్థానాలు తలదూర్చి నిర్ణయాలు తీసుకుంటున్నాయని విమర్శలు రావడం మొదలైంది. ఆ విమర్శల ప్రభావంవల్లనే కావొచ్చు... గతంతో పోలిస్తే న్యాయస్థానాలు పిల్స్ విష యంలో పరిమితంగానే వ్యవహరిస్తున్నాయి. నరేంద్ర మోదీకి వక్తగా పేరుంది. అందరినీ ఆకట్టుకునేలా చెప్పగలరు. అయితే న్యాయవ్యవస్థ ఎవరికో భయపడి తీర్పులిస్తున్నదని ధ్వనించడం, సమస్యలను లేవనెత్తేవారిని ‘ఫైవ్‌స్టార్ క్రియా శీలుర’ని ఎద్దేవా చేయడం బహిరంగ సభావేదికలపై ఏమోగానీ... జాతీయ న్యాయ సదస్సు వంటిచోట అతకదు. దీనికి బదులు ఆయా సమస్యలపైనా, న్యాయస్థానాల పనితీరుపైనా నిర్దిష్టమైన చర్చకు అంకురార్పణ చేస్తే ప్రయోజనం ఉంటుంది. -
ఏ విచారణ అయినా ఐదేళ్లు దాటకూడదు
సీజేఐ జస్టిస్ హెచ్ఎల్ దత్తు వ్యాఖ్య న్యూఢిల్లీ: ఏ కేసు విచారణ అయినా ఐదేళ్ల సమయం మించరాదని గడువును నిర్దేశించినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ హెచ్ఎల్ దత్తు తెలిపారు. కేసుల పెండింగ్‌కు సంబంధించి న్యాయవ్యవస్థలో ఖాళీలు పెద్ద అవరోధంగా మారాయని హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లు, సీఎంల సదస్సులో అన్నారు. ప్రజాస్వామ్యం అనే తల్లికి న్యాయ, శాసన వ్యవ స్థలు తోబుట్టువులాంటివారని ఈ రెండు కీలక వ్యవస్థలు రాజ్యాంగం ఏర్పరిచిన బాటలో సమన్వయంతో ముందుకు సాగాలని అభిలషించారు. కేటాయించిన నిధుల వినియోగంలో న్యాయవ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, ప్రతిభ గల న్యాయ నిపుణులను మంచి ప్యాకేజీలతో ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు. అది మా కుటుంబ వ్యవహారం.. సీజేఐ: గుడ్‌ఫ్రైడే రోజున జడ్జిల సదస్సు నిర్వహణపై వివాదం దురదృష్టకరమని సీజేఐ దత్తు అన్నారు. ఇది తమ కుటుంబ వ్యవహారమని, కుటుంబ పెద్దగా ఈ అంశాన్ని పరిష్కరిస్తానని చెప్పారు. ‘ఆ సదస్సు న్యాయవ్యవస్థ సమస్యలపై చర్చించేందుకు జడ్జీల మధ్య ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ మాత్రమే. మాది ఒక కుటుంబం. మాలో నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే.. అది మేం మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం’ అని విలేకరులతో అన్నారు. గుడ్‌ఫ్రైడే రోజున జడ్జిల సదస్సు నిర్వహించడంపై సుప్రీం న్యాయమూర్తి కురియన్ జోసెఫ్.. సీజేఐకి అసంతృప్తి తెలియజేసిన విషయం తెలిసిందే. -
మోదీ ఓ మంచి నాయకుడు: సుప్రీం చీఫ్ జస్టిస్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఊహించని వ్యక్తి నుంచి ప్రశంసలు లభించాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు.. 'మోదీ గొప్ప నాయకుడు, మానవతావాది, దూరదృష్టిగల నాయకుడు' అంటూ కితాబిచ్చారు. జస్టిస్ దత్తు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు ప్రభుత్వంతో సత్సంబంధాలున్నాయని చెప్పారు. మోదీతో నాలుగుసార్లు కలిసిన చీఫ్ జస్టిస్ ఆయన వ్యక్తిత్వం గురించి ప్రశంసించారు. 2002 గుజరాత్ అల్లర్ల సయమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేసిన సిట్ మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి మోదీని ప్రశంసించడం ప్రాధాన్యం సంతరించుకుంది. చీఫ్ జస్టిస్‌గా తన పదవీకాలంలో ప్రభుత్వం, న్యాయవ్యవస్థల మధ్య సత్సంబంధాలున్నాయని చెప్పారు. -
