Telangana State Public Service Commission
-
ఏ సర్కారూ పరీక్షలే పెట్టనట్లు కమిషన్ కాకమ్మ కథలు
సాక్షి, హైదరాబాద్: ఇప్పటిదాకా ఏ సర్కారూ పరీక్షలే పెట్టనట్లు.. ఎవరూ ఉద్యోగాలే ఇవ్వనట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) కాకమ్మ కథలు చెబుతోందని శుక్రవారం ఎక్స్(ట్విట్టర్) వేదికగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. నచ్చినోళ్లకు పదవులు, కావాల్సినోళ్లకు ఉద్యోగాలు.. ఇదే దొర తెచ్చిన బంగారు తెలంగాణ అని విమర్శించారు. చెప్పాలంటే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్‌ను కాస్త.. దొరలు ప్రగతిభవన్ సర్విస్ కమిషన్ గా మార్చారన్నారు. ‘గ్రూప్ 1 పరీక్షలు ఎంత మంది రాశారో ముందొక లెక్క.. ఓఎంఆర్ షీట్స్ లెక్కిస్తే మరో లెక్క.. ఇది చాలా కామన్ అట. ప్రశ్నపత్రాలనే అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నోళ్లకు ఓఎంఆర్ షీట్స్ తారుమారుచేయడం ఒక లెక్కనా’అని అన్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే కమిషన్‌కు వచ్చిన నష్టం ఏంటని షర్మిల సూటిగా ప్రశ్నించారు. -
టీఎస్పీఎస్సీ ఉక్కిరిబిక్కిరి.. పరీక్షల నిర్వహణ పరీక్షే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల నిర్వహణపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సతమతమవుతోంది. ఇప్పటికే ప్రకటించిన పరీక్షలను వాయిదా వేయాలంటూ ఒకవైపు ఒత్తిడి పెరుగుతుండగా... మరోవైపు ఇప్పటివరకు తేదీలు ప్రకటించని పరీక్షల నిర్వహణ ఎలా అనే అంశం కమిషన్‌కు తలనొప్పిగా మారుతోంది. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల క్రతువు ముంచుకొస్తోంది. ఆ తర్వాత వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు, అనంతరం పార్లమెంటు ఎన్నికలతో ప్రభుత్వ యంత్రాంగం అత్యంత కీలక కార్యక్రమాల్లో బిజీ కానుంది. దీంతో ఆలోపు అర్హత పరీక్షలను నిర్వహించాలని మొదటినుంచి కార్యాచరణ సిద్ధం చేసుకున్న టీఎస్పీఎస్సీకి ప్రస్తుత పరిస్థితులు మింగుడుపడటం లేదు. తాజాగా టీఎస్పీఎస్సీని గ్రూప్–2 వాయిదా డిమాండ్ అంశం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాస్తవానికి ఈనెల 29, 30 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ నాలుగు నెలల క్రితమే ప్రకటించింది. ఈ క్రమంలో సమయం తక్కువగా ఉన్నందున గ్రూప్–2కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేకపోయామని, మరికొంత సమయం ఇవ్వాలని, ఇందులో భాగంగా పరీక్షలను కొంతకాలం వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి చేయడంతో పాటు కమిషన్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం టీఎస్పీఎస్సీని ఇరకాటంలో పడేసినట్లయింది. ‘లీకేజ్’తో గందరగోళ పరిస్థితులు.. గురుకుల విద్యా సంస్థల్లో దాదాపు 9వేలకు పైబడి ఉద్యోగ ఖాళీల భర్తీలో భాగంగా తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ప్రస్తుతం అర్హత పరీక్షలను నిర్వహిస్తోంది. అన్ని పరీక్షలను ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహిస్తున్న టీఆర్‌ఈఐఆర్‌బీ ఈనెల 23వ తేదీ వరకు విరామం లేకుండా పరీక్షల షెడ్యూల్‌ను రూపొందించి వేగంగా పరీక్షలను పూర్తి చేస్తోంది. మరోవైపు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు సైతం ఎలాంటి ఆందోళనలకు తావులేకుండా పరీక్షల నిర్వహణలో బిజీ అయ్యింది. దాదాపు 45 వేల ఉద్యోగాల భర్తీతో వివిధ రకాల నోటిఫికేషన్లు జారీ చేసిన టీఎస్పీఎస్సీ... షెడ్యూల్‌ను రూపొందించి పరీక్షల నిర్వహణకు ఉపక్రమించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కొన్న కమిషన్... ఇదివరకే నిర్వహించిన నాలుగు రకాల పరీక్షలను రద్దు చేయడం... మరో రెండు పరీక్షలను వాయిదా వేయడం... మరికొన్నింటిని రీషెడ్యూల్ చేయడంతో రూపొందించుకున్న ప్రణాళిక గాడి తప్పింది. ఆ తర్వాత పరిస్థితులను చక్కదిద్దుకుంటూ క్రమంగా పరీక్షలను నిర్వహిస్తూ ముందుకెళ్తుండగా... ఇప్పుడు గ్రూప్–2 పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్‌తో ఇరకాటంలో పడింది. వాయిదా వేస్తే... మరో రెండు నెలల్లో ఎన్నికల సమయం ఆసన్నం కానుంది. వరుసగా ఎన్నికలుండటంతో కొంతకాలం పరీక్షలు నిర్వహించే పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పోలీసు యంత్రాంగం, ఇతర పరిపాలనాధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీ అయితే, పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పరీక్షల వాయిదా ఒక డిమాండ్ అయితే... ఇంకా కొన్ని రకాల పరీక్షలకు తేదీలు ప్రకటించకపోవడం మరో అంశం. గ్రూప్–3 పరీక్షతో పాటు డీఏఓ, హెచ్‌డబ్ల్యూఓలతో పాటు డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ తదితర పోస్టులతో పాటు చిన్నాచితకా పోస్టులకు ఇంకా టీఎస్పీఎస్సీ తేదీలే ఖరారు చేయలేదు. ఇప్పుడున్న డిమాండ్‌ను పరిగణించి పరీక్షను వాయిదా వేస్తే ఆ ప్రభావం మిగతా పరీక్షల నిర్వహణపైన పడుతుంది. ఎన్నికల సమయం నాటికి పరీక్షలు పూర్తిచేయకపోతే, ఆ తర్వాత కొంతకాలం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుందని కమిషన్ అధికారులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఎంతో శ్రద్ధతో పరీక్షలకు సన్నద్ధమైన అభ్యర్థులు అసహనానికి గురయ్యే ప్రమాదం లేకపోలేదనే వాదన కూడా వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో టీఎస్పీఎస్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. -
2,878 పరీక్ష కేంద్రాలు... 39,600 మంది ఇన్విజిలేటర్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్–4 ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల నిర్వహణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఒకవైపు అత్యధిక సంఖ్యలో పోస్టులు... మరోవైపు అత్యధిక సంఖ్యలో అభ్యర్థులుండటంతో టీఎస్పీఎస్సీ వ్యూహాత్మక కార్యాచరణతో చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో 9 వేల గ్రూప్–4 ఉద్యోగ ఖాళీలున్నాయి. వీటికి 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... గురువారం రాత్రి వరకు 8.55 లక్షల మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల పరిధిలో 2,878 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్–4 పరీక్షల నిర్వహణకు కమిషన్ ఏర్పాట్లు చేసింది. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక లైజన్ అధికారి, ఒక చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు. ఈ పరీక్షా కేంద్రాల పరిధిలో దాదాపు 40 వేల పరీక్ష హాల్లలో అభ్యర్థులను సర్దుబాటు చేస్తారు. ఒక్కో పరీక్ష హాలులో గరిష్టంగా 24 మంది అభ్యర్థులుంటారు. పరీక్షల నిర్వహణలో ఇన్విజిలేటర్ల పాత్ర కీలకం. దీంతో ఇన్విజిలేటర్లకు ప్రత్యేకంగా శిక్షణ సైతం టీఎస్పీఎస్సీ ఇచ్చింది. జూలై 1న శనివారం ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు పేపర్లు ఉంటాయి. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు. పరీక్ష కేంద్రంలో పక్కాగా పరిశీలన... గ్రూప్–4 ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఆశావహులు సైతం భారీగా ఉన్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల పరిశీలన, నిర్ధారణకు టీఎస్పీఎస్సీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇన్విజిలేటర్లకు సైతం నిర్ధారణ బాధ్యతలు అప్పగించింది. తొలుత పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే సమయంలో అభ్యర్థి హాల్‌టిక్కెట్‌తో పాటు గుర్తింపు కార్డులు పరిశీలిస్తారు. ఆ తర్వాత అభ్యర్థిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. అభ్యర్థులకు కనీసం బెల్టు సైతం అనుమతించబోమని టీఎస్పీఎస్సీ ఇప్పటికే తేల్చి చెప్పింది. పరీక్ష హాలులో అభ్యర్థిని ఇన్విజిలేటర్ మరోమారు తనిఖీ చేస్తారు. హాల్ టికెట్‌లోని ఫోటో ద్వారా, అభ్యర్థి ఫోటో గుర్తింపు కార్డు ద్వారా పరిశీలిస్తారు. ఆ తర్వాత ఓటీఆర్‌లో ఉన్న సంతకం ఆధారంగా అభ్యర్థి చేసిన సంతకాన్ని పరిశీలిస్తారు. నామినల్‌రోల్స్ పైన సంతకం తప్పనిసరి చేసింది. దీంతో పాటు అభ్యర్థి వేలిముద్రను పరీక్ష హాలులోనే సమర్పించాలి. ఐదు పద్ధతుల్లో ఎక్కడ పొరపాటు గుర్తించినా అభ్యర్థిని పరీక్షకు అనుమతించమని టీఎస్పీఎస్సీ తేలి్చచెప్పింది. గ్రూప్–4 పరీక్ష ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు కమిషన్ తెలిపింది. ఓఎంఆర్ జవాబు పత్రంలో అభ్యర్థి ముందుగా హాల్‌టిక్కెట్ నంబర్, ప్రశ్నపత్రం కోడ్‌ను బబ్లింగ్ చేయాలి. ఓఎంఆర్ జవాబు పత్రంపై అభ్యర్థి హాల్‌టిక్కెట్ నంబర్, ఫోటో ఉంటాయని వస్తున్న ఊహాగానాలను పట్టించుకోవద్దని కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. తాళి తొలగిస్తే ఊరుకోం టీఎస్పీఎస్సీకి వీహెచ్‌పీ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థినుల నుంచి మంగళ సూత్రాలను తొలగిస్తే ఊరుకునేది లేదని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) టీఎస్పీఎస్సీని హెచ్చరించింది. రకరకాల నిబంధనలతో హిందువులను అవమానిస్తే ఊరుకునేది లేదని, సంప్రదాయాలను మంటగలిపే దుర్మార్గమైన చర్యలకు పాల్పడితే తీవ్ర ప్రతిఘటన ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు గురువారం టీఎస్సీపీఎస్సీ చైర్మన్, కార్యదర్శికి వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వినర్ శివ రాములు తదితరులు కలిసి వినతి పత్రం సమర్పించారు. -
గ్రూప్–4లో మరో 141 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–4 కొలువులు మరిన్ని పెరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖల్లో 8,039 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. తాజాగా గ్రూప్–4 కేటగిరీలో మరో 141 పోస్టులను జత చేస్తూ అనుబంధ ప్రకటనను శనివారం విడుదల చేసింది. దీంతో గ్రూప్–4 కేటగిరీలో పోస్టుల సంఖ్య 8,180కు చేరింది. తాజాగా ప్రకటించిన 141 పోస్టులు మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీకి సంబంధించిన ఖాళీలు. ఇందులో బాలుర గురుకుల విద్యాసంస్థలకు సంబంధించి 86 పోస్టులుండగా, బాలికల విద్యా సంస్థలకు సంబంధించి 55 పోస్టులున్నాయి. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. -
నవంబర్ 7న ఎఫ్ఎస్వో అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నవంబర్ 7న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. అభ్యర్థులు వెంటనే హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, అర్హత పరీక్షను సీబీఆర్టీ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. హాల్టికెట్లలో నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యర్థులు సన్నద్ధం కావాలని సూచించింది. -
గురుకుల నోటిఫికేషన్ విడుదల
ఏడువేలకుపైగా పోస్టుల భర్తీ హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తీపి కబురు అందించింది. గురుకుల పాఠశాలల్లో ఏడువేలకుపైగా ఉద్యోగాల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఇందుకోసం ఈ నెల 10 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. మొత్తం 7,306 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. గురుకుల నోటిఫికేషన్ గురించి గత కొన్నాళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఊరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్లో పొందుపరచాల్సిన నిబంధనలపై టీఎస్పీఎస్సీ, సంక్షేమశాఖలు ఇప్పటికే కసరత్తు చేసినట్టు సమాచారం. విద్యార్హతల విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. గురుకులాలు ఇంగ్లిషు మీడియం పాఠశాలలు అయినందున ఆంగ్ల మాధ్యమంలోనే చదివి ఉండాలన్న నిబంధన ఉంటుందా అనే ఆందోళన అనేక మంది అభ్యర్థుల్లో నెలకొన్న నేపథ్యంలో మీడియం విషయంలో ఆంక్షల్లేకుండా సర్కారు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ఇంటర్మీడియెట్ డిగ్రీ, పీజీ, బీఎడ్ వంటి కోర్సులను ఇంగ్లిష్ మీడియంలో చదివినా, తెలుగు మీడియంలో చదివినా పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. (చదవండి: మీడియం ఏదైనా అర్హులే!) -
వ్యవసాయాధికారుల పోస్టుల భర్తీకి సన్నాహాలు
