Groups syllabus
-
ఏపీపీఎస్సీ గ్రూప్స్ సిలబస్ ఖరారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ గ్రూప్ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను కమిషన్ ఒక కొలిక్కి తెచ్చింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలకు తుది ముసాయిదా సిలబస్‌ను కమిషన్ అధికారులు దాదాపుగా ఖరారు చేశారు. ఈ సిలబస్‌ను కమిషన్ శుక్రవారం తన అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. అయితే ఈ ముసాయిదాకు స్వల్పంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి తుది సిలబస్‌ను త్వరలో అభ్యర్ధులకు అందుబాటులోకి తేనున్నట్లు ఏపీపీఎస్సీ వర్గాలు వివరించాయి. ప్రస్తుతం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in లో దీన్ని ఫైనల్ సిలబస్‌గా అప్లోడ్ చేశారు. ఫైనల్ సిలబస్‌గా అప్లోడ్ చేసినప్పటికీ వాటిలో కొన్నిటికి స్వల్ప మార్పులు చేయనున్నామని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకు ముందు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2, 4లకు మాత్రమే సిలబస్‌ను ఇచ్చేది. ఈసారి గ్రూప్ 3 సిలబస్‌ను రూపొందించి వెబ్సైట్లో పెట్టింది. 2011 గ్రూప్1 పోస్టులలో కోత.. ఇదిలా ఉండగా 2011 గ్రూప్1 నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టుల్లో దాదాపు 30 పోస్టులకు కోతపెట్టాలని ఏపీపీఎస్సీ చూస్తోందని ఆ గ్రూప్ పరీక్షలు రాసిన అభ్యర్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2011 గ్రూప్1 పోస్టులకు సంబంధించి మళ్లీ మెయిన్స్ నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆ నోటిఫికేషన్‌లోని 312 పోస్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీ, తెలంగాణలకు సంబంధించినవి. ప్రస్తుతం తొలగించాలని భావిస్తున్న పోస్టులు 30 పోస్టులను రెండు రాష్ట్రాల పోస్టులనుంచి తొలగించాల్సి ఉంది. కానీ ఏపీపీఎస్సీ ఏకపక్షంగా విభజిత ఏపీకి సంబంధించిన కోటాలోని 172 పోస్టుల నుంచి మినహాయించాలని చూస్తోందని అభ్యర్ధులు ఆవేదన చెందుతున్నారు. దీనివల్ల ఏపీలోని అభ్యర్ధులు తీవ్రంగా నష్టపోతారని చెబుతున్నారు. ఉమ్మడి నోటిఫికేషన్‌లోని పోస్టులను తగ్గించాల్సి వస్తే రెండు రాష్ట్రాల పోస్టుల నుంచి తొలగింపు ఉండాలే తప్ప ఒక్క రాష్ట్రం నుంచే మినహాయించడం సరికాదని వారంటున్నారు. -
గ్రూపుల సిలబస్ వచ్చేసింది!
ఈ నెలలోనే 80 శాతం వరకు నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించే వివిధ పోటీ పరీక్షల పూర్తిస్థాయి సిలబస్ సోమవారం విడుదలైంది. కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్, చుక్కా రామయ్య నేతృత్వంలో ఈ సిలబస్‌ను విడుదల చేశారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల సిలబస్‌ను ప్రకటించారు. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల సిలబస్‌నూ వెబ్సైట్లో (www.tspsc.gov.in) అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మాట్లాడారు. సాధారణంగా సిలబస్‌ను నోటిఫికేషన్లతోపాటే జారీ చేస్తారని, కానీ కొత్త రాష్ట్రంలో కొత్త సిలబస్ అయినందున చదువుకునేందుకు సమయం కావాలన్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ముందుగానే విడుదల చేస్తున్నామని చెప్పారు. పోటీ పరీక్షల మౌలిక స్వరూపాన్ని (స్కీం) 32 మంది నిపుణులు నెల రోజులపాటు శ్రమించి పూర్తి చేశారని తెలిపారు. దానిని ప్రభుత్వ సీఎస్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి, ఆమోదించాయని చెప్పారు. ఈ పోటీ పరీక్షల స్కీమ్‌కు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం గత నెల 27న ఉత్తర్వులు జారీ చేసిందని... అప్పటినుంచి 85 మంది ప్రొఫెసర్లు ఈనెల 27 వరకు రేయింబవళ్లు కూర్చొని పూర్తిస్థాయి సిలబస్‌ను రూపొందించారని వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరం, ఆకాంక్షలను స్వయంగా చూసి, ఉద్యమంలోనూ భాగస్వాములైన వారు.. తెలంగాణ సమాజం కోసం 30 ఏళ్లుగా శ్రమిస్తున్న వారంతా ఇందులో పాలుపంచుకున్నారని వెల్లడించారు. వారందరికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. తెలంగాణ సమాజానికి యువత ఉపయోగపడే విధంగా ఈ పూర్తిస్థాయి సిలబస్‌ను రూపొందించారని పేర్కొన్నారు. ఈ నెలలోనే..: టీఎస్పీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాల్లో 80 శాతం పోస్టులకు సెప్టెంబర్‌లోనే నోటిఫికేషన్లు ఇస్తామని చక్రపాణి తెలిపారు. మొదటి వారంలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు, తర్వాత ఏఎంవీఐ పోస్టులకు, హెచ్ఎండీఏలో ఖాళీల భర్తీకి.. తర్వాత వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు. గ్రూప్-1, గ్రూప్-2 భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి మరిన్ని పోస్టులకు ఆమోదం లభించాక నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. అక్టోబర్‌లో గ్రూప్-2, డిసెంబర్లో గ్రూప్-1 నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. సిలబస్‌లో మార్పులు లేని అగ్రికల్చర్ ఆఫీసర్, ఇతర టెక్నికల్ పోస్టుల సిలబస్‌ను మాత్రం నోటిఫికేషన్లతో పాటు జారీ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్, గ్రూప్-1 సిలబస్ సబ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, కమిటీ సభ్యులు చుక్కా రామయ్య, ప్రొఫెసర్లు శివారెడ్డి, అడపా సత్యనారాయణ, లింగమూర్తి, మల్లేష్, రేవతి, కమిషన్ సభ్యులు సి.విఠల్, డాక్టర్ చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ, కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తదితరులు పాల్గొన్నారు. అన్ని పరీక్షల్లో 'ప్రత్యేక' అంశాలు టీఎస్పీఎస్సీ ఏ పోటీ పరీక్ష నిర్వహించినా అందులో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉండేలా, ముఖ్యంగా జనరల్ స్టడీస్‌లోనూ ఈ అంశాలు ఉండేలా సిలబస్‌కు రూపకల్పన చేశారు. గ్రూప్స్, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పరీక్షల్లో తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలను అడిగేలా చర్యలు చేపట్టారు. గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్ పేపర్-1: జనరల్ స్టడీస్‌లో వివిధ జాతీయ, అంతర్జాతీయ అంశాలతోపాటు తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, తెలంగాణ విధానాలు, సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం పేపర్-2: కాకతీయుల పాలన, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిలో కాకతీయులు, వెలమ రాజుల పాత్ర, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వం, భౌగోళిక స్థితులు పేపర్-3: తెలంగాణలో సామాజిక అంశాలైన వెట్టి, జోగిని, దేవదాసీ వ్యవస్థ, వలసలు; పేపర్-4: తెలంగాణ ఆర్థిక పరిస్థితి పేపర్-5: సాధారణ సిలబస్; పేపర్-6: తెలంగాణ ఉద్యమం, ఆవిర్భావం గ్రూప్- 2, 3 పేపర్-1: తెలంగాణ సమాజం, విధానాలపై ప్రశ్నలు పేపర్-2: తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర పేపర్-3: తెలంగాణ ఆర్థిక స్థితి, అభివృద్ధి పేపర్-4 (గ్రూప్-2కి మాత్రమే): తెలం గాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం గ్రూప్- 4 పేపర్-1: తెలంగాణ భౌగోళిక, ఆర్థిక అంశాలు, సమాజం, సంస్కృతి గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ పోస్టులు పేపర్-1: తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి, చరిత్ర, రాజకీయం, సంస్కృతి, కళలు, సాహిత్యం -
