వారంలో గ్రూప్స్ సిలబస్!
వెబ్‌సైట్‌లో పెట్టేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు
* అభ్యర్థులకు చదువుకునే సమయం ఇచ్చే యోచన
* ఆయా కేడర్లలో రానున్న మరిన్ని పోస్టులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు.. పూర్తి స్థాయి సిలబస్ ఏంటో తెలియదు.. కొత్త రాష్ట్రంలో సిలబస్ మార్చుతున్నారు... అదేంటో స్పష్టత లేదు.. ఏ పుస్తకాలు చదువాలో అంతుచిక్కడం లేదు.. ప్రభుత్వం అనుమతిచ్చింది కనుక వెంటనే నోటిఫికేషన్లు ఇస్తే చదువుకునే సమయం ఉంటుందా ఇలా అనేక ప్రశ్నలు నిరుద్యోగ అభ్యర్థుల మెదళ్లను తొలిచేస్తున్నాయి!
వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా టీఎస్‌పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. సిలబస్‌లో ఎక్కువ మార్పులు ఉండే గ్రూపు-1, గ్రూపు-2 విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందకుండా కార్యాచరణపై దృష్టి పెట్టింది. చదువుకునే సమయం ఇవ్వడంతోపాటు, పూర్తి స్థాయి సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పరీక్షల విధానం, 15,522 పోస్టుల భర్తీకి ఆమోదం, ఆయా పేపర్లలో ఉండే సిలబస్ ఔట్‌లైన్ ఇచ్చినందున, అందుకనుగుణంగా వారం పది రోజుల్లో పూర్తి సిలబస్‌ను, వాటిల్లోని టాపిక్స్‌ను అభ్యర్థులకు అందుబాటులోకి తేనుంది.
మరో ఐదారు రోజుల్లో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీటికి సంబంధించిన సిలబస్ రూపకల్పనకు చర్యలు చేపట్టింది. గత నెలలో ప్రభుత్వం వివిధ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన వెంటనే పూర్తి స్థాయి సిలబస్ రూపకల్పనపై టీఎస్‌పీఎస్సీ దృష్టి సారించింది. ఇంజనీర్ పోస్టుల్లోనే పది రకాల పోస్టులు ఉండటం, వాట న్నింటికి అవసరమైన సిలబస్ రూపకల్పన చేయిస్తోంది. గత వారం నుంచి పలువురు ప్రొఫెసర్ల నేతృత్వంలో ఇదే పనిలో నిమగ్నమైంది. ఇది పూర్తయ్యేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది.
ఆ తరువాత మొదటి నోటిఫికేషన్లుగా ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ చేసేందుకు సిద్ధమైంది. వాటికి సెప్టెంబర్, అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహించి, ఫలితాలను ప్రకటించాలన్న ఆలోచనలు చేస్తోంది. ఈ నోటిఫికేషన్ల తరువాత ఇతర శాఖల్లోని పోస్టులకు పూర్తిస్థాయి సిలబస్ రూపొందించి, ఒక్కొక్కటిగా వరుస క్రమంలో నోటిఫికేషన్లను జారీ చేయాలని యోచిస్తోంది. ఇక ఈసారి ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడాన్ని నియంత్రించేందుకు బయోమెట్రిక్ విధానం (పరీక్ష సమయంలో వేలి ముద్రలు తీసుకోవడం) అమల్లోకి తేవాలని భావిస్తోంది.
అలాగే పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకూ ఆలోచనలు చేస్తోంది. ముందు సిలబస్.. తరువాత నోటిఫికేషన్లు వారం పది రోజుల్లో గ్రూపు-1, గ్రూపు-2 తదితర పోస్టుల సిలబస్ ఖరారు చేసి వెబ్‌సైట్‌లో పెట్టేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈనెల 15లోగా సిలబస్ ఇచ్చాక నెలా.. రెండు నెలల సమయమిచ్చి అక్టోబర్‌లో గ్రూపు-2 నోటిఫికేషన్ జారీ చేస్తే బాగుంటుందని యోచిస్తోంది. దీంతో అభ్యర్థులకు సమయం ఇవ్వలేదన్న అపవాదు ఉండదు.
ఇక గ్రూపు-3 కూడా అదే సమయంలో ఇవ్వాలా? అంతకంటే ముందుగానే ఇవ్వాలా? అన్న ఆలోచనలు చేస్తోంది. మరోవైపు గ్రూపు-1 నోటిఫికేషన్‌ను మాత్రం డిసెంబరు నాటికి ఇవ్వడమే మంచిదన్న భావన ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతిచ్చిన పోస్టుల్లో గ్రూపు-1 పోస్టులు కేవలం 56 వరకే ఉన్నాయి. అయితే అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌కు నోటిఫికేషన్ ఇస్తే మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. పైగా అప్పటివరకు ఉద్యోగుల విభజన చివరి దశకు చేరుకోనుండటంతో మరిన్ని పోస్టులు రానున్నాయి. గ్రూపు-2లోనూ ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశముంది.
వార్షిక కేలండర్ అమలు దిశగా..
ప్రధానంగా గ్రూప్స్ పరీక్షల విషయంలో వార్షిక కేలండర్ అమలు దిశగా టీఎస్‌పీఎస్సీ యోచిస్తోంది. పోస్టులు ఖాళీ అయిన కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్లు ఇవ్వడం కాకుండా.. ఏడాదిలో నిర్ణీత సమయంలో నోటిఫికేషన్లు ఇస్తూ... వీలైనంత వరకు వార్షిక కేలండర్‌ను అమలు చేయడం మంచిదన్న భావనతో ఉంది. ఇక గ్రూపు-2 పరీక్షల నిర్వహణను సివిల్స్ పరీక్షల సమయంతో క్లాష్ కాకుండా పరీక్ష తేదీలను ప్రకటించే ఆలోచన చేస్తోంది.