- అభ్యర్థుల జాబితా ప్రకటించాలని టీఎస్పీఎస్సీకి వ్యవసాయశాఖ లేఖ - వారం రోజుల్లో అభ్యర్థులకు నియామక పత్రాలు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1,506 మంది వ్యవసాయాధికారులను నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తం 1,311 వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో), 120 వ్యవసాయాధికారులు (ఏవో), 75 ఉద్యానాధికారుల (హెచ్‌వో) పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో వాటి నియామకాలు కొద్ది నెలలుగా నిలిచిపోయాయి. ఇటీవల కోర్టు తీర్పు అనంతరం ఆయా పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా ప్రకటించాలని టీఎస్పీఎస్సీకి రాష్ట్ర వ్యవసాయశాఖ లేఖ రాసింది. జాబితా ప్రకటించిన అనంతరం వెంటనే వారందరికీ నియామక పత్రాలు పంపిస్తామని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఏఈవో పోస్టులకు ఇంటర్వూ్యలు లేనందున వారందరికీ నేరుగా నియామకపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. వారం రోజుల్లో నియామక పత్రాలు పంపించే అవకాశం ఉంది. సంక్రాంతి కానుకగా అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. 6,250 ఎకరాలకు ఒక ఏఈవో రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడం కోసం ప్రతి 6,250 ఎకరాలకు ఒక ఏఈవోని నియమించనున్నారు. 1,311 ఏఈవో, 120 ఏవో పోస్టులను వ్యవసాయ శాఖ కోసం నియమిస్తారు. ఉద్యానశాఖ కోసం 75 ఉద్యానశాఖ అధికారి (హెచ్‌వో) పోస్టులను నింపుతారు. వీరి నియామకాల తర్వాత కొద్ది రోజులపాటు శిక్షణ ఇచ్చి రాబోయే ఖరీఫ్ నాటికి 1,506 మందిని అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు. 6,250 ఎకరాలకు ఒక ఏఈవో అంటే దాదాపు ఒకట్రెండు గ్రామాలకు ఒక ఏఈవో ఉండే అవకాశం ఉంది. వీరు రైతులకు అందుబాటులో ఉండి రైతులకు సలహాలు సూచనలు ఇస్తారు. ఎలాంటి పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు వేయాలో రైతులకు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. మండలాలు, గ్రామాల్లో పనిచేయబోయే ఏవో, ఏఈవో, హెచ్వోలలో సగానికి పైగా మహిళలే ఉండే అవకాశాలున్నాయి. వ్యవసాయ కోర్సులు చదివే వారిలో 60 నుంచి 70 శాతం వరకు మహిళలే ఉంటున్నారు. కాబట్టి 1,506 మందిలో సగానికిపైగా మహిళలే ఉంటారని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఒకట్రెండు గ్రామాలకు కలిపి ఒక ఏఈవో ఉంటారు కాబట్టి వారు తప్పనిసరిగా ఏదో ఒక పెద్ద గ్రామంలో ఉండి పనిచేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే మహిళలు ఏ మేరకు ఆయా గ్రామాల్లో ఉండి సేవలందిస్తారో చూడాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. వారికి సంబంధిత గ్రామంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తారా? లేకుంటే మండల కేంద్రంలో ఉండి సంబంధిత గ్రామాలకు వచ్చి పోవాలా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏఈవోలు మండల కేంద్రం... లేకుంటే సమీపంలోని పట్టణంలో ఉంటూ గ్రామాలకు వచ్చి పోతున్నారు. దీనివల్ల రైతులకు వారు పూర్తిస్థాయిలో సూచనలు సలహాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోతోందన్న విమర్శలున్నాయి. -
కానిస్టేబుల్ రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనెల 31 (ఆదివారం) నిర్వహించనున్న ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలకు అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు ముగిసేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది కృషి చేయాలని పరీక్షల జిల్లా ఇన్చార్జి, టీఎస్పీఎస్సీ సభ్యుడు సి.విఠల్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయన పరీక్షల కో–ఆర్గనైజింగ్ అధికారులు, లైజన్, అసిస్టెంట్ లైజన్, చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. హైదరాబాద్ జిల్లాలో 24,820 మంది పరీక్షలు రాయనున్నారని, ఇందు కోసం 42 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం ఉన్నందును సెల్ ఫోన్లు, ట్యాబుల్, వాచీలు, బ్లూటూత్ పరికరాలు, కాలిక్యులేటర్లను పరీక్షా కేంద్రాలకు అనుమతించకూడదని విఠల్ సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులే కాకుండా నగలు, షూలు ధరించి అభ్యర్థులెవ్వరూ పరీక్ష కేంద్రాలకు రాకూడదని ఆయన సూచించారు. టీఎస్పీఎస్సీ అదనపు కార్యదర్శి శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. లైజన్ అధికారులు జూలై 31న ఉదయం 6.30కి టీఎస్పీఎస్సీ కేంద్రంలో రిపోర్టు చేయాలన్నారు. అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు ఉదయం 7 గంటలకు పరీక్షా కేంద్రానికి రావాలన్నారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందన్నారు. సమావేశంలో ఇన్చార్జి ఏజేసీ అశోక్‌కుమార్, ఆర్డీఓలు నిఖిల, రఘురాంశర్మ, టీఎస్పీఎస్సీ డిప్యూటీ సెక్రటరీ సీతాదేవి, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
ప్రణాళికతో చదివితే విజయమే...
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ చరిత్రకు ప్రాధాన్యం ఇస్తోంది... చరిత్ర, సంస్కృతిని సంపూర్ణంగా అధ్యయనం చేయాలి. ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ, ప్రణాళికతో చదివితే విజయాలు సాధించడం సులభం.’ అని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, చరిత్ర పరిశోధకులు జి.సుదర్శన్‌రెడ్డి సూచించారు. ‘సాక్షి- భవిత’ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో గ్రూప్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. నిరుద్యోగులు, విద్యార్థులు భారీ సంఖ్యలో సదస్సుకు తరలివచ్చారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్‌తో పాటు కరీంనగర్ జిల్లా మెట్పల్లి, కోరుట్ల, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో హాజరయ్యారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు వివిధ సబ్జెక్ట్‌లలో నిష్ణాతులైన ఉపన్యాసకుల ప్రసంగాలు ఓపికగా విన్నారు. అనంతరం ఆ సబ్జెక్టులపై అభ్యర్థులు తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ప్రొఫెసర్ సుదర్శన్‌రెడ్డితోపాటు నిజామాబాద్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ వి.వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ తొంటి దేవన్న, అర్థశాస్త్ర నిపుణులు డాక్టర్ ఎస్. భూమన్నయాదవ్ పలు సూచనలు చేశారు. శాతవాహనుల కాలం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాకా ప్రతి అంశాన్ని అధ్యయనం చేయాలని ప్రొఫెసర్ సుదర్శన్‌రెడ్డి వివరించారు. శాతవాహనుల కాలంలో సామాజిక, సాంస్కృతిక అంశాలను గురించి తెలుసుకోవాలన్నారు. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక తెలంగాణపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, కాకతీయులు, వెచర్ల వంశస్తులు, కుతుబ్‌షాహీలు, నిజాం, రజాకార్ల పాలన నుంచి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు, ముగింపు వరకు పూర్తి వివరాలను అధ్యయనం చేయాలన్నారు. ముఖ్యంగా సామాజిక నిర్మాణాలు, కులమతాలు, చిత్రలేఖనం, నాట్యాలు, వాస్తుకళా నిర్మాణం, స్త్రీల స్థానం, తెలుగు భాష, కవులు, జమీందారీ వ్యవస్థ, అణచివేతలు, తిరుగుబాట్ల గురించి చదవాలన్నారు. 