తెలంగాణ గ్రూప్స్ సిలబస్ విడుదల
-
నేడు గ్రూప్స్ సిలబస్ ప్రకటన
-
నేడు గ్రూప్స్ సిలబస్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్న గ్రూప్స్ పరీక్షల సిలబస్‌ను సోమవారం సాయంత్రం 4 గంటలకు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి విడుదల చేయనున్నారు. ఇందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సిలబస్ విడుదల చేసిన వెంటనే వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురానుంది. సోమవారం వీలు కాకపోతే మంగళవారం ఉదయం విద్యార్థులు చూసుకునేలా చర్యలు చేపట్టింది. -
31న గ్రూప్స్ సిలబస్ ప్రకటన
హైదరాబాద్: గ్రూప్స్ సిలబస్‌ను ఈనెల 31న ప్రకటించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. గ్రూపు-1,2,3,4 తదితర పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను నోటిఫికేషన్లతో కాకుండా ముందుగానే ప్రకటించేందుకు సర్వీసు కమిషన్ చర్యలు చేపట్టింది. గ్రూప్స్ సిలబస్‌లో తెలంగాణకు సంబంధించిన అంశాలను జోడించి వూర్పులు చేసినందున ఈ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. కొత్త సిలబస్‌లో ప్రిపేర్ అయ్యేందుకు సవుయుం కావాలని అభ్యర్థులు విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో సిలబస్‌ను ముందుగానే ప్రకటిస్తావుని సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. -
గ్రూప్స్ సిలబస్‌పై ఆందోళన వద్దు
అభ్యర్థులకు సుంకిరెడ్డి సూచన సాక్షి, హైదరాబాద్: ‘సీమాంధ్రుల పాలనలో తెలంగాణ చరిత్ర పూర్తిగా మరుగున పడిపోయింది. తెలంగాణ చరిత్రను వక్రీకరించి సీమాంధ్రుల పాలనను చరిత్రలో అక్రమంగా చొప్పించారు. దాన్ని పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టి ఇంతకాలం విద్యార్థులతో బలవంతంగా చదివించారు. ఇప్పుడిక ఆ అవసరం లేదు. సీమాంధ్రులు రాసిన ఆంధ్రుల చరిత్రతో తెలంగాణ అభ్యర్థులకు ఇక పన్లేదు. మన చరిత్రను మనమే మన పాఠ్యాంశాల్లో పొందుపర్చుకుని చదువుకునే సమయం వచ్చింది’ అని ప్రముఖ రచయిత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. ఆయన ఆదివారం ‘సాక్షి’ తో మాట్లాడారు. ‘‘తెలంగాణ చరిత్రపై ఇప్పటికే అనేక పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. ఏది పడితే అది చదివి మోసపోవద్దు. ఒకరు చేసిన తప్పలను మిగతా వారు అనుసరించడం వల్ల వాటిలో అనేక తప్పులు దొర్లాయి. దీనిపై మేం పలువురు తెలంగాణ నిపుణులతో చర్చించాం. శాసనాలు, గ్రంథాలను క్షుణ్నంగా అధ్యయనం చేశాం. వాస్తవాలను ప్రామాణికంగా తీసుకుని ‘తెలంగాణ చరిత్ర-క్రీస్తుపూర్వం నుంచి 1948 వరకు’ పుస్తకాన్ని ముద్రించాం. ఇది గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3తో పాటు ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. తెలంగాణ చుట్టూ విస్తరించి ఉన్న సామ్రాజ్యాలు, సామంత రాజులు తదితరాలను కూడా అధ్యయనం చేయాలి. తెలంగాణ చరిత్రనే తెలంగాణ అభ్యర్థులు ప్రమాణికంగా తీసుకోవాలి. ప్రశ్నలు జవాబుల కోణంలో కాకుండా తెలంగాణ చరిత్రను సమగ్రంగా అర్ధం చేసుకోవాలి. చరిత్ర పట్ల ఆసక్తి, మమకారముంటేనే ఇది సాధ్యం. పేపర్లను దిద్దేదీ తెలంగాణ నిపుణులే. కాబట్టి తెలంగాణ చారిత్రక నేపథ్యంపై పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నలకు నిర్భయంగా జవాబు రాయవచ్చు’’ అని వివరించారు. -
వారంలో గ్రూప్స్ సిలబస్!
