వచ్చే నెల 30లోగా నోటిఫికేషన్లు
ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్‌భాస్కర్ వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 4,009 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 30లోగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయ్‌భాస్కర్ వెల్లడించారు. ఈ పరీక్షలను తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు చెప్పారు. బుధవారం విశాఖలో ఆయన మీడియా మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లలో ఇంకా భర్తీకి నోచుకోని పోస్టులను కూడా ఈసారి కలిపి భర్తీ చేయనున్నట్టు తెలిపారు.
కాగా, గతంలో జరిగిన జాప్యం వల్ల వయోపరిమితిని ఆరేళ్లకు సడలిస్తూ జారీ చేసిన జీవో సెప్టెంబర్ 30తో ముగుస్తుందన్నారు. అందువల్ల ఈలోగా ఇచ్చే నోటిఫికేషన్లకే 40 ఏళ్ల వయోపరిమితి వర్తిస్తుందని చెప్పారు. ఆన్‌లైన్ పరీక్షల వల్ల అవకతవకలకు ఆస్కారం ఉండదన్నారు. ఆన్‌లైన్ పరీక్షల నిర్వహణ కోసం ఏపీ ఆన్‌లైన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. గ్రూప్-1, 2, 3 పోస్టులకు 50 వేల మందికి పైగా అభ్యర్థులు పోటీపడే అవకాశం ఉన్నందున.. తొలుత స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో అర్హత సాధించిన వారినే ఆన్‌లైన్ పరీక్షకు అనుమతిస్తామన్నారు.