1948 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు రెండో పేపర్లో ఉంటుందని వివరిస్తూ మిలిటరీ రూల్, పోలీస్ చర్య, తెలంగాణ సాయుధ రైతాంగ పోరు, ఏపీ ఏర్పాటు, పెద్దమనుషుల ఒప్పందంతోనే మొదలైన ఉల్లంఘనలు, కమిషన్లు, 1969 నాటి చరిత్రాత్మక పోరాటం, నక్సలైట్ల ఉద్యమం, మలిదశలో తెలంగాణ జనసభ, తెలంగాణ ప్రజాఫంట్, టీఆర్ఎస్, జేఏసీల ఉద్యమాలను అధ్యయనం చేయాలని సూచించారు. అపజయాలతో కుంగిపోవద్దు గ్రూప్స్ సాధించాలన్న పట్టుదలతో చదవాలి. ఒక్కోసారి అపజయాలు ఎదురైతే కుంగిపోకుండా మరింత పట్టుద ల, కసితో చదవాలి. మన ప్రభుత్వం ఎన్నో ఉద్యోగాల నియామకాల కోసం గ్రూప్స్ పరీక్షలు నిర్వహించనుంది. ఇప్పటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలి.. స్నేహితులతో చర్చించుకోవాలి. లక్ష్యసాధ న కోసం కృషి చేస్తే తప్పక విజయం వరిస్తుంది. - వి.వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రణాళికాబద్ధంగా చదవాలి పతీ అభ్యర్థి ప్రణాళిక రూపొందించుకుని ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. అర్థశాస్త్ర అవగాహన పెంపొందించుకోవడం అవసరం. ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి అన్న అంశాల నుంచి జీఎన్‌పీ, జీడీపీల దాకా అధ్యయనం చేయాలి. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి చదవాలి. - డాక్టర్ ఎస్. భూమన్న యాదవ్, ఆర్థిక శాస్త్ర నిపుణులు చరిత్రపై పట్టు సాధించాలి చరిత్రపై పట్టు సాధించకుండా గ్రూప్స్‌లో విజయం సాధించలేరు. చరిత్ర గొలుసులాంటిది. చరిత్రలో ఒకదానికి మరొకదానికి సంబంధం ఉంటుంది. చరిత్రను అధ్యయనం చేయడం అంటే ఇబ్బంది అన్న భావనను తొల గించుకుని చదివితే అందరికీ సులువే. పోటీ పరీక్షలకు చరిత్రను గుర్తు పెట్టుకోవడం చాలా తప్పనిసరి. - తొంటి దేవన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలి ప్రతిఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవడం ద్వారా విజయాలను సొంతం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నందున లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకుసాగాలి. గ్రూప్స్‌కు సంబంధించి జనరల్ స్టడీస్ సమాచారం ఎక్కువగా పత్రికల్లోనే ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి పత్రికలు చదివే అలవాటు ఉండటం వల్లే గ్రూప్-1 ద్వారా డీఎస్పీ ఉద్యోగం సంపాదించా. తెలుగు మీడియంలోనే చదివి, తెలుగు మీడియంలోనే పరీక్ష రాసి విజయం సాధించాను. ‘సాక్షి’ చేపట్టిన కార్యక్రమం అభినందనీయం. - చంద్రశేఖర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎస్పీ -
టీఎస్పీఎస్సీ... ఏఈ
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కమిషన్... తాజాగా గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్యం; ఆర్ అండ్ బీ; ప్రజారోగ్యం, మున్సిపల్ తదితర విభాగాల్లో 563 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలో అర్హతలు, పరీక్ష విధానం, ప్రిపరేషన్ ప్రణాళికపై ప్రత్యేక కథనం... ఉద్యోగాల వివరాలు ఉద్యోగం ఖాళీలు 1. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) - గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగం 125 2. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) - రహదారులు, భవనాల విభాగం 42 3. అసిస్టెంట్ ఇంజనీర్(సివిల్/మెకానికల్) - ప్రజారోగ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం 258 4. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) - ప్రజారోగ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం 84 5. టెక్నికల్ ఆఫీసర్స్ (సివిల్/ మెకానికల్) - ప్రజారోగ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం 54 మొత్తం 563 అర్హత: ఇంజనీరింగ్‌లో డిప్లొమా. కొన్ని పోస్టులకు డిప్లొమాతోపాటు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు కూడా అర్హులే.వేతన స్కేలు: పోస్టు కోడ్1: రూ.29,760- రూ.80,930; పోస్టు కోడ్ 2, 3, 4, 5: రూ.31,460- రూ.84,970.వయసు: 2015, జులై 1 నాటికి కనిష్ట వయసు 18 ఏళ్లు, గరిష్ట వయసు 44 ఏళ్లు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు; పీహెచ్సీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ లేదా ఓఎంఆర్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటాయి. ఇందులో సాధించిన మార్కులు ఆధారంగా నియామకాలుంటాయి. నియామకాలకు కనీస అర్హత మార్కులు: ఓసీ-40 శాతం; బీసీ-35శాతం; ఎస్సీ,ఎస్టీ,పీహెచ్సీ-30 శాతం. పరీక్ష విధానం ప్రశ్నలు సమయం మార్కులు రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) పేపర్-1: జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 150 150 పేపర్-2: సివిల్ ఇంజనీరింగ్ (డిప్లొమా స్థాయి) లేదా మెకానికల్ ఇంజనీరింగ్ (డిప్లొమా స్థాయి) 150 150 150 ముఖ్య సమాచారం: వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) విధానంలో తొలుత టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత టీఎస్పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ సహాయంతో ఆన్లైన్ దరఖాస్తు పూర్తిచేయాలి. ఫీజు: ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.100 చెల్లించాలి. దీంతో పాటు రూ.80 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్‌మెన్ పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. నిరుద్యోగ అభ్యర్థుల కోటాలో ఫీజు నుంచి మినహాయింపు పొందితే దీనికి సంబంధించి తగిన సమయంలో కమిషన్‌కు డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 28, 2015. పరీక్ష తేదీ: అక్టోబరు 25, 2015. పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్ వెబ్సైట్: www.tspsc.gov.in మోడల్ ప్రశ్నలు Civil Engineering 1. The shape of the deflection curve for concentrated load is 1) parabola 2) circular 3) semi-circular 4) ellipse 2. The elastic curve of a beam is taken as 1) neutral axis level 2) centroidal axis level 3) bottom line of the beam 4) major principle of the section. Mechanical Engineering 1. If ds=dQ/T during process, the process is 1) reversible 2) irreversible 3) impossible 4) none of these 2. Second law of thermodynamics defines 1) heat 2) work 3) internal energy 4) entropy General Studies 1. Who wrote the book 'Planned Economy for India' 1) M.Visvesvaraya 2) SardarVallabhai Patel 3) Jawaharlal Nehru 4) Mahatma Gandhi 2. The indus valley civilization was discovered in 1) 1902 2) 1921 3) 1922 4) 1932 -
పారదర్శకతకే పెద్దపీట!
ఉద్యోగపరీక్షల వ్యవహారాల్లో టీఎస్పీఎస్సీ కసరత్తు వెబ్సైట్ ద్వారా సమగ్ర సేవలు అందించే చర్యలు అభ్యర్థులు కమిషన్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు సమస్యలపై వెబ్సైట్ ద్వారానే సేవలందించేలా చర్యలు ఆన్లైన్ పరీక్షల విధానంపైనా ఆలోచనలు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. పోటీ పరీక్షల నిర్వహణ విధానంతోపాటు జవాబు పత్రాల నకలు కాపీ, ‘కీ’ల ప్రకటన, ఫలితాల వెల్లడి వరకు అన్నీ పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులోభాగంగా సమగ్ర సేవలను ఆన్లైన్ ద్వారా అందించేందుకు కసరత్తు చేస్తోంది. సాధ్యమైనన్ని సేవలను తమ వెబ్సైట్ ద్వారా అందించేలా చర్యలు చేపడుతోంది. అభ్యర్థులు తమ కార్యాలయం చుట్టూ తిరిగే పని లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు తమ ఇంటి నుంచే వెబ్సైట్ ద్వారా సేవలు పొందేలా ఈ-మెయిల్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఫోన్ ద్వారా సమాచారమిచ్చేలా కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సర్వీసు కమిషన్ పనితీరుపై వచ్చినట్లు విమర్శలు, ఆరోపణలకు తావివ్వకుండా పారదర్శకంగా ఉండేలా కసరత్తు చేస్తోంది. వన్‌టైం రిజిస్ట్రేషన్‌తో ఆరంభం టీఎస్పీఎస్సీ ఏర్పడగానే మొదట ప్రారంభించిందీ వన్ టైం రిజిస్ట్రేషన్ విధానాన్నే. కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రత్యేక శ్రద్ధ వహించి దేశంలో ఎక్కడాలేని విధంగా దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఇతర రాష్ట్రాల సర్వీసు కమిషన్లతోపాటు యూపీఎస్సీ కూడా ఈ విధానాన్ని అభినందించింది. ఇప్పటికే దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు దీనికింద నమోదు చేసుకున్నారు. ఇక వన్‌టైం రిజిస్ట్రేషన్ చేసుకోని వారు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్‌ను వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు, హాల్‌టికెట్ల డౌన్లోడ్ వంటి విషయాల్లోనూ సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా టెక్నికల్ టీంను సంప్రదించేలా ఫోన్ నెంబర్లు ఇచ్చింది. వీటితోపాటు ఫేస్బుక్, ట్వీటర్ వంటి సోషల్ మీడియా ద్వారా కూడా కమిషన్ సేవలను విసృ్తతం చేస్తోంది. ఆన్లైన్ పరీక్షలు వీటితో పాటు ఆన్లైన్ పరీక్షల ద్వారా పారదర్శకతను పెంచాలని కమిషన్ యోచిస్తోంది. ఇప్పటికే జేఈఈ మెయిన్ పరీక్షను సీబీఎస్ఈ ఆన్లైన్లో నిర్వహిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వనరుల (కంప్యూటర్ ల్యాబ్ తదితర ఏర్పాట్లు కలిగిన కార్యాలయాలు, విద్యా సంస్థలు) ప్రకారం ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే దాదాపు 30 వేల మందికి చేపట్టవచ్చు. అంతకంటే ఎక్కువ మంది ఉంటే సరిపడా వనరులు లేవు. అందుకే తక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలనే ఆలోచనలు చేస్తోంది. ఇది అమలైతే పరీక్ష జరిగిన వారంలోగా పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వొచ్చు. అభ్యంతరాలు ఆన్లైన్లో... ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్షలకు తెల్లారే ప్రాథమిక కీని ప్రకటించవచ్చు. లేదంటే ప్రైమరీ కీని ముందుగానే రూపొందించి ఆన్లైన్లో మూల్యాంకనం చేసే సాఫ్ట్‌వేర్‌తో.. అభ్యర్థి పరీక్ష రాస్తుండగానే అతని స్కోర్‌ను లెక్కించవచ్చు. ముందుగా ప్రకటించిన లేదా ఆన్లైన్లోనే పొందుపరిచిన కీపై అభ్యంతరాలను ఆన్లైన్లో స్వీకరించి, ఒకట్రెండు రోజుల్లోనే అవసరమైతే మార్పులు చేసి ఫలితాలను ప్రకటించే వీలుంది. అభ్యర్థులు పోస్టింగ్ ఆర్డర్లు తీసుకునేందుకు మాత్రమే కమిషన్ కార్యాలయానికి వచ్చేలా ఉండాలన్న యోచన కమిషన్ వర్గాల్లో ఉంది. ఇందులో పరీక్షరాసే వారికి బయోమెట్రిక్ విధానం ఉంటుంది. దీంతో ఒకరికి బదులు మరొకరు రాసే విధానాన్ని అరికట్టవచ్చు. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే రాత పరీక్షల్లో అభ్యర్థులకు వారు రాసిన ఓఎంఆర్ జవాబు పత్రం నకలును అందించనుంది. ఇలా వీలైనంత మేరకు పారదర్శకత పెరిగేలా టీఎస్పీఎస్సీ కృషిచేస్తోంది. -
వారంలో గ్రూప్స్ సిలబస్!
వెబ్సైట్లో పెట్టేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు * అభ్యర్థులకు చదువుకునే సమయం ఇచ్చే యోచన * ఆయా కేడర్లలో రానున్న మరిన్ని పోస్టులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియదు.. పూర్తి స్థాయి సిలబస్ ఏంటో తెలియదు.. కొత్త రాష్ట్రంలో సిలబస్ మార్చుతున్నారు... అదేంటో స్పష్టత లేదు.. ఏ పుస్తకాలు చదువాలో అంతుచిక్కడం లేదు.. ప్రభుత్వం అనుమతిచ్చింది కనుక వెంటనే నోటిఫికేషన్లు ఇస్తే చదువుకునే సమయం ఉంటుందా ఇలా అనేక ప్రశ్నలు నిరుద్యోగ అభ్యర్థుల మెదళ్లను తొలిచేస్తున్నాయి! వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టే దిశగా టీఎస్పీఎస్సీ కసరత్తు ప్రారంభించింది. సిలబస్‌లో ఎక్కువ మార్పులు ఉండే గ్రూపు-1, గ్రూపు-2 విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందకుండా కార్యాచరణపై దృష్టి పెట్టింది. చదువుకునే సమయం ఇవ్వడంతోపాటు, పూర్తి స్థాయి సిలబస్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పరీక్షల విధానం, 15,522 పోస్టుల భర్తీకి ఆమోదం, ఆయా పేపర్లలో ఉండే సిలబస్ ఔట్‌లైన్ ఇచ్చినందున, అందుకనుగుణంగా వారం పది రోజుల్లో పూర్తి సిలబస్‌ను, వాటిల్లోని టాపిక్స్‌ను అభ్యర్థులకు అందుబాటులోకి తేనుంది. మరో ఐదారు రోజుల్లో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీటికి సంబంధించిన సిలబస్ రూపకల్పనకు చర్యలు చేపట్టింది. గత నెలలో ప్రభుత్వం వివిధ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపిన వెంటనే పూర్తి స్థాయి సిలబస్ రూపకల్పనపై టీఎస్పీఎస్సీ దృష్టి సారించింది. ఇంజనీర్ పోస్టుల్లోనే పది రకాల పోస్టులు ఉండటం, వాట న్నింటికి అవసరమైన సిలబస్ రూపకల్పన చేయిస్తోంది. గత వారం నుంచి పలువురు ప్రొఫెసర్ల నేతృత్వంలో ఇదే పనిలో నిమగ్నమైంది. ఇది పూర్తయ్యేందుకు మరో నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ తరువాత మొదటి నోటిఫికేషన్లుగా ఇంజనీర్ పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ చేసేందుకు సిద్ధమైంది. వాటికి సెప్టెంబర్, అక్టోబర్‌లో పరీక్షలు నిర్వహించి, ఫలితాలను ప్రకటించాలన్న ఆలోచనలు చేస్తోంది. ఈ నోటిఫికేషన్ల తరువాత ఇతర శాఖల్లోని పోస్టులకు పూర్తిస్థాయి సిలబస్ రూపొందించి, ఒక్కొక్కటిగా వరుస క్రమంలో నోటిఫికేషన్లను జారీ చేయాలని యోచిస్తోంది. ఇక ఈసారి ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడాన్ని నియంత్రించేందుకు బయోమెట్రిక్ విధానం (పరీక్ష సమయంలో వేలి ముద్రలు తీసుకోవడం) అమల్లోకి తేవాలని భావిస్తోంది. అలాగే పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకూ ఆలోచనలు చేస్తోంది. ముందు సిలబస్.. తరువాత నోటిఫికేషన్లు వారం పది రోజుల్లో గ్రూపు-1, గ్రూపు-2 తదితర పోస్టుల సిలబస్ ఖరారు చేసి వెబ్సైట్లో పెట్టేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఈనెల 15లోగా సిలబస్ ఇచ్చాక నెలా.. రెండు నెలల సమయమిచ్చి అక్టోబర్‌లో గ్రూపు-2 నోటిఫికేషన్ జారీ చేస్తే బాగుంటుందని యోచిస్తోంది. దీంతో అభ్యర్థులకు సమయం ఇవ్వలేదన్న అపవాదు ఉండదు. ఇక గ్రూపు-3 కూడా అదే సమయంలో ఇవ్వాలా? అంతకంటే ముందుగానే ఇవ్వాలా? అన్న ఆలోచనలు చేస్తోంది. మరోవైపు గ్రూపు-1 నోటిఫికేషన్‌ను మాత్రం డిసెంబరు నాటికి ఇవ్వడమే మంచిదన్న భావన ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం అనుమతిచ్చిన పోస్టుల్లో గ్రూపు-1 పోస్టులు కేవలం 56 వరకే ఉన్నాయి. అయితే అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌కు నోటిఫికేషన్ ఇస్తే మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది. పైగా అప్పటివరకు ఉద్యోగుల విభజన చివరి దశకు చేరుకోనుండటంతో మరిన్ని పోస్టులు రానున్నాయి. గ్రూపు-2లోనూ ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశముంది. వార్షిక కేలండర్ అమలు దిశగా.. ప్రధానంగా గ్రూప్స్ పరీక్షల విషయంలో వార్షిక కేలండర్ అమలు దిశగా టీఎస్పీఎస్సీ యోచిస్తోంది. పోస్టులు ఖాళీ అయిన కొద్ది రోజుల్లోనే నోటిఫికేషన్లు ఇవ్వడం కాకుండా.. ఏడాదిలో నిర్ణీత సమయంలో నోటిఫికేషన్లు ఇస్తూ... వీలైనంత వరకు వార్షిక కేలండర్‌ను అమలు చేయడం మంచిదన్న భావనతో ఉంది. ఇక గ్రూపు-2 పరీక్షల నిర్వహణను సివిల్స్ పరీక్షల సమయంతో క్లాష్ కాకుండా పరీక్ష తేదీలను ప్రకటించే ఆలోచన చేస్తోంది. -
పోటీ పరీక్షల్లో మార్పులకు శ్రీకారం
* టీఎస్పీఎస్సీ చర్యలు * మొదటిసారి సమావేశమైన సమీక్ష కమిటీ * పరీక్షల విధానం, సిలబస్ మార్పులపై చర్చ * ప్రతిపాదనల రూపకల్పనకు సబ్ కమిటీలు ఏర్పాటు * ఈ నెల 17న మరో సమావేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోటీ పరీక్షల విధానం, సిలబస్‌లో మార్పులపై కసరత్తు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యాలయంలో టీఎస్పీఎస్సీ నియమించిన కమిటీ మొదటి సమావేశం శుక్రవారం జరిగింది. సమీక్ష, మార్పుల కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పోటీ పరీక్షల్లో తీసుకురావాల్సిన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏయే పోటీ పరీక్షలో ఎలాంటి పేపర్లు ఉండాలి.. ఎన్ని పేపర్లు అవసరం.. ఏయే పరీక్షలకు ఇంటర్వ్యూలు అవసరం.., ఇంటర్వ్యూలు ఉన్న వాటిల్లో ఎన్ని మార్కులకు పెట్టాలి.. పరీక్షల వారీగా సిలబస్ ఎలా ఉండాలి.. ఏయే పాఠ్యాంశాలను చేర్చాలి అనే అంశాలపై కమిటీ చర్చించింది. ప్రధానంగా గ్రూపు-1, గ్రూపు-2 పోటీ పరీక్షల్లో ఎలాంటి విధానాలు అమలు చేయాలన్న అంశంతోపాటు సిలబస్‌లో ఎలాంటి మార్పులు అవసరమో చర్చించారు. కాగా, ఇంటర్వ్యూలు ఉంటే అందులో కనీస, గరిష్ట మార్కుల విధానం తప్పనిసరిగా ఉండాలన్న అంశంపై ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలిసింది. వీటన్నింటిపై మరింత లోతుగా అధ్యయనం చేసి, మార్పులపై పూర్తి స్థాయి ప్రతిపాదనలను రూపొందించేందుకు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఒక కమిటీని, ప్రొఫెసర్ లింగమూర్తి నేతృత్వంలో మరో కమిటీని ఏర్పాటు చేశారు. వీటితోపాటు మరో మూడు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈనెల 17న మరోసారి సమావేశమై సబ్ కమిటీలు చేసే మార్పులపై తుది నివేదికను రూపొందించి సర్వీసు కమిషన్‌కు అందజేయాలని నిర్ణయించారు. ఆ నివేదికలోని అంశాలపై సర్వీసు కమిషన్ చర్చించి ప్రభుత్వ ఆమోదానికి పంపుతుంది. ప్రభుత్వ ఆమోదం రాగానే ఇదే కమిటీ పూర్తి స్థాయి సిలబస్‌ను ప్రతిపాదించనుంది. ఆ తరువాత శాఖల వారీగా ఇండెంట్లు వస్తే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేస్తారు. కాగా, ఈ కమిటీ రెండు నివేదికలను కమిషన్‌కు అందజేయనుంది. అందులో ఇప్పటికిప్పుడు చేపట్టాల్సిన మార్పులపై ఒకదాన్ని, 2016 నాటికి తీసుకురావాల్సిన పూర్తిస్థాయి మార్పులపై మరొకదానిని కమిషన్‌కు అందజేస్తుందని సమాచారం. టీఎస్పీఎస్సీని సందర్శించిన సీఎస్ తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యాలయాన్ని శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సందర్శించారు. సర్వీసు కమిషన్ ఆహ్వానం మేరకు సీఎస్‌తోపాటు సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారు పాపారావు సర్వీసు కమిషన్‌కు వచ్చారు. వారికి కమిషన్ చైర్మన్ చక్రపాణి, సభ్యులు విఠల్, చంద్రావతి సాదరంగా స్వాగతం పలికారు. తాము చేపట్టిన కార్యక్రమాలను సీఎస్‌కు వివరించారు. అవసరం మేర మార్పులు: హరగోపాల్ ప్రతి ఐదేళ్లు, పదేళ్లకోసారి సర్వీసు కమిషన్ సిలబస్‌లో మార్పులు చేస్తుంది. విద్యా విషయాలు, సమాజ విజ్ఞానంలో వచ్చిన మార్పులపై నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసి, వాటి సిఫారసులను సర్వీసు కమిషన్లు తీసుకుంటాయి. వివిధ పోటీ పరీక్షల్లో ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వగా, కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఇకపై తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. ఈ మార్పులు ఆంధ్రప్రదేశ్-తెలంగాణకు సంబంధించిన అంశాల్లోనే ఉంటాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, భౌగోళిక అంశాలు, ఎకానమీ, తెలంగాణ సంస్కృతి తదితర అంశాలు సిలబస్‌లో చేరే అవకాశం ఉంటుంది. మిగిలిన అంశాల్లో కొత్తగా చోటు చేసుకున్న పరిణామాల మేరకు (ఆవిష్కరణల ప్రకారం) బయాలజీ వంటి వాటిల్లో మార్పులు ఉంటాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్లే ఇలాంటి మార్పులు ఉంటాయి. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక ప్రభుత్వ అవసరాల మేరకు ఆయా శాఖల నుంచి ఇండెంట్లు వచ్చాక, సర్వీసు కమిషన్ నోటిఫికేషన్లను జారీచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మా తరఫున ఎలాంటి జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరగా నివేదికలు అందజేస్తాం. అయితే పరీక్షల విధానంలో ఇప్పటికిప్పుడే భారీగా మార్పులు ఉండకపోవచ్చు. మొత్తం సిస్టంను మార్చే సాహసం మేము చేయం. తర్వాత కాలంలో మాత్రం పూర్తి స్థాయిలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అప్పటి అభ్యర్థులకు ఇబ్బందేమీ ఉండదు. మా కమిటీ ఎలాంటి నిర్ణయాలు చేయదు.. కమిషన్‌కు సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తుంది. తెలంగాణ పునర్నిర్మాణం కోసం చాలా మంది ఉద్యోగులు అవసరం. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన వీలైనంత త్వరగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి మా సలహా. -
కొత్త సంవత్సరంలో కొలువుల ఆశలు నెరవేరేలా..
ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, చైర్మన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ). కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ.. కొత్త రూపు సంతరించుకున్న నవ్యాంధ్ర.. ఆపై కొత్త ప్రభుత్వాలు కొలువుదీరడంతో లక్షలాది నిరుద్యోగుల్లో ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు చిగురించాయి. రెండుమూడేళ్లుగా ప్రకటనల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులు గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర పరీక్షల్లో విజయమే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. వేలల్లో ఫీజులు చెల్లించి, శిక్షణ తీసుకుంటున్నారు. అయితే అటు ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ తప్ప ఇతర నియామకాల ఊసే లేదు! తెలంగాణలో మాత్రం లక్షకు పైగా పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది. కొత్తగా ఏర్పడిన టీఎస్పీఎస్సీకి చైర్మన్, సభ్యులను నియమించారు. పోటీపరీక్షల విధివిధానాలపై అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ తొలి చైర్మన్ ఘంటా చక్రపాణితో ప్రత్యేక ఇంటర్వ్యూ.. యూపీఎస్సీ మొదలు దేశవ్యాప్తంగా ఉన్న 28 సర్వీస్ కమిషన్లలో ఆదర్శవంతంగా ఉన్న అంశాలను టీఎస్పీఎస్సీలో అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. యూపీఎస్సీ తరహాలో అభ్యర్థి ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా జీఎస్‌తోపాటు మరో పేపర్‌ను రూపొందించాలనే ఆలోచనా ఉంది. అలాగని ఆ పేపర్ సీశాట్ తరహాలో ఉంటుందని, కొన్ని అకడమిక్ నేపథ్యాల అభ్యర్థులకు మాత్రమే అనుకూలంగా ఉంటుందని ఆందోళన చెందొద్దు. దీనిపై త్వరలో పూర్తి స్పష్టతనిస్తాం. తెలంగాణ రాష్ట్రంలోని లక్షల మంది అభ్యర్థుల ఆకాంక్షలు, సర్కారీ కొలువులను సొంతం చేసుకోవాలనే ఆశలను నెరవేర్చేందుకు అన్ని విధాలా కృషిచేస్తాం. ప్రభుత్వం నుంచి ఉద్యోగ నియామకాలు చేపట్టాలనే ప్రతిపాదన వచ్చిన వెంటనే ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తాం. అభ్యర్థులు ప్రధానంగా ఓ విషయాన్ని గుర్తించాలి.. సర్వీస్ కమిషన్ అనేది ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టే వ్యవస్థ మాత్రమే. ప్రభుత్వం నుంచి అందిన ఖాళీలకు సంబంధించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడం కమిషన్ బాధ్యత. అంతేగానీ కమిషన్ సొంతంగా ఉద్యోగాలు సృష్టించి, నోటిఫికేషన్లు జారీ చేయలేదు. దీన్ని గుర్తించకుండా త్వరగా నియామకాలు చేపట్టాలంటూ ఆందోళనలు చేయడం వల్ల అభ్యర్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకున్నట్లే అవుతుంది. ఎలాంటి ఉద్యోగాల భర్తీకైనా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తక్షణం మా పని ప్రారంభిస్తాం. ఈ క్రమంలో ప్రతి రిక్రూట్మెంట్కు సంబంధించి నోటిఫికేషన్ నుంచి ఇంటర్వ్యూ తేదీ వరకు షెడ్యూల్‌ను ముందుగానే ప్రకటిస్తాం. దీనివల్ల అభ్యర్థులు కచ్చితమైన అవగాహనతో తమ ప్రిపరేషన్‌కు వ్యూహాలు అమలు చేసేందుకు వీలవుతుంది. సిలబస్ మార్పులపై ఆందోళన అనవసరం కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో సిలబస్‌ను తెలంగాణ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా మార్చడం ఆవశ్యకం. మారిన సిలబస్‌పై అందుబాటులో ఉన్న సమయంలో అవగాహన పెంపొందించుకోవడం సాధ్యమేనా? అనే ఆందోళన అనవసరం. గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియను పరిగణనలోకి తీసుకుంటే ప్రిలిమినరీ స్థాయిలో జనరల్ స్టడీస్ పరీక్ష ఉంటుంది. దీనికి సంబంధించి సిలబస్ పరంగా మార్పులు ఉండవు. మెయిన్ పరీక్ష విషయంలోనే కొత్త సిలబస్ అంశం ప్రస్తావనకు వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే నోటిఫికేషన్ నుంచి మెయిన్ ఎగ్జామినేషన్ మధ్యలో అభ్యర్థులకు దాదాపు ఆర్నెల్ల సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో వారు కొత్త సిలబస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన పొందొచ్చు. గ్రూప్-4 వంటి పరీక్షల విషయంలో ప్రత్యేకించి ఒక ప్రాంతానికి సంబంధించిన అంశాలు ఉండవు. అన్నీ జనరల్ స్టడీస్ పరిధిలోనే ఉంటాయి కాబట్టి సిలబస్ పరంగా ఆందోళన అనవసరం. అన్ని నేపథ్యాల వారికి అనుకూలంగా గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలంటే నగరాల్లో చదువుకున్న అభ్యర్థులు, అకడమిక్ నేపథ్యం బాగా ఉన్నవారికే అనుకూలం అనే భావన తలెత్తకుండా చూస్తాం. అంతేకాకుండా కోచింగ్ తీసుకుంటేనే విజయం సాధ్యం అనే అపోహ తొలగేలా చర్యలు తీసుకుంటాం. ఈ క్రమంలో అన్ని నేపథ్యాల అభ్యర్థులు పోటీపడేందుకు వీలుగా సిలబస్ రూపొందించాలని భావిస్తున్నాం. దీనికి సంబంధించి ఆయా రంగాలకు చెందిన మేధావులు, విద్యావేత్తలతో కమిషన్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షల విధివిధానాలు, సిలబస్ మార్పులపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. అన్ని అంశాలనూ అధ్యయనం చేశాక సిలబస్‌కు తుదిరూపమిస్తాం. చివరి సంవత్సరం అభ్యర్థుల విషయంలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో మొదటి దశ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కు బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి విధానాన్ని టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీలోనూ అమలు చేయాలనే యోచన ఉంది. దీనివల్ల మరింత మంది అభ్యర్థులకు అవకాశం లభిస్తుంది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు అంటే కోర్టు కేసులు, ‘స్టే’లు, వాయిదాలు వంటి న్యాయపరమైన సమస్యలు సహజమనే అభిప్రాయం ఉంది. అందుకే ఒక నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తవ్వాలంటే ఏళ్ల తరబడి వేచి చూడాలనే భావన ఉంది. దీన్ని తొలగించేందుకు న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ముందే వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. వేగవంతంగా ప్రక్రియ పూర్తయ్యే దిశగా చర్యలు చేపడతాం. మేలైన విధానాల సమాహారం కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధి విధానాల విషయంలో సొంత ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇదే సమయంలో యూపీఎస్సీ మొదలు దేశవ్యాప్తంగా ఉన్న 28 సర్వీస్ కమిషన్లలో ఆదర్శవంతంగా ఉన్న అంశాలను కమిషన్‌లో అమలు చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అమలు చేస్తున్న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయాలనే ఆలోచనే ఇందుకు ఉదాహరణ. అదే విధంగా యూపీఎస్సీ తరహాలో అభ్యర్థి ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా జీఎస్‌తోపాటు ఒక పేపర్‌ను రూపొందించాలనే ఆలోచన కూడా ఉంది. అలాగని ఆ పేపర్ సీశాట్ మాదిరిగా ఉంటుందని, కొన్ని అకడమిక్ నేపథ్యాల అభ్యర్థులకు మాత్రమే అనుకూలంగా ఉంటుందని ఆందోళన చెందొద్దు. దీనిపై త్వరలో పూర్తి స్పష్టతనిస్తాం. స్వయంకృషిని నమ్ముకోండి కొత్త రాష్ట్రం ఏర్పడింది. లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ల కోసం మరెన్నో లక్షల మంది ఎదురు చూస్తున్నమాట వాస్తవం. ఈ మేరకు కమిషన్ కూడా కృషి చేస్తుంది. సిలబస్, స్కీం ఆఫ్ ఎగ్జామినేషన్స్ తదితర అంశాలపై స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఔత్సాహిక అభ్యర్థులు స్వయంకృషితో కదలాలి. తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ, భౌగోళిక అంశాలపై ప్రాథమిక అవగాహన ఏర్పరుచుకుంటే సిలబస్ తుది రూపం వచ్చాక ప్రిపరేషన్ తేలికవుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో కొంత ఆలస్యమైనా ఖాళీల భర్తీ జరగడం ఖాయం. కాబట్టి ఆందోళనలు, నిరసనలకు దూరంగా ఉండి లక్ష్య సాధనపైనే దృష్టి కేంద్రీకరించండి. -
నో డీఎస్సీ!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకానికి తెర పడినట్లే. ఇక నుం చి విద్యా శాఖ ద్వారా కాకుండా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వా రా టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ అధికారులు మూడు రోజులుగా విద్యా శాఖ నుంచి జిల్లాలవారీగా ఖాళీల వివరాలను సే కరిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విధివిధానాలను ఖరారు చేసిన ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి త్వరలోనే ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమం లో జిల్లాలో ఖాళీగా ఉన్న 1,344 ఉపాధ్యాయ పోస్టులు త్వరలో టీఎస్పీఎస్సీ ద్వారానే భ ర్తీ కానున్నాయి. ప్రస్తుతం ఇదీ పరిస్థితి జిల్లాలో 1,573 ప్రాథమిక పాఠశాలలు, 975 ప్రాథమికోన్నత పాఠశాలలు, 465 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. రెండున్నర లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నా రు. 10 వేల మంది టీచర్లు విద్యాబోధన చేపడుతున్నారు. 1,344 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి సంబంధించి రెండు సంవత్సరాలుగా సందిగ్ధత నెలకొంది. గత ఏడాది జనవరి 29న ప్రభుత్వం డీఎస్సీ పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలను వెల్లడించింది. అనంతరం గత డిసెంబర్ వరకు మళ్లీ పోస్టులను పునఃప రిశీలించింది. దీనికి సంబంధించి జిల్లా అధికారులు పాఠశాల విద్యా శాఖకు నివేదిక కూడా సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున 2014 లోనే డీఎస్సీ ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిం చారు. గత ఏడాది మార్చిలో టెట్‌ను కూడా నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు, విద్యారంగంలో వివిధ సంస్కరణలు రావడంతో పోస్టుల భర్తీ ఆలస్యమవుతూ వస్తోంది. ఇటీవలే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు, చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఘంటా చక్రపాణి పోస్టుల భర్తీ మే నెలలో జరుగవ చ్చని ప్రకటించారు. ముఖ్యమైన పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించామని చెప్పిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జిల్లాలో గతంలో నిర్వహించిన డీఎస్సీ రోస్టర్ పాయింట్ విధానం లేదా మెరిట్ విధానం ద్వారా టీఎస్పీఎస్సీ నుంచి టీచర్ పోస్టుల నియామకాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా త్వరలోనే ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జిల్లాలవారీగా ఖాళీల వివరాలను సేకరించే ప్రక్రియను పీఎస్సీ అధికారులు వేగవంతం చేసినందున, ఉత్తర్వులు ఈ నెలాఖరులో వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. కొత్త విధానంపై అభ్యర్థుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి -
ఆదర్శ కమిషన్‌గా పేరు తీసుకురండి
టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులకు గవర్నర్ నరసింహన్ సూచన సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ నియామకాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు (టీఎస్పీఎస్సీ) ఆదర్శ కమిషన్‌గా పేరు తీసుకురావాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి, సభ్యులు విఠల్, చంద్రావతి, మతీనుద్దీన్లు శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి, కమిషన్‌ను నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రతిభావంతులకు ఉద్యోగాలివ్వడం ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని, ఆ దిశగా కృషి చేయాలని వారికి సూచించారు. తాను టీం సభ్యునిగా ఉంటానని, ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. -
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) ఏర్పాటుకు గ వర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. దీంతో త్వరలోనే టీపీఎస్సీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. రాష్ట్ర విభజన చట్టంలో టీపీఎస్సీ ఏర్పాటయ్యేవరకు ఇక్కడ ఉద్యోగాలను భర్తీ చేయాలంటే ఆ బాధ్యతలను యూపీఎస్సీ చూస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వ తొలి కేబినెట్ భేటీలోనే రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ఫైలును రూపొందించి ముఖ్యమంత్రి, గవర్నర్ ఆమోదానికి ఇటీవలే పంపించారు. బుధవారంనాడే గవర్నర్ ఈ ఫైలుపై ఆమోద ముద్ర వేశారు. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించనుంది. టీపీఎస్సీ ఏర్పాటుతో తెలంగాణ నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. టీపీఎస్సీ ద్వారా దాదాపు 15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంటుందని నిరుద్యోగులు భావిస్తున్నారు. ఇక కమిషన్ చైర్మన్‌గా ఘంటా చక్రపాణిని నియమిస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో దానిపైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గెజిటెడ్ అధికారుల సంఘం హర్షం టీపీఎస్సీకి గవర్నర్ ఆమోదముద్ర వేయడం పట్ల తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. సర్వీసు కమిషన్ విధి విధానాలను రూపొందించి, గవర్నర్ ఆమోదం పొందేలా చేయడంలో సీఎం కేసీఆర్ శ్రద్ధ చూపారన్నారు. త్వరలోనే నిరుద్యోగులకు మేలు చేసే ప్రకటన వస్తుందని, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయని వెల్లడించారు. కమిషన్‌లో సభ్యులుగా సమర్థులైన అధికారులను గౌరవ సభ్యులుగా నియమించాలని, మహిళా అధికారిని కార్యదర్శిగా నియమించాలని వారు కోరారు. -
త్వరలో టీఎస్పీఎస్సీ ఏర్పాటు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్(టీఎస్పీఎస్సీ) ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. దీనికి సంబంధించిన ఫైలును అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆమోదం కోసం పంపినట్లు తెలిసింది. ఈ ఫైలుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమ్మతి తెలిపిన వెంటనే కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించాలని భావిస్తున్నారు. రాష్ట్ర విభ జన తర్వాత అప్పటివరకు ఉన్న ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పని చేస్తుందని, తెలంగాణకు ప్రత్యేకంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటు చేస్తారని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో కేంద్రం పేర్కొంది. అప్పటి వరకు.. ఏమైనా ఉద్యోగాల భర్తీ వ్యవహారాలను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చూస్తుందని స్పష్టం చేసింది. సీఎం నేతృత్వంలోని బృందం త్వరలో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నందున.. ఆయనే స్వయంగా టీఎస్పీఎస్సీ ఆమోదానికి, ఉత్తర్వుల జారీకి కేంద్రంతో చర్చించనున్నారు