సత్వర న్యాయం కోసమే లోక్ అదాలత్‌లు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు ఉమ్మడి హైకోర్టులో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం కక్షిదారులు చిరునవ్వుతో వెళ్లేలా చూడాలి కేసులు పరిష్కరించుకోవాలని వారిపై ఒత్తిడి చేయొద్దు ఏడాది పొడవునా లోక్ అదాలత్‌లు నిర్వహించాల్సిన అవసరముంది తన తల్లిదండ్రులు తెలుగు వారేనన్న దత్తు సాక్షి, హైదరాబాద్: కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్‌ల లక్ష్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు అన్నారు. గతేడాది లోక్ అదాలత్ ద్వారా పది లక్షల కేసులు పరిష్కారమయ్యాయన్నారు. ఈసారి అంతకన్నా ఎక్కువ కేసులను పరిష్కరించగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శనివారం దేశవ్యాప్తంగా రెండో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభమైంది. అందులో భాగంగా ఇక్కడి ఉమ్మడి హైకోర్టు ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జస్టిస్ దత్తు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇరు రాష్ట్రాల న్యాయసేవాధికార సంస్థల ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ దత్తు మాట్లాడుతూ.. ‘లోక్ అదాలత్‌కు వచ్చే కక్షిదారులను కొంత ఒత్తిడి చేస్తున్నారనేది నా అభిప్రాయం. ఇదే విషయాన్ని ఓ కక్షిదారుడు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎంత మాత్రం సరికాదు. లోక్ అదాలత్లకు వచ్చిన కక్షిదారులు చిరునవ్వుతో తిరిగి వెళ్లాలి. ఆ బాధ్యత అధికారులదే’ అని జస్టిస్ దత్తు తెలిపారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గాలంటే ఏడాది పొడగునా లోక్ అదాలత్‌లను నిర్వహించాల్సిన అవసరం ఉందని జస్టిస్ దత్తు అభిప్రాయపడ్డారు. తన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని, మూడు దశాబ్దాల క్రితం కర్ణాటకకు వలస వెళ్లారని, అందువల్ల తను ఇరు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని తెలిపారు. ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి, ‘నమస్కారం’ అంటూ తెలుగులోనే ముగించారు! లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించదగ్గ కేసులు ఆంధ్రప్రదేశ్‌లో 80,831, తెలంగాణలో 91, 626 ఉన్నట్లు జస్టిస్ సేన్‌గుప్తా చెప్పారు. సుప్రీంకోర్టులో సోషల్ జస్టిస్ బెంచ్ ఏర్పాటు చేసినందుకు జస్టిస్ దత్తును జస్టిస్ నర్సింహారెడ్డి అభినందించారు. జస్టిస్ దత్తును సన్మానించారు. కాగా, శనివారం హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్ ద్వారా 608 కేసులు పరిష్కారమయ్యాయి. దీని ద్వారా మూడు వేల మంది లబ్ధి పొందారు. హాస్యనటుడు అలీ ఔదార్యం హాస్యనటుడు అలీ పెద్దమనసుతో వ్యవహరిం చారు. తనను లక్షల రూపాయల మేర మోసం చేసిన ఓ మహిళపై జాలి చూపారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన సాంబశివరావు, శకుంతల దంపతుల ఇంటిని 1998లో అలీ కొనుగోలు చేశారు. ఈ ఇంటిపై సాంబశివరావు దంపతులు రూ.90 లక్షల బ్యాంక్ రుణం తీసుకున్న సంగతి దాచిపెట్టారు. దాంతో 2006లో వారిద్దరిపై అలీ చీటింగ్ కేసు పెట్టారు. శనివారం నాంపల్లి కోర్టులో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో అలీ పాల్గొన్నారు. శకుంతల దయనీయ పరిస్థితిని న్యాయమూర్తి వివరించడంతో, రావాల్సిన డబ్బు వదులుకొని కేసు వెనక్కు తీసుకున్నారు. -
తెలంగాణ హైకోర్టు ఏర్పాటుపై చర్చ
న్యూఢిల్లీ: హైదరాబాద్ కింగ్‌కోఠిలోని పరదా ప్యాలెస్‌లో తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేసే అంశంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తుతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈరోజు చర్చలు జరిపారు. తెలంగాణ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడానికి ప్రధాన న్యాయమూర్తి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు భవనాన్ని తాత్కాలికంగా ఏపికి కేటాయించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దాంతో తెలంగాణ హైకోర్టును కింగ్‌కోఠిలోని నిజాం పరదా ప్యాలెస్‌లో లేదా ఎర్రమంజిల్ ఆర్ అండ్ బీ భవనంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో కలిసి రాజీవ్ శర్మ ఈ రెండు భవనాలను పరిశీలించారు. ** -
