ఢిల్లీలో ఆదివారం జరిగిన ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జాతీయ సదస్సులో హెచ్. ఎల్. దత్తు, నరేంద్ర మోదీ.
సంపాదకీయం
ఏడాదికోసారి జరిగే ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల జాతీయ సదస్సులో ఎన్నో ముఖ్యాంశాలు చర్చకొస్తుంటాయి. న్యాయస్థానాల్లో ఏళ్ల తరబడి అసంఖ్యాకంగా పేరుకుపోతున్న వ్యాజ్యాలు అందులో ఒకటి. మిగిలిన విషయాల మాటెలా ఉన్నా పెండింగ్ కేసుల వ్యవహారం మాత్రం ఎప్పటికీ పరిష్కారం కాదు. మళ్లీ మరో జాతీయ సదస్సు వరకూ ఆ సమస్య ఎవరికీ గుర్తుండదు. ఆదివారం జరిగిన జాతీయ సదస్సులోనూ యథాప్రకారం పెండింగ్ కేసుల ప్రస్తావన వచ్చింది. అయితే, అంతకన్నా ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై అందరి దృష్టీ పడింది. న్యాయవ్యవస్థ తీరుతెన్నులపై ఆయన నిశిత వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే న్యాయవ్యవస్థ నిర్భయంగా లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. రాజ్యాంగానికీ, చట్టానికీ అనుగుణంగా న్యాయాన్ని కలగజేసే దైవ సమానమైన విధి నిర్వహణలో తలమునకలయ్యే న్యాయమూర్తులు ‘ఫైవ్‌స్టార్ క్రియాశీలుర’ స్పందనలకు భయపడాల్సిన పనిలేదని కూడా మోదీ చెప్పారు. ప్రధాని స్థానంలో ఉన్నవారు న్యాయవ్యవస్థ భయపడుతున్నదనడమే కాదు... ఎవరి కారణంగా వారిలో ఆ భయం ఉన్నదో చెప్పడం అసాధారణమైన విషయం. తాము ఎప్పటిలా నిర్భయంగానే వ్యవహరిస్తున్నామని ఆ తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్. ఎల్. దత్తు జవాబిచ్చారు.
మోదీ చెబుతున్న ‘ఫైవ్‌స్టార్ క్రియాశీలురు’ చేపట్టే సమస్యలు సామాన్యులకు సంబంధించినవి. న్యాయస్థానాల్లోనూ, వెలుపలా ఆ సమస్యలపై పోరాడటం వారికి నిత్యకృత్యం. ఆ సమస్యలకు వారు చూపుతున్న పరిష్కారాలపై ఎవరికైనా అభ్యంతరాలుండొచ్చు. కానీ వారి చిత్తశుద్ధిని శంకించలేం. ఉదాహరణకు గుజ రాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలగుండా ప్రవహించే నర్మదా నదిపై నిర్మించతలపెట్టిన సర్దార్ సరోవర్ డ్యాంకు వ్యతిరేకంగా మేథాపాట్కర్, బాబా ఆమ్టే తదితరులు ఉద్యమించారు. సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేశారు. భారీ డ్యాంల నిర్మాణంవల్ల అడవులు నాశనమై పర్యావరణం దెబ్బతింటున్నదని, లక్షలాదిమంది ఆదివాసీలు నిరాశ్రయులై జీవిక కోల్పోతున్నారని ఆ సంస్థ వాదించగా...కరువు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించే మంచి ప్రాజెక్టును అడ్డుకుంటున్నా రని మరికొందరు విమర్శించారు. ఇక మధ్యప్రదేశ్‌లోని మహాన్‌లో ఎస్సార్, హిండాల్కో సంస్థలకు విద్యుదుత్పాదన కోసం కేటాయించిన బొగ్గు గనులవల్ల పర్యావరణం దెబ్బతింటుందని గ్రీన్‌పీస్ సంస్థ ఆరోపిస్తున్నది. వాటిని వెనక్కు తీసుకోవాలని కోరుతున్నది. అలాగే ఒడిశాలో బాక్సైట్ నిక్షేపాల వెలికితీత కోసం బహుళజాతి సంస్థలకు ఇచ్చిన అనుమతులను వెనక్కు తీసుకోవాలని ఉద్యమాలు సాగుతున్నాయి. దేశంలో భారీ కర్మాగారాలు నెలకొల్పకపోతే ఉపాధి, ఆర్థికాభి వృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించేవారూ ఉన్నారు. నోరులేని ఆదివాసీల తరఫున, సామాన్యుల తరఫున పోరాడుతున్న వ్యక్తులు, సంస్థలకు ఉద్దేశాలు ఆపాదించే బదులు వారు లేవనెత్తే అంశాల్లోని సహేతుకతపైనా...వారు సూచిస్తున్న పరిష్కా రాల్లోని సాధ్యాసాధ్యాలపైనా చర్చించడం అవసరం. అప్పుడు దేశానికి ఏది మంచో ప్రజలే నిర్ణయిస్తారు.
‘ఫైవ్‌స్టార్ క్రియాశీలురు’ లేకపోతే 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, బొగ్గు స్కాం వంటివి బయటికొచ్చేవి కాదన్నది నిజం. లక్షల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న ఈ స్కాంలను సామాన్యులెవరైనా బయట పెట్టడం అసాధ్యం. అయితే, మోదీ అభ్యంతరం వీటికి సంబంధించి కాదని స్పష్టం గానే చెప్పవచ్చు. ఎందుకంటే ఇవన్నీ వరసబెట్టి బయటపడ్డాక కాంగ్రెస్ అన్ని విధాలా భ్రష్టుపట్టడం...అది సహజంగానే బీజేపీకి లాభించడం కాదనలేని సత్యం. అయితే ఇటీవలికాలంలో న్యాయస్థానాలిచ్చిన రెండు కీలక తీర్పులు పాలకులను ఇరకాటంలోకి నెట్టాయి. గ్రీన్‌పీస్ ఉద్యమ కార్యకర్త ప్రియాపిళ్లై మొన్న జనవరిలో లండన్ వెళ్లబోతుండగా విమానంలోనుంచి ఆమెను బలవంతంగా దింపేయడం... అనంతరం ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినప్పుడు కేంద్ర ప్రభుత్వ చర్యను న్యాయస్థానం తప్పుబట్టడం అందరికీ తెలుసు. అలాగే, సామాజిక మాధ్యమాల్లో విమర్శలను నియంత్రించేందుకు ప్రభుత్వాలకు విశేషాధికారాలిస్తున్న ఐటీ చట్టం లోని సెక్షన్ 66 ఏ ఉంచడం అవసరమని కేంద్ర ప్రభుత్వం వాదించగా సుప్రీంకోర్టు ఆ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని, భావప్రకటనా స్వేచ్ఛకు భంగకరమని తీర్పు నిచ్చింది. ఇలాంటి తీర్పులు రావడంపై మోదీ కినుక వహించారని కొందరంటున్న దాంట్లో వాస్తవం లేకపోలేదు.
1979 ప్రాంతంలో జైళ్లలో విచారణ లేకుండా మగ్గిపోతున్న ఖైదీల స్థితిగతులపై మీడియా కథనాలనే సుప్రీంకోర్టు పిటిషన్‌గా స్వీకరించడంతో మన దేశంలో ‘న్యాయవ్యవస్థ క్రియాశీలత’ ప్రారంభమైంది. అటు తర్వాత ఆగ్రాలోని నారీ సంర క్షణ కేంద్రంలో అమానవీయ పరిస్థితులు, ఆసియాడ్ నిర్మాణపనుల కార్మికులకు అత్యల్ప వేతనాలివ్వడం, క్వారీల్లో వెట్టిచాకిరీ వంటి అనేకానేక అంశాల్లో న్యాయ స్థానాలు విలువైన తీర్పులిచ్చాయి. అనంతరకాలంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) ఉద్దేశమే దెబ్బతింటున్నదని, పాలనా వ్యవహారాల్లో సైతం న్యాయ స్థానాలు తలదూర్చి నిర్ణయాలు తీసుకుంటున్నాయని విమర్శలు రావడం మొదలైంది. ఆ విమర్శల ప్రభావంవల్లనే కావొచ్చు... గతంతో పోలిస్తే న్యాయస్థానాలు పిల్స్ విష యంలో పరిమితంగానే వ్యవహరిస్తున్నాయి. నరేంద్ర మోదీకి వక్తగా పేరుంది. అందరినీ ఆకట్టుకునేలా చెప్పగలరు. అయితే న్యాయవ్యవస్థ ఎవరికో భయపడి తీర్పులిస్తున్నదని ధ్వనించడం, సమస్యలను లేవనెత్తేవారిని ‘ఫైవ్‌స్టార్ క్రియా శీలుర’ని ఎద్దేవా చేయడం బహిరంగ సభావేదికలపై ఏమోగానీ... జాతీయ న్యాయ సదస్సు వంటిచోట అతకదు. దీనికి బదులు ఆయా సమస్యలపైనా, న్యాయస్థానాల పనితీరుపైనా నిర్దిష్టమైన చర్చకు అంకురార్పణ చేస్తే ప్రయోజనం ఉంటుంది.