
ఈ నెలలోనే ‘సింగరేణి’ నోటిఫికేషన్
హైదరాబాద్: సింగరేణి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి కల ఫలించనుంది. మొత్తం 5,500 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ప్రకటించింది. సింగరేణిలో ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులతో పాటు ఇతరులకు అవకాశం కల్పించేలా రిక్రూట్‌మెంట్ చేపట్టేందుకు కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల నుంచే రిక్రూట్‌మెంట్ ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు.
కొత్త నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 5,500 పోస్టులు భర్తీ చేస్తారు. అందులో 2,164 పోస్టులకుగాను ఫిబ్రవరి 10న నోటిఫికేషన్ జారీ చేస్తారు. వీటిలో 1,127 పోస్టులు మైనింగ్, సివిల్ డిగ్రీ, ఎలక్ట్రికల్, మెకానికల్ డిప్లొమా హోల్డర్లకు, 771 పోస్టులు ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, మైన్ సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్లు, 266 పోస్టులు పారా మెడికల్, ఇతర టెక్నికల్ సిబ్బందికి సంబంధించినవి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పరీక్షలు నిర్వహించి.. జూన్ వరకు ప్రక్రియను పూర్తి చేస్తారు. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ జరగాలని.. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ శ్రీధర్ సూచించారు.
డిపెండెంట్లకు ఉద్యోగాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు పదేళ్లుగా నిరీక్షిస్తున్న డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. 2004 వరకు... మొత్తం 2,744 మంది డిపెండెంట్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. అందులో 753 మందికి ఇప్పటికే ఉద్యోగాలు కల్పించారు. మిగిలిన 1,991 మంది డిపెండెంట్లకు ఈ ఏడాది ఆగస్టు నాటికి వివిధ పోస్టుల్లో భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వీటికి తోడు ఇప్పటికే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు.. అర్హతలను బట్టి పైస్థాయి పోస్టుల్లో అవకాశం కల్పించేందుకు ఇంటర్నల్ మోడ్‌లో ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది.