
గ్రూపుల సిలబస్ వచ్చేసింది!
- ఈ నెలలోనే 80 శాతం వరకు నోటిఫికేషన్లు
- టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నిర్వహించే వివిధ పోటీ పరీక్షల పూర్తిస్థాయి సిలబస్ సోమవారం విడుదలైంది. కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్, చుక్కా రామయ్య నేతృత్వంలో ఈ సిలబస్‌ను విడుదల చేశారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల సిలబస్‌ను ప్రకటించారు. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల సిలబస్‌నూ వెబ్‌సైట్‌లో (www.tspsc.gov.in) అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి మాట్లాడారు. సాధారణంగా సిలబస్‌ను నోటిఫికేషన్లతోపాటే జారీ చేస్తారని, కానీ కొత్త రాష్ట్రంలో కొత్త సిలబస్ అయినందున చదువుకునేందుకు సమయం కావాలన్న అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ముందుగానే విడుదల చేస్తున్నామని చెప్పారు. పోటీ పరీక్షల మౌలిక స్వరూపాన్ని (స్కీం) 32 మంది నిపుణులు నెల రోజులపాటు శ్రమించి పూర్తి చేశారని తెలిపారు. దానిని ప్రభుత్వ సీఎస్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించి, ఆమోదించాయని చెప్పారు. ఈ పోటీ పరీక్షల స్కీమ్‌కు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం గత నెల 27న ఉత్తర్వులు జారీ చేసిందని... అప్పటినుంచి 85 మంది ప్రొఫెసర్లు ఈనెల 27 వరకు రేయింబవళ్లు కూర్చొని పూర్తిస్థాయి సిలబస్‌ను రూపొందించారని వివరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరం, ఆకాంక్షలను స్వయంగా చూసి, ఉద్యమంలోనూ భాగస్వాములైన వారు.. తెలంగాణ సమాజం కోసం 30 ఏళ్లుగా శ్రమిస్తున్న వారంతా ఇందులో పాలుపంచుకున్నారని వెల్లడించారు. వారందరికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. తెలంగాణ సమాజానికి యువత ఉపయోగపడే విధంగా ఈ పూర్తిస్థాయి సిలబస్‌ను రూపొందించారని పేర్కొన్నారు.
ఈ నెలలోనే..: టీఎస్‌పీఎస్సీ భర్తీ చేసే ఉద్యోగాల్లో 80 శాతం పోస్టులకు సెప్టెంబర్‌లోనే నోటిఫికేషన్లు ఇస్తామని చక్రపాణి తెలిపారు. మొదటి వారంలో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు, తర్వాత ఏఎంవీఐ పోస్టులకు, హెచ్‌ఎండీఏలో ఖాళీల భర్తీకి.. తర్వాత వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు. గ్రూప్-1, గ్రూప్-2 భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి మరిన్ని పోస్టులకు ఆమోదం లభించాక నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు. అక్టోబర్‌లో గ్రూప్-2, డిసెంబర్‌లో గ్రూప్-1 నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. సిలబస్‌లో మార్పులు లేని అగ్రికల్చర్ ఆఫీసర్, ఇతర టెక్నికల్ పోస్టుల సిలబస్‌ను మాత్రం నోటిఫికేషన్లతో పాటు జారీ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్, గ్రూప్-1 సిలబస్ సబ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, కమిటీ సభ్యులు చుక్కా రామయ్య, ప్రొఫెసర్లు శివారెడ్డి, అడపా సత్యనారాయణ, లింగమూర్తి, మల్లేష్, రేవతి, కమిషన్ సభ్యులు సి.విఠల్, డాక్టర్ చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ, కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని పరీక్షల్లో 'ప్రత్యేక' అంశాలు
టీఎస్‌పీఎస్సీ ఏ పోటీ పరీక్ష నిర్వహించినా అందులో తెలంగాణకు సంబంధించిన అంశాలు ఉండేలా, ముఖ్యంగా జనరల్ స్టడీస్‌లోనూ ఈ అంశాలు ఉండేలా సిలబస్‌కు రూపకల్పన చేశారు. గ్రూప్స్, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పరీక్షల్లో తెలంగాణకు సంబంధించిన అనేక అంశాలను అడిగేలా చర్యలు చేపట్టారు.
గ్రూప్-1
ప్రిలిమ్స్, మెయిన్స్ పేపర్-1: జనరల్ స్టడీస్‌లో వివిధ జాతీయ, అంతర్జాతీయ అంశాలతోపాటు తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, తెలంగాణ విధానాలు, సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
పేపర్-2: కాకతీయుల పాలన, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిలో కాకతీయులు, వెలమ రాజుల పాత్ర, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వం, భౌగోళిక స్థితులు
పేపర్-3: తెలంగాణలో సామాజిక అంశాలైన వెట్టి, జోగిని, దేవదాసీ వ్యవస్థ, వలసలు;
పేపర్-4: తెలంగాణ ఆర్థిక పరిస్థితి
పేపర్-5: సాధారణ సిలబస్;
పేపర్-6: తెలంగాణ ఉద్యమం, ఆవిర్భావం
గ్రూప్- 2, 3
పేపర్-1: తెలంగాణ సమాజం,
విధానాలపై ప్రశ్నలు
పేపర్-2: తెలంగాణ సామాజిక,
సాంస్కృతిక చరిత్ర
పేపర్-3: తెలంగాణ ఆర్థిక స్థితి, అభివృద్ధి
పేపర్-4 (గ్రూప్-2కి మాత్రమే): తెలం గాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం
గ్రూప్- 4
పేపర్-1: తెలంగాణ భౌగోళిక, ఆర్థిక అంశాలు, సమాజం, సంస్కృతి
గెజిటెడ్, నాన్‌గెజిటెడ్ పోస్టులు
పేపర్-1: తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి, చరిత్ర, రాజకీయం, సంస్కృతి, కళలు, సాహిత్యం