
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి రష్యాకు చెందిన ఓ మీడియా సంస్థ ట్వీటర్‌లో దాదాపు 2,000 ప్రకటనలు ఇచ్చిందని ట్వీటర్ ప్రతినిధులు తెలిపారు. ఈ ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణ జరుపుతున్న రెండు అమెరికా కాంగ్రెస్ కమిటీలకు పూర్తి వివరాలను అందజేసినట్లు వెల్లడించారు.
రష్యా ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలున్న ఆర్టీ అనే మీడియా సంస్థ 2016 ఏడాది ట్వీటర్‌లో ప్రకటనల కోసం దాదాపు 2,74,000 డాలర్లు(రూ.1.79 కోట్లు) ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికే ఈ మొత్తాన్ని వినియోగించి ఉంటారని అనుమానిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ఫేస్‌బుక్‌లో వాడిన 450 ఖాతాలకు గానూ 22 అకౌంట్లు ట్వీటర్‌లో కూడా కొనసాగుతున్నట్లు గుర్తించామన్నారు. ట్వీటర్ నిబంధనలను ఉల్లంఘించినందున ఈ ఖాతాలన్నింటిని వెంటనే తొలగిస్తున్నట్లు వెల్లడించారు.