నాపై ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లదు
హైకోర్టుకు నివేదించిన బండి రాఘవరెడ్డి
జనవరి 7న తీర్పునిస్తామన్న హైకోర్టు
సాక్షి, అమరావతి: సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకపోయినా, కులం పేరుతో ఎవరినీ దూషించకపోయినా పోలీసులు అన్యాయంగా తనను ఎస్సీ, ఎస్టీ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పర్సనల్ సెక్రటరీ బండి రాఘవరెడ్డి హైకోర్టుకు నివేదించారు.
బండి రాఘవరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు చెల్లదని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి వివరించారు. వర్రా రవీందర్‌రెడ్డి వాంగ్మూలం పేరుతో రాఘవరెడ్డిని అరెస్టుచేసేందుకు పోలీసులు వెతుకున్నారని తెలిపారు. రవీందర్‌రెడ్డిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి బలవంతంగా వాంగ్మూలం నమోదు చేయించారన్నారు.
ఆ వాంగ్మూలం పేరుతో పిటిషనర్‌తో పాటు మరికొందరిని నిందితులుగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గతంలో కూడా పోలీసులు మరో కేసులో ఇదే రీతిలో వ్యవహరించారన్నారు. ఇప్పుడు కూడా సంబంధంలేని కేసులో పిటిషనర్‌ను ఇరికించాలని పోలీసులు చూస్తున్నారని.. రాజకీయ కక్ష సాధింçపులో భాగంగానే పోలీసులు ఇలా చేస్తున్నారని తెలిపారు.
అరెస్టు భయం ఉన్న నేపథ్యంలో ఈ ముందుస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు ఉన్నా కూడా హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. అనంతరం.. పోలీసుల తరఫున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) సందీప్ వాదనలు వినిపిస్తూ, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో నిందితులు సంబంధిత కోర్టుల్లోనే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
నేరుగా హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. జనవరి 7న తీర్పును వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment