న్యూఢిల్లీ: పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరిన వేళ విపక్ష నేతల ఫోన్ల హ్యాకింగ్ వార్తలు దేశవ్యాప్తంగా పెను రాజకీయ సంచలనానికి దారితీశాయి. కాంగ్రెస్ మొదలుకుని పలు విపక్షాల ఎంపీలు తదితరుల ఐఫోన్లకు దాని తయారీ సంస్థ యాపిల్ నుంచి మంగళవారం వచ్చిన హ్యాకింగ్ అలర్టులు తీవ్ర కలకలం రేపాయి. ‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న హ్యాకర్లు మీ ఐఫోన్లను నియంత్రణలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ వచ్చిన హెచ్చరిక నోటిఫికేషన్లు సంచలనం సృష్టించాయి.
ఇది కచ్చితంగా కేంద్రంలోని మోదీ సర్కారు పనేనంటూ విపక్ష నేతలు భగ్గుమన్నారు. గతంలో పెగసెస్ సాఫ్ట్‌వేర్‌తో తమపై గూఢచర్యం చేసిన బీజేపీ, ఎన్నికల వేళ మరోసారి ఇలాంటి చౌకబారు చర్యలకు దిగిందంటూ దుయ్యబట్టారు. ఈ ఆరోపణలను కేంద్రం తీవ్రంగా ఖండించింది. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించి వాస్తవాలు వెలుగులోకి తెస్తామని ప్రకటించింది.
మరోవైపు ఈ కలకలం నేపథ్యంలో, తమ నోటిఫికేషన్లలో కొన్ని ఫేక్ అలర్టులు కూడా ఉండొచ్చంటూ యాపిల్ స్పందించింది. భారత్‌లోనేగాక 150 దేశాల్లో పలువురు యూజర్లకు ఇలాంటి అలర్టులు వచ్చాయని పేర్కొంది. అయితే ఈ అలర్టులకు దారితీసిన కారణాలను బయట పెట్టేందుకు నిరాకరించింది.
దుయ్యబట్టిన విపక్ష నేతలు
ఈ ఉదంతంలో కేంద్రప్రభుత్వ పాత్ర కచ్చితంగా ఉందంటూ విపక్ష నేతలు ఆరోపించారు. తమ ఫోన్లలో అభ్యంతరకర సమాచారాన్ని చొప్పించి అందుకు తమను బాధ్యులను చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ అంశాన్ని తక్షణం లోక్‌సభ హక్కుల కమిటీకి నివేదించాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛ, గోప్యతలపై ఇలాంటి దాడి దారుణమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మండిపడ్డారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తదితర విపక్ష నేతలను విచారణ పేరుతో వేధించడం, తాజాగా వారి ఫోన్ల హ్యాకింగ్‌కు ప్రయత్నించడం మోదీ సర్కారు అభద్రతా భావానికి సూచనలని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.
లోతుగా దర్యాప్తు: ఐటీ మంత్రి వైష్ణవ్
విపక్ష నేతల ఆరోపణలను కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొట్టిపారేశారు. మోదీ నాయకత్వంలో దేశ ప్రగతిని చూసి ఓర్వలేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఈ ఉదంతంపై కూలంకషంగా దర్యాప్తు జరిపించి నోటిఫికేషన్ల వ్యవహారాన్ని నిగ్గుదేలుస్తామని ప్రకటించారు. ‘పూర్తి పారదర్శకంగా సరైన సమాచారాన్ని అందజేయడం ద్వారా విచారణలో మాతో కలిసి రావాల్సిందిగా యాపిల్‌ను కోరాం.
ముఖ్యంగా ప్రభుత్వ దన్నుతో హ్యాకింగ్ జరగవచ్చని ఏ ఆధారంతో చెప్పారో వివరించాలని సూచించాం. ఇది పూర్తిగా సాంకేతికపరమైన దర్యాప్తు. కనుక కంప్యూటర్ సెక్యూరిటీ సంబంధిత అంశాలకు బాధ్యత వహించే జాతీయ నోడల్ ఏజెన్సీ సెర్ట్–ఇన్ దీన్ని చేపడుతుంది.’ అని మంత్రి ప్రకటించారు. ఇలాంటి నోటిఫికేషన్లు 150కి పైగా దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు వచ్చాయని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు.
నా ఫోన్ తీసుకోండి: రాహుల్
ఈ ఉదంతంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. విపక్ష నేతల ఐఫోన్ల హ్యాకింగ్ కచ్చితంగా మోదీ సర్కారు పనేననంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘మేం భయపడేది లేదు. మా ఫోన్లను ఎంతగా హాకింగ్ చేసుకుంటారో చేసుకోండి. మీకు కావాలంటే చెప్పండి, నా ఫోన్ కూడా ఇస్తా’ అంటూ విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్త గౌతం అదానీయే ప్రస్తుతం దేశాన్ని రిమోట్ కంట్రోల్‌తో నడుపుతున్నారని ఆరోపించారు. ‘ఇప్పుడు దేశంలో అదానీయే నంబర్ వన్. తర్వాతి స్థానాల్లో మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారు. మోదీ ఆత్మ అదానీ దగ్గరుంది. అందుకే అదానీని ఎవరైనా ఒక్క మాటన్నా వెంటనే నిఘా వర్గాలు రంగంలోకి దిగుతున్నాయి.
అలర్టులు అందుకున్న నేతలు..
మల్లికార్జున ఖర్గే, శశి థరూర్, పవన్ ఖేరా, కె.సి.వేణుగోపాల్, సుప్రియా శ్రీనేత్, టి.ఎస్.సింగ్‌దేవ్, భూపీందర్ సింగ్ హుడా, రాహుల్‌గాంధీ సహాయకులు, మహువా మొయిత్రా (టీఎంసీ), సీతారాం ఏచూరి (సీపీఎం), ప్రియాంకా చతుర్వేది (శివసేన–యూబీటీ), రాఘవ్ ఛద్దా (ఆప్), అసదుద్దీన్ ఒవైసీ (మజ్లిస్), సమీర్ సరణ్ (ఓఆర్‌ఎఫ్ అధ్యక్షుడు), సిద్ధార్థ్ వరదరాజన్ (ద వైర్ వ్యవస్థాపక ఎడిటర్), ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓఎస్డీ తదితరులు
యాపిల్ అలర్టులో ఏముందంటే...
‘ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేసే హాకర్లు మీ ఐఫోన్‌ను టార్గెట్ చేసుకుని ఉండొచ్చని యాపిల్ అనుమానిస్తోంది. బహుశా మీ హోదా, మీరు చేస్తున్న పనుల వల్ల మీరు వ్యక్తిగతంగా వారి లక్ష్యంగా మారి ఉండొచ్చు. ఇలాంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని హాకర్లు మీ ఫోన్‌ను హాక్ చేసి తమ అ«దీనంలోకి తీసుకుంటే అందులోని సున్నితమైన డేటా, సమాచారంతో పాటు కెమెరా, మైక్రోఫోన్ వారి చేతిలోకి వెళ్లిపోతాయి. ఇది ఫేక్ హెచ్చరికే అయ్యుండే ఆస్కారమూ లేకపోలేదు. కానీ దయచేసి దీన్ని సీరియస్‌గా తీసుకోండి’
Comments
Please login to add a commentAdd a comment