న్యూఢిల్లీ: ఏ నిమిషంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండడంతో రాజధాని నగరంలో రాజకీయాలు జోరందుకున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు పార్టీ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నట్లు ఊహాగానాలు సాగుతుండడంతో ఆశావహుల సంఖ్య ఆ పార్టీలో ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేటర్లుగా ఉన్న చాలా మంది శాసనసభ్యులుగా పదోన్నతి పొందాలని ఆశిస్తున్నారు. దీంతో కొన్ని రోజులుగా పండిట్ పంత్ మార్గ్‌లోని బీజేపీ కార్యాలయం ఆ పార్టీ కార్పొరేటర్లతో సందడిగా మారింది.
బీజేపీ ఢిల్లీ విభాగం ప్రస్తుత అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ కూడా స్వయంగా కౌన్సిలర్ కావడంతో, సహచర కార్పొరేటర్లు చాలా మంది తమకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాలని ఆయన్ని కోరుతున్నట్లు తెలిసింది. అసెంబ్లీ టికెట్ కోరుతున్న కార్పొరేటర్లలో ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ యోగేందర్ చందోలియా మొదటి స్థానంలో ఉన్నారు. పార్టీ హైకమాండ్ తనకు టికెట్ ఇస్తే తప్పకుండా బరిలోకి దిగుతానని ఆయన చెప్పారు. తనకు కరోల్‌బాగ్ స్థానం నుంచి టికెట్ లభించవచ్చని చందోలియా ఆశాభావం వ్యక్తం చేశారు. రోహిణి జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రేఖా గుప్తా కూడా తనకు షాలీమార్ బాగ్ నుంచి పోటీ చేయాల నుందని మనసులో మాట చెప్పారు. అయితే తాము టికెట్ కోసం బీజేపీ ఆఫీసు చుట్టూ చక్కర్లు కొడుతున్నామన్నది మాత్రం నిజం కాదని చెప్పుకున్నారు.
దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఖుషీ రామ్ చునర్, విద్యా కమిటీ చైర్మన్ ఆశిష్ సూద్‌లకు అసెంబ్లీ బెర్తు ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఖుషీరామ్ అంబేద్కర్ నగర్ నుంచి, సూద్ జనక్‌పురీ నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగుతారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మరికొంత మంది కార్పొరేటర్లు, తమను సరైన అభ్యర్థులుగా పార్టీ గుర్తించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాను స్టాండింగ్ కమిటీ, సభా సమావేశాల్లో అనేక అంశాలను లేవనెత్తుతున్నానని, అయినా పార్టీ హైకమాండ్ తనను గుర్తించడం లేదని ఓ కౌన్సిల్ ఆవేదన వ్యక్తం చేశారు.
టికెట్ కోసం కౌన్సిలర్ల చక్కర్లు
Published Tue, Nov 25 2014 11:22 PM | Last Updated on Tue, Oct 16 2018 6:15 PM
Advertisement
Advertisement