వెబ్సైట్లో పెట్టేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు * అభ్యర్థులకు చదువుకునే సమయం ఇచ్చే యోచన * ఆయా కేడర్లలో రానున్న మరిన్ని పోస్టులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు.. పూర్తి స్థాయి సిలబస్ ఏంటో తెలియదు.. కొత్త రాష్ట్రంలో సిలబస్ మార్చుతున్నారు... అదేంటో స్పష్టత లేదు.. ఏ పుస్తకాలు చదువాలో అంతుచిక్కడం లేదు.. ప్రభుత్వం అనుమతిచ్చింది కనుక వెంటనే నోటిఫికేషన్లు ఇస్తే చదువుకునే సమయం ఉంటుందా ఇలా అనేక ప్రశ్నలు నిరుద్యోగ అభ్యర్థుల మెదళ్లను తొలిచేస్తున్నాయి! వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టే దిశగా టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. సిలబస్‌లో ఎక్కువ మార్పులు ఉండే గ్రూపు-1, గ్రూపు-2 విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందకుండా కార్యాచరణపై దృష్టి పెట్టింది. చదువుకునే సమయం ఇవ్వడంతోపాటు, పూర్తి స్థాయి సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పరీక్షల విధానం, 15,522 పోస్టుల భర్తీకి ఆమోదం, ఆయా పేపర్లలో ఉండే సిలబస్ ఔట్‌లైన్ ఇచ్చినందున, అందుకనుగుణంగా వారం పది రోజుల్లో పూర్తి సిలబస్‌ను, వాటిల్లోని టాపిక్స్‌ను అభ్యర్థులకు అందుబాటులోకి తేనుంది. మరో ఐదారు రోజుల్లో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీటికి సంబంధించిన సిలబస్ రూపకల్పనకు చర్యలు చేపట్టింది. గత నెలలో ప్రభుత్వం వివిధ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన వెంటనే పూర్తి స్థాయి సిలబస్ రూపకల్పనపై టీఎస్పీఎస్సీ దృష్టి సారించింది. ఇంజనీర్ పోస్టుల్లోనే పది రకాల పోస్టులు ఉండటం, వాట న్నింటికి అవసరమైన సిలబస్ రూపకల్పన చేయిస్తోంది. గత వారం నుంచి పలువురు ప్రొఫెసర్ల నేతృత్వంలో ఇదే పనిలో నిమగ్నమైంది. ఇది పూర్తయ్యేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ తరువాత మొదటి నోటిఫికేషన్లుగా ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ చేసేందుకు సిద్ధమైంది. వాటికి సెప్టెంబర్, అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహించి, ఫలితాలను ప్రకటించాలన్న ఆలోచనలు చేస్తోంది. ఈ నోటిఫికేషన్ల తరువాత ఇతర శాఖల్లోని పోస్టులకు పూర్తిస్థాయి సిలబస్ రూపొందించి, ఒక్కొక్కటిగా వరుస క్రమంలో నోటిఫికేషన్లను జారీ చేయాలని యోచిస్తోంది. ఇక ఈసారి ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడాన్ని నియంత్రించేందుకు బయోమెట్రిక్ విధానం (పరీక్ష సమయంలో వేలి ముద్రలు తీసుకోవడం) అమల్లోకి తేవాలని భావిస్తోంది. అలాగే పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకూ ఆలోచనలు చేస్తోంది. ముందు సిలబస్.. తరువాత నోటిఫికేషన్లు వారం పది రోజుల్లో గ్రూపు-1, గ్రూపు-2 తదితర పోస్టుల సిలబస్ ఖరారు చేసి వెబ్సైట్లో పెట్టేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈనెల 15లోగా సిలబస్ ఇచ్చాక నెలా.. రెండు నెలల సమయమిచ్చి అక్టోబర్‌లో గ్రూపు-2 నోటిఫికేషన్ జారీ చేస్తే బాగుంటుందని యోచిస్తోంది. దీంతో అభ్యర్థులకు సమయం ఇవ్వలేదన్న అపవాదు ఉండదు. ఇక గ్రూపు-3 కూడా అదే సమయంలో ఇవ్వాలా? అంతకంటే ముందుగానే ఇవ్వాలా? అన్న ఆలోచనలు చేస్తోంది. మరోవైపు గ్రూపు-1 నోటిఫికేషన్‌ను మాత్రం డిసెంబరు నాటికి ఇవ్వడమే మంచిదన్న భావన ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతిచ్చిన పోస్టుల్లో గ్రూపు-1 పోస్టులు కేవలం 56 వరకే ఉన్నాయి. అయితే అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌కు నోటిఫికేషన్ ఇస్తే మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. పైగా అప్పటివరకు ఉద్యోగుల విభజన చివరి దశకు చేరుకోనుండటంతో మరిన్ని పోస్టులు రానున్నాయి. గ్రూపు-2లోనూ ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశముంది. వార్షిక కేలండర్ అమలు దిశగా.. ప్రధానంగా గ్రూప్స్ పరీక్షల విషయంలో వార్షిక కేలండర్ అమలు దిశగా టీఎస్పీఎస్సీ యోచిస్తోంది. పోస్టులు ఖాళీ అయిన కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్లు ఇవ్వడం కాకుండా.. ఏడాదిలో నిర్ణీత సమయంలో నోటిఫికేషన్లు ఇస్తూ... వీలైనంత వరకు వార్షిక కేలండర్‌ను అమలు చేయడం మంచిదన్న భావనతో ఉంది. ఇక గ్రూపు-2 పరీక్షల నిర్వహణను సివిల్స్ పరీక్షల సమయంతో క్లాష్ కాకుండా పరీక్ష తేదీలను ప్రకటించే ఆలోచన చేస్తోంది.