ఎన్హెచ్చార్సీ చైర్మన్ హెచ్ ఎల్ దత్తూ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్చార్సీ) చైర్మన్ గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది మేలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ పదవీకాలం ముగియడంతో ఎన్ హెచ్చార్సీ చైర్మన్ పదవికి ఖాళీ ఏర్పడింది. అప్పటినుంచి జస్టిస్ సిరియాక్ జోసెఫ్ ఇన్ చార్జి చైర్ పర్సన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. దత్తూ నియామకంతో ఎన్ హెచ్చార్సీ పదవికి పూర్తికాల చైర్మన్ ను నియమించినట్లైంది. ఆ పదవి చేపట్టినవారిలో దత్తూ ఏడోవారు. న్యాయమూర్తిగా సుదీర్ఘ అనుభవం ఉన్న హెచ్ ఎల్ దత్తూ అనేక కేసుల్లో చట్టాల్ని అనుసరించి విభిన్న తీర్పులు చెప్పారు.
1950, డిసెంబర్ 3న కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లా కాదూర్ లో జన్మించిన దత్తూ.. కాదూర్, తరికేరి, బిరూరుల్లో ప్రాధమికవిద్యను పూర్తిచేశారు. ఉన్నత చదువుల కోసం బెంగళూరు వచ్చిన ఆయన అక్కడే ఎల్ఎల్ బీ పూర్తిచేశారు. 1975లో కర్ణాటక బార్ అసోసియేషన్ లో పేరు నమోదుచేయించుకున్న ఆయన పలు సివిల్, క్రిమినల్ కేసులను సమర్థవంతంగా వాదించి పేరుతెచ్చుకున్నారు. 1995లో కర్ణాటక హౌకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన హెచ్ఎల్ దత్తూ.. 2008లో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. 2014లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీఐజే)గా ఎంపికై 2015, డిసెంబర్ 2 వరకు కొనసాగారు. అపార అనుభవం ఉన్న హెచ్ ఎల్ దత్తు సేవలను వినియోగించుకోవాలనుకున్న కేంద్రం ఆయనను ఎన్ హెచ్ ఆర్సీ చైర్మన్ గా నియమించింది.