కాలినడకన తిరుమలకు ప్రధాన న్యాయమూర్తి
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు బుధవారం సాయంత్రం తిరుపతి చేరుకున్నారు. అలిపిరి నుంచి తిరుమల చేరుకునేందుకు కాలిబాటన నడకను ప్రారంభించారు. తిరుమలలో రేపు ప్రధాన న్యాయమూర్తి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ ఆలయ అధికారులు స్వాగత పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు బుధవారానికి ఆరో రోజుకు చేరుకున్నాయి. -
సుప్రీం కోర్టు జడ్జిగా జస్టిస్ దత్తు ప్రమాణం
-
దక్షిణాఫ్రికా సేవా సంస్థకు అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి
సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా హెచ్ఎల్ దత్తు సుప్రీంకోర్టు 42వ ప్రధాన న్యాయమూర్తిగా హంద్యాల లక్ష్మీ నారాయణస్వామి దత్తు సెప్టెంబర్ 5న నియమితులయ్యారు. ప్రస్తుత సీజే ఆర్ఎం లోధా సెప్టెంబర్ 27న పదవీ విరమణ చేయనున్నారు. ఆ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్ దత్తు డిసెంబర్ 2, 2015 వరకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. కొలీజియం విధానం ద్వారా ఎంపికైన చిట్టచివరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దత్తూనే కావడం విశేషం. సుప్రీం కోర్టు, హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకానికి నేషనల్ జుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిటీ ఏర్పడనున్న నేపథ్యంలో కొలీజియం విధానం రద్దుకానుంది. జస్టిస్ దత్తు ఛత్తీస్గడ్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కేరళ గవర్నర్‌గా జస్టిస్ సదాశివం కేరళ గవర్నర్‌గా జస్టిస్ పి. సదాశివం సెప్టెంబర్ 5న బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ సదాశివం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు. భారత్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి గవర్నర్‌గా నియమితులవడం ఇదే తొలిసారి. హోదా రీత్యా గవర్నర్ పదవి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కంటే తక్కువ స్థాయిలో ఉంటుంది. ఐరాస ఫౌండేషన్ సలహా మండలిలో ఇద్దరు భారత మహిళలు బాలికల సమస్యలపై చైతన్యం కల్గించేందుకు ఐక్యరాజ్యసమితి ఫౌండేషన్ చేపట్టిన ‘గర్ల్ అప్’ కార్యక్రమం సలహామండలికి ఎంపికైన 12 మందిలో భారత సంతతికి చెందిన అఖిల సోమశేఖర్ (సియాటెల్), అంజులా ఆచారియా బాత్ (అమెరికా)లు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బాలికల కోసం పనిచేస్తున్న వివిధ నేపథ్యాలకు చెందిన ప్రతినిధులకు ఈ మండలిలో సభ్యత్వం క ల్పిస్తారు. బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా గాంధీ పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కె.పి.సి.గాంధీ నియమితులయ్యారు. ఈయన ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి దేశ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. పశ్చిమ బెంగాల్లో అత్యాచార ఘటనల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఫోరెన్సిక్ విభాగాన్ని కట్టుదిట్టం చేసేందుకు గాంధీని సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అత్యంత వృద్ధ క్రికెటర్ నార్మన్గోర్డాన్ మృతి ప్రపంచంలో అత్యంత వృద్ధ క్రికెటర్ నార్మన్ గోర్డాన్ (103) జోహానెస్‌బర్గ్ (దక్షిణాఫిక్రా)లో సెప్టెంబర్ 2న మరణించారు. ‘మొబైల్’ అనే నిక్‌నేమ్ కలిగిన ఆయన దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ ఫాస్ట్ బౌలర్‌గా సేవలందించారు. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు క్రికెట్ ఆడి సజీవంగా ఉన్న చివరి వ్యక్తిగా గోర్డాన్ ఉండే వారు. మాజీ అటార్నీ జనరల్ వాహనవతి మృతి భారత మాజీ అటార్నీ జనరల్ జి.ఇ. వాహనవతి (65) సెప్టెంబర్ 2న ముంబైలో కన్నుమూశారు. భారత అటార్నీ జనరల్‌గా ఎంపికైన తొలి ముస్లిం మతస్థుడు ఆయనే. 2009లో యూపీఏ-2 పాలనలో భారతదేశ 13వ అటార్నీ జనరల్‌గా సేవలందించారు. అలాగే సొలిసిటర్ జనరల్, మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. 2004లో జింబాబ్వేలో చోటుచేసుకున్న జాతివివక్ష ఆరోపణలపై దర్యాప్తునకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆయనను నియమించింది. సామాజిక వెబ్సైట్ల వినియోగంలో ప్రధాని మోడీది రెండోస్థానం ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సామాజిక వెబ్సైట్ల వినియోగంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని నరేంద్రమోడీ రెండో వ్యక్తిగా నిలిచారు. జూన్‌లో నాలుగో స్థానంలో ఉన్న ఆయన తాజాగా రెండో స్థానానికి చేరుకున్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రథమ స్థానం దక్కింది. ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ను గెలుచుకున్న భారత్ ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు వన్డేల క్రికెట్ సిరీస్‌ను భారత్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో భారత్ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విజేతగా సానియా -బ్రునో సొరెస్ (బ్రెజిల్) జంట నిలిచింది. సెప్టెంబర్ 5న జరిగిన ైఫైనల్లో స్పియర్స్ (అమెరికా)-గొంజాలెజ్ (మెక్సికో) జోడిని ఓడించింది. సానియాకు ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్. మహిళల సింగిల్స్: ఈ విభాగంలో సెరెనా విలియమ్స్ విజేతగా నిలిచింది. ైఫైనల్లో కరోలైన్ వోజ్నియాకి (డెన్మార్క్)ను ఓడించింది. సెరెనాకు ఇది ఆరో యూఎస్ టైటిల్ కాగా తన కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. మహిళల డబుల్స్: ఈ విభాగంలో ఎకటెరీనా మకరోనా-ఎలెనా వెస్నినా (రష్యా) విజేతలుగా నిలిచారు. పురుషుల డబుల్స్: ఈ విభాగం టైటిల్‌ను అమెరికాకు చెందిన మైక్ బ్రయాన్-బాబ్ బ్రయాన్ సోదరులు గెలుచుకున్నారు. వీరికిది వందో డబుల్స్ టైటిల్. యూఎస్ ఓపెన్‌లో ఐదో సారి విజేతలుగా నిలిచారు. మొత్తం మీద 16వ గ్రాండ్ స్లామ్ టైటిల్. హామిల్టన్‌కు ఇటలీ గ్రాండ్ ప్రి ైటె టిల్ ఫార్ములా వన్ ఇటలీ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెస్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. మోంజా (ఇటలీ)లో సెప్టెంబర్ 7న జరిగిన పోటీలో రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలిచారు. బంగారుతల్లి పథకం పేరు మార్పు బాలికా సంరక్షణ కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారుతల్లి పథకం పేరును మా ఇంటి మహాలక్ష్మిగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బాలికల సాధికారత కోసం ఉద్దేశించిన ఈ పథకం కింద పేదింట్లో అమ్మాయి పుట్టిన దగ్గరి నుంచి డిగ్రీ పూర్తి చేసేంత వరకూ రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది. రాజ్యసభ కమిటీ చైర్మన్‌గా సుబ్బరామిరెడ్డి రాజ్యసభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్‌గా టి సుబ్బరామిరెడ్డి నియమితులయ్యారు. లోక్‌సభ నుంచి వచ్చే వివిధ బిల్లులను ఈ కమిటీ నిశితంగా పరిశీలించాకే, రాజ్యసభలో ప్రవేశపెడతారు. వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన బిల్లులపై ఈ కమిటీ ఏమైనా అభ్యంతరాలుంటే వ్యక్తం చేయవచ్చు. ఆరోగ్యశ్రీ ట్రస్టుకి ఫిక్కీ పురస్కారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) పురస్కారాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు దక్కించుకుంది. ఆరోగ్య పరిరక్షణలో చూపిన చొరవ, కృషి అసాధారణ సేవల విభాగాల్లో ఈ అవార్డును బహుకరిస్తారు. అక్కినేని పేరుతో అమెరికాలో పోస్టల్ స్టాంపు దివంగత అక్కినేని నాగేశ్వరరావు ముఖచిత్రంతో కూడిన స్టాంపును అమెరికా పోస్ట్ సర్వీసు విడుదల చేయనుంది. ఆయన జయంతి సెప్టెంబర్ 20న డల్లాస్‌లో స్టాంపు విడుదల చేయనున్నట్లు అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆగస్టు 31న ప్రకటించింది. అమెరికా పోస్ట్ సర్వీసు తొలిసారి భారతీయ నటుడి స్టాంపును విడుదల చేయనుంది. విజయవాడ పరిసరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసరాల్లోనే ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సెప్టెంబర్ 4న శాసనసభలో ప్రకటించారు. రాజధాని అన్ని ప్రాంతాలకు సమానదూరంలో ఉండాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలను మెగాసిటీలుగా, మరో 14 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం పోటీ జాబితాలో భారత్‌కు 71వస్థానం వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ప్రపంచ పోటీ జాబితాలో భారత్ 71వ స్థానంలో నిలిచింది. 2014, సెప్టెంబర్ 3న జెనీవాలో విడుదల చేసిన నివేదిక ప్రకారం మొత్తం 144 దేశాలు పోటీపడగా స్విట్జర్లాండ్, సింగపూర్, అమెరికా మొద టి మూడు స్థానాల్లో నిలిచాయి. బ్రిక్స్ దేశాల కూటమిలో భారత్‌ది చివరి స్థానం. 2013-14లో భారత్‌కు 60వ ర్యాంక్ దక్కగా ఈసారి 11 స్థానాలను కోల్పోయింది. గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్టు (జీసీఆర్)ను వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2004 నుంచి ఒక వార్షిక నివేదికగా ప్రచురిస్తోంది. ఆస్ట్రేలియాతో భారత్ అణు ఒప్పందం భారత్-ఆస్ట్రేలియాల మధ్య పౌర అణు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు భారత్ పర్యటించిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్, భారత ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్ 5న న్యూఢిల్లీలో ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేశారు. అణు ఇంధనాన్ని శాంతియుత ప్రయోజనాల వినియోగానికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. దీని ప్రకారం భారత్‌కు యురేనియం సరఫరా, రేడియో ఐసోటోపుల ఉత్పత్తి, అణుభద్రతతో పాటు ఇతర రంగాలలో ఆస్ట్రేలియా సహకరిస్తుంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయడానికి నిరాకరించడంతో 2012లో ఆస్ట్రేలియా తన విధానాన్ని మార్చుకొని బారత్‌కు అణు సహకారాన్ని నిరాకరించింది. అప్పటి నుంచి ఐదు దఫాల చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. దక్షిణాఫ్రికా సేవా సంస్థకు అంతర్జాతీయ గాంధీ శాంతి బహుమతి ప్రపంచ వ్యాప్తంగా శాంతి సాధనకు, దక్షిణాఫ్రికాలో వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ‘ది ఆఫ్రికన్ సెంటర్ ఫర్ కన్స్ట్రక్టివ్ రిసల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్స్’ అనే సంస్థకు ప్రతిష్టాత్మక మహాత్మాగాంధీ అంతర్జాతీయ శాంతి బహు మతి-2014 లభించింది. దివంగత నెల్సన్ మండేలా భార్య గ్రాకామషేల్ ఈ సంస్థ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, పిల్లల హక్కుల కోసం మషేల్ ఈ సంస్థ ద్వారా కృషి చేస్తున్నారు. డర్బన్‌లోని గాంధీ అభివృద్ధి ట్రస్టు ఏటా ఈ అవార్డును ప్రకటిస్తుంది. రైస్ బకెట్ తోడ్పాటుకు యు.