1,000 విద్యుత్ ఏఈ పోస్టులు
భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో దాదాపు 1,000 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ జారీ కానుంది. ఈ మేరకు విద్యుత్ సంస్థలు కసరత్తు ప్రారంభించాయి. రాష్ట్రంలో నిరం తర విద్యుత్, వ్యవసాయానికి కూడా 24 గంటల విద్యుత్ సరఫరాను పక్కాగా అమ లు చేసేందుకు కృషి చేస్తున్న విద్యుత్ ఉద్యో గులకు భారీ ఎత్తున పదోన్నతులు కల్పిస్తా మని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆరు నెలలు కిందే 13,500 కొత్త పోస్టులను మంజూరు చేశారు. ఆ పోస్టుల్లోకి ఇటీవల పదోన్నతులు కల్పించడంతో కింది స్థాయి పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర విద్యుదు త్పత్తి సంస్థ (జెన్‌కో), విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో), ఉత్తర తెలంగాణ విద్యు త్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)లలోని వివిధ విభాగాల్లో దాదాపు 1,000 ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయా సంస్థల యాజమాన్యాలు గుర్తించాయి. వీటిని భర్తీ చేసేందుకు వచ్చే నెలలో ఉద్యోగ నియామక ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించాయి. వీటితోపాటు నాన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను సైతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని యోచిస్తున్నాయి. మొత్తంగా పోస్టుల భర్తీపై కసరత్తు ఇంకా పూర్తికాకపోవడంతో కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు ఇప్పుడే వెల్లడించలేమని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
వారంలో ఔట్ సోర్సింగ్ క్రమబద్ధీకరణ
విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. స్థానికత, పుట్టిన తేదీ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే... ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో 22 వేల మందికి పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అర్హులని దరఖాస్తుల పరిశీలన కోసం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీలు గుర్తించాయి. ఈ మేరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా విలీనం చేసుకునే ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే న్యాయస్థానాల తీర్పులకు లోబడే క్రమబద్ధీకరణ జరుపుతామని ట్రాన్స్‌కో ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.