1,061 అధ్యాపక పోస్టులు
♦ వర్సిటీల్లో భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్లు
♦ మార్గ్గదర్శకాలు ఖరారు చేసిన వైస్ చాన్స్‌లర్ల కమిటీ
♦ ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక..
♦ తర్వాత రెండు మూడు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు
♦ వర్సిటీల వారీగా వేర్వేరుగా నోటిఫికేషన్లు
♦ ఆబ్జెక్టివ్ విధానంలో స్క్రీనింగ్ టెస్టు
♦ 1:3 రేషియోలో ఇంటర్వ్యూలకు ఎంపిక
సాక్షి, హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,061 అధ్యాపక పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. వారం పది రోజుల్లో ఆయా యూనివర్సిటీల వారీగా నోటిఫికేషన్లు జారీకానున్నాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఈ అధ్యాపక పోస్టుల భర్తీ కోసం అనుసరించాల్సిన నియమ నిబంధనలు, మార్గదర్శకాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాల్‌రెడ్డి, ఉస్మానియా వీసీ రామచంద్రం, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ సీతారామారావులతో కూడిన వీసీల కమిటీ ఖరారు చేసింది. ఈ మేరకు నివేదికను ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి అందజేయనుంది.
తర్వాత రెండు మూడు రోజుల్లోనే నియమ నిబంధనలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఆ వెంటనే వర్సిటీల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీకానున్నాయి. మొత్తంగా యూనివర్సిటీల్లో 1,551 పోస్టులు ఖాళీగా ఉండగా.. మొదటి దశలో 1,061 పోస్టుల భర్తీకి గత నెలలోనే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆమోదం తెలిపారు. దీంతో నియమ నిబంధనల రూపకల్పన కోసం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వీసీల కమిటీని ఏర్పాటు చేయగా.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం మార్గదర్శకాలను సిద్ధం చేశారు.
మార్గదర్శకాల్లోని ప్రధాన అంశాలివీ..
అధ్యాపక పోస్టుల భర్తీకి యూనివర్సిటీల వారీగా వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేస్తారు. అవి జాతీయ స్థాయి నోటిఫికేషన్లుగా ఉంటాయి.
అన్ని యూనివర్సిటీలకు ఒకే రకమైన పరీక్షా విధానం ఉంటుంది. సబ్జెక్టును బట్టి పరీక్ష అంశాల్లో మార్పు ఉంటుంది.
భర్తీ ప్రక్రియలో ముందుగా స్క్రీనింగ్ టెస్టు ఉంటుంది. 100 మార్కులకు లేదా 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
స్క్రీనింగ్ టెస్టు అర్హత సాధించిన వారి లో 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు నిర్వ హించి.. పోస్టులకు ఎంపిక చేస్తారు.
యూజీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం... అధ్యాపక నియామకాల్లో పరిశోధనలు, పరిశోధన పత్రాలు, ప్రాజెక్టులు, శిక్షణలు, కో–కరిక్యులర్ యాక్టివిటీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. ఇంటర్వ్యూ విధానంలో అకడమిక్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్‌ను పరిశీలించాలి. ముఖ్యంగా పరిశోధన పత్రాలకు (జర్నల్స్ తదితరాలు) 30 శాతం, పరిశోధన పబ్లికేషన్స్ (పుస్తకాలు తదితరాలు)కు 25 శాతం, పరిశోధన ప్రాజెక్టులకు 20 శాతం, రీసెర్చ్ గైడెన్స్‌కు 10 శాతం, శిక్షణ కోర్సులు, సదస్సులు/సమావేశాలకు 15 శాతం స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే జ్ఞానం, పరీక్షలు, మూల్యాంకనంలో భాగస్వామ్యం, బోధనా సామర్థ్యం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వంటి సహ పాఠ్య కార్యక్రమాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. వీటికి 50 శాతం స్కోర్ నిర్ధారించగా.. కనీసంగా 15 శాతం స్కోర్ సాధించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను తాజాగా అధ్యాపక పోస్టుల భర్తీలో అమలు చేయనున్నారు.