ఎన్. అవార్డు రైస్ బకెట్ ఛాలెంజ్‌ను చేపట్టి ఆన్లైన్లో ప్రాచుర్యంలోకి తెచ్చిన హైదరాబాద్‌కు చెందిన మంజులత కళానిధి (38) అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్య సమితి అందించే అవార్డుకు ఎంపికయ్యారు. ఐస్ బకెట్ ఛాలెంజ్ తరహాలో పేదలకు బియ్యం అందించే రైస్ బకెట్ ఛాలెంజ్‌ని ఆమె చేపట్టి ఆన్లైన్లో ప్రాచుర్యం కల్పించారు. దీంతో 10 వేల కిలోల బియ్యం పేదలకు అందించేందుకు తోడ్పడ్డారు. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, ఐక్యరాజ్యసమితితో కూడిన సమాఖ్య ఐసీఓఎన్జీఓ ఆమెకు కర్మవీర చక్ర అవార్డు, రెక్స్ కర్మవీర్ గ్లోబల్ ఫెలోషిప్ ప్రకటించింది. ఈ అవార్డును 2015 మార్చి 25న న్యూఢిల్లీలో ప్రదానం చేస్తారు. బోయిభీమన్న సాహితీ పురస్కారాలు డాక్టర్ బోయి భీమన్న సాహితీ పురస్కారాలను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం సెప్టెంబర్ 4న ప్రకటించింది. డాక్టర్ సి. నారాయణరెడ్డికి జీవన సాఫల్య పురస్కారానికి, పద్య కవితా పురస్కారాలకు కేశవరెడ్డి, డా. నలిమెల భాస్కర్, పి సత్యవతిలను ఎంపిక చేసింది. టాటా ఇంటికి యునెస్కో అవార్డు టాటా సంస్థ స్థాపకుడు జెంషెడ్జీ టాటాకు చెందిన ముంబైలోని ఎస్ప్లాండే హౌస్‌కు యునెస్కో ఆసియా-పసిఫిక్ వారసత్వ అవార్డు లభించింది. మహారాష్ట్ర కిన్హాల్ గ్రామం సతారాలోని శ్రీ సఖరగద్ నివాసిని దేవి దేవాలయ ప్రాంగణం కూడా ఈ అవార్డుకు ఎంపికైంది. వారసత్వ నిర్మాణాలు, భవనాల సంరక్షణకు కృషి చేసిన సంస్థలు, వ్యక్తులకు గుర్తుగా ఈ అవార్డును ప్రదానం చేస్తారు. భారత్లోఅత్యధిక ఆత్మహత్యలు 2012లో ఆగ్నేయాసియాలో జరిగిన ఆత్మహత్యల్లో అత్యధికంగా భారత్‌లోనే నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సెప్టెంబర్ 4న విడుదల చేసిన నివేదిక తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 8.04 లక్షల మంది బలవన్మరణాలు నమోదవగా వీరిలో భారతీయుల సంఖ్య 2,58,077. ప్రపంచం మొత్తం మీద 40 నిమిషాలకు ఒక ఆత్మహత్య చోటు చేసుకుంటుందని పేర్కొంది. తీరగస్తీ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర జాతికి అంకితం తూర్పు తీర భద్రతను పటిష్టం చేసే లక్ష్యంతో రూపొందిన అతిపెద్ద తీరగస్తీ నౌక ఐఎన్ఎస్ సుమిత్రను భారత నౌకాదళ ఛీఫ్ అడ్మిరల్ ఆర్కే ధోవన్ సెప్టెంబర్ 4న చెన్నైలో జాతికి అంకితం చేశారు. గోవా నౌకా నిర్మాణ కేంద్రంలో నిర్మించిన ఐఎన్ఎస్ సుమిత్ర అత్యాధునిక ఆయుధాలను, కమ్యూనికేషన్ వ్యవస్థను కలిగి ఉంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న నౌకలలో ఇది నాలుగోది. గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించే ఈ నౌక బరువు 2,200 టన్నులు, పొడవు 105 మీటర్లు, వెడల్పు 13 మీటర్లు. ఇండో-నేపాల్ సంయుక్త విన్యాసాలు భారత్-నేపాల్ దేశాలు సంయుక్తంగా పితోరాఘర్‌లో నిర్వహించిన సైనిక విన్యాసాలు ఆగస్టు 31తో ముగిశాయి. వీటికి సూర్యకిరణ్-7గా నామకరణం చేశారు. 14 రోజుల విన్యాసాల్లో భాగంగా విపత్తు నిర్వహణతోపాటు పలు అంశాలపై ప్రదర్శన లిచ్చారు. -
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా HL దత్తు