అంబర్‌పేట: లక్షల్లో ఉద్యోగాల జాతర అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రకటనలకు క్షేత్ర స్థాయిలో చర్యలకు పొంతనే లేదని ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఉద్యోగాలు ఖాళీ ఉంటే వందల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. గురువారం అంబర్ పేటలో జరిగిన నిరుద్యోగ జేఏసీ గర్జన సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 2 లక్షల ఖాళీ పోస్టుల భర్తీ కోసం తక్షణమే నోటిఫికేషన్‌లు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూప్-2 సర్వీస్ ఉద్యోగాలను 439 నుంచి 3500 పెంచాలని కోరారు. 1200 గ్రూప్-1, 8000 గ్రూప్-3, 36000 గ్రూప్-4 ఉద్యోగాల కోసం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వ, జూనియర్, డిగ్రీ, ఎయిడెడ్, రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 9000 జూనియర్ లెక్చర్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలన్నారు.
టీచర్ పోస్టులను 15600 నుంచి 39 వేలకు పెంచాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. పోలీసు, ఆర్టీసీ, మున్సిపల్, విద్యుత్ శాఖల్లో వేలాదిగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వాటిని తక్షణమే భర్తీ చేయాలని ఆయన కోరారు. ఉద్యోగ నియామకాలను వెంటనేచేపట్టకపోతే లక్షలాది మంది నిరుద్యోగులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
'ఖాళీలు లక్షల్లో.. నియామకాలు వందల్లోనా'
Published Thu, Feb 18 2016 6:45 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM
Advertisement