సత్వర న్యాయం కోసమే లోక్ అదాలత్‌లు | Lok adalat for fast justice delivery system | Sakshi
Sakshi News home page

సత్వర న్యాయం కోసమే లోక్ అదాలత్‌లు

Published Sun, Dec 7 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

సత్వర న్యాయం కోసమే లోక్ అదాలత్‌లు

సత్వర న్యాయం కోసమే లోక్ అదాలత్‌లు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు
 ఉమ్మడి హైకోర్టులో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం
 కక్షిదారులు చిరునవ్వుతో వెళ్లేలా చూడాలి
 కేసులు పరిష్కరించుకోవాలని వారిపై ఒత్తిడి చేయొద్దు
 ఏడాది పొడవునా లోక్ అదాలత్‌లు నిర్వహించాల్సిన అవసరముంది
 తన తల్లిదండ్రులు తెలుగు వారేనన్న దత్తు    
 
 సాక్షి, హైదరాబాద్: కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్‌ల లక్ష్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు అన్నారు. గతేడాది లోక్ అదాలత్ ద్వారా పది లక్షల కేసులు పరిష్కారమయ్యాయన్నారు. ఈసారి అంతకన్నా ఎక్కువ కేసులను పరిష్కరించగలమనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శనివారం దేశవ్యాప్తంగా రెండో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభమైంది. అందులో భాగంగా ఇక్కడి ఉమ్మడి హైకోర్టు ప్రాంగణంలో జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జస్టిస్ దత్తు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇరు రాష్ట్రాల న్యాయసేవాధికార సంస్థల ప్యాట్రన్ ఇన్ చీఫ్ జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి, ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ జస్టిస్ గుండా చంద్రయ్య, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ దత్తు మాట్లాడుతూ.. ‘లోక్ అదాలత్‌కు వచ్చే కక్షిదారులను కొంత ఒత్తిడి చేస్తున్నారనేది నా అభిప్రాయం. ఇదే విషయాన్ని ఓ కక్షిదారుడు బహిరంగంగానే చెప్పారు. ఇది ఎంత మాత్రం సరికాదు. లోక్ అదాలత్‌లకు వచ్చిన కక్షిదారులు చిరునవ్వుతో తిరిగి వెళ్లాలి. ఆ బాధ్యత అధికారులదే’ అని జస్టిస్ దత్తు తెలిపారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గాలంటే ఏడాది పొడగునా లోక్ అదాలత్‌లను నిర్వహించాల్సిన అవసరం ఉందని జస్టిస్ దత్తు అభిప్రాయపడ్డారు. తన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని, మూడు దశాబ్దాల క్రితం కర్ణాటకకు వలస వెళ్లారని, అందువల్ల తను ఇరు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని తెలిపారు. ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించి, ‘నమస్కారం’ అంటూ తెలుగులోనే ముగించారు! లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించదగ్గ కేసులు ఆంధ్రప్రదేశ్‌లో 80,831, తెలంగాణలో 91, 626 ఉన్నట్లు జస్టిస్ సేన్‌గుప్తా చెప్పారు. సుప్రీంకోర్టులో సోషల్ జస్టిస్ బెంచ్ ఏర్పాటు చేసినందుకు జస్టిస్ దత్తును జస్టిస్ నర్సింహారెడ్డి అభినందించారు. జస్టిస్ దత్తును సన్మానించారు. కాగా, శనివారం హైకోర్టులో జరిగిన లోక్ అదాలత్ ద్వారా 608 కేసులు పరిష్కారమయ్యాయి. దీని ద్వారా మూడు వేల మంది లబ్ధి పొందారు.
 
 హాస్యనటుడు అలీ ఔదార్యం
 హాస్యనటుడు అలీ పెద్దమనసుతో వ్యవహరిం చారు. తనను లక్షల రూపాయల మేర మోసం చేసిన ఓ మహిళపై జాలి చూపారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన సాంబశివరావు, శకుంతల దంపతుల ఇంటిని 1998లో అలీ కొనుగోలు చేశారు. ఈ ఇంటిపై సాంబశివరావు దంపతులు రూ.90 లక్షల బ్యాంక్ రుణం తీసుకున్న సంగతి దాచిపెట్టారు. దాంతో 2006లో వారిద్దరిపై అలీ చీటింగ్ కేసు పెట్టారు. శనివారం నాంపల్లి కోర్టులో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో అలీ పాల్గొన్నారు. శకుంతల దయనీయ పరిస్థితిని న్యాయమూర్తి వివరించడంతో, రావాల్సిన డబ్బు వదులుకొని కేసు వెనక్కు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement