కొత్త సంవత్సరంలో కొలువుల ఆశలు నెరవేరేలా.. | Placements hopes to accomplish in the new year | Sakshi
Sakshi News home page

కొత్త సంవత్సరంలో కొలువుల ఆశలు నెరవేరేలా..

Published Thu, Jan 8 2015 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

కొత్త సంవత్సరంలో కొలువుల ఆశలు నెరవేరేలా..

కొత్త సంవత్సరంలో కొలువుల ఆశలు నెరవేరేలా..

ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి,
 చైర్మన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ).

 
 కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ.. కొత్త రూపు సంతరించుకున్న నవ్యాంధ్ర..  ఆపై కొత్త ప్రభుత్వాలు కొలువుదీరడంతో లక్షలాది నిరుద్యోగుల్లో ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు చిగురించాయి. రెండుమూడేళ్లుగా ప్రకటనల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులు గ్రూప్ 1,  గ్రూప్ 2 తదితర పరీక్షల్లో విజయమే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. వేలల్లో ఫీజులు చెల్లించి, శిక్షణ తీసుకుంటున్నారు. అయితే   అటు ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ తప్ప ఇతర నియామకాల ఊసే లేదు! తెలంగాణలో మాత్రం లక్షకు పైగా  పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది. కొత్తగా ఏర్పడిన టీఎస్‌పీఎస్సీకి చైర్మన్, సభ్యులను నియమించారు. పోటీపరీక్షల విధివిధానాలపై  అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ తొలి చైర్మన్ ఘంటా చక్రపాణితో ప్రత్యేక ఇంటర్వ్యూ..
 
 యూపీఎస్సీ మొదలు దేశవ్యాప్తంగా ఉన్న 28 సర్వీస్ కమిషన్‌లలో ఆదర్శవంతంగా ఉన్న అంశాలను టీఎస్‌పీఎస్సీలో
 అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. యూపీఎస్సీ తరహాలో అభ్యర్థి ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా
 జీఎస్‌తోపాటు మరో పేపర్‌ను రూపొందించాలనే ఆలోచనా ఉంది. అలాగని ఆ పేపర్ సీశాట్ తరహాలో ఉంటుందని, కొన్ని అకడమిక్ నేపథ్యాల అభ్యర్థులకు మాత్రమే అనుకూలంగా ఉంటుందని ఆందోళన చెందొద్దు. దీనిపై త్వరలో పూర్తి స్పష్టతనిస్తాం.
 
 తెలంగాణ రాష్ట్రంలోని లక్షల మంది అభ్యర్థుల ఆకాంక్షలు, సర్కారీ కొలువులను సొంతం చేసుకోవాలనే ఆశలను నెరవేర్చేందుకు అన్ని విధాలా కృషిచేస్తాం. ప్రభుత్వం నుంచి ఉద్యోగ నియామకాలు చేపట్టాలనే ప్రతిపాదన వచ్చిన వెంటనే ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తాం. అభ్యర్థులు ప్రధానంగా ఓ విషయాన్ని గుర్తించాలి.. సర్వీస్ కమిషన్ అనేది ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టే వ్యవస్థ మాత్రమే. ప్రభుత్వం నుంచి అందిన ఖాళీలకు సంబంధించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయడం కమిషన్ బాధ్యత. అంతేగానీ కమిషన్ సొంతంగా ఉద్యోగాలు సృష్టించి, నోటిఫికేషన్లు జారీ చేయలేదు. దీన్ని గుర్తించకుండా త్వరగా నియామకాలు చేపట్టాలంటూ ఆందోళనలు చేయడం వల్ల అభ్యర్థులు తమ విలువైన సమయాన్ని వృథా చేసుకున్నట్లే అవుతుంది. ఎలాంటి ఉద్యోగాల భర్తీకైనా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే తక్షణం మా పని ప్రారంభిస్తాం. ఈ క్రమంలో ప్రతి రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి నోటిఫికేషన్ నుంచి ఇంటర్వ్యూ తేదీ వరకు షెడ్యూల్‌ను ముందుగానే ప్రకటిస్తాం. దీనివల్ల అభ్యర్థులు కచ్చితమైన అవగాహనతో తమ ప్రిపరేషన్‌కు వ్యూహాలు అమలు చేసేందుకు వీలవుతుంది.
 
 సిలబస్ మార్పులపై ఆందోళన అనవసరం
 కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో చేపట్టనున్న గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల్లో సిలబస్‌ను తెలంగాణ ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా మార్చడం ఆవశ్యకం. మారిన సిలబస్‌పై అందుబాటులో ఉన్న సమయంలో అవగాహన పెంపొందించుకోవడం సాధ్యమేనా? అనే ఆందోళన అనవసరం. గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియను పరిగణనలోకి తీసుకుంటే ప్రిలిమినరీ స్థాయిలో జనరల్ స్టడీస్ పరీక్ష ఉంటుంది. దీనికి సంబంధించి సిలబస్ పరంగా మార్పులు ఉండవు. మెయిన్ పరీక్ష విషయంలోనే కొత్త సిలబస్ అంశం ప్రస్తావనకు వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే నోటిఫికేషన్ నుంచి మెయిన్ ఎగ్జామినేషన్ మధ్యలో అభ్యర్థులకు దాదాపు ఆర్నెల్ల సమయం అందుబాటులో ఉంటుంది. ఈ సమయంలో వారు కొత్త సిలబస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన పొందొచ్చు. గ్రూప్-4 వంటి పరీక్షల విషయంలో ప్రత్యేకించి ఒక ప్రాంతానికి సంబంధించిన అంశాలు ఉండవు. అన్నీ జనరల్ స్టడీస్ పరిధిలోనే ఉంటాయి కాబట్టి సిలబస్ పరంగా ఆందోళన అనవసరం.
 
 అన్ని నేపథ్యాల వారికి అనుకూలంగా
 గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలంటే నగరాల్లో చదువుకున్న అభ్యర్థులు, అకడమిక్ నేపథ్యం బాగా ఉన్నవారికే అనుకూలం అనే భావన తలెత్తకుండా చూస్తాం. అంతేకాకుండా కోచింగ్ తీసుకుంటేనే విజయం సాధ్యం అనే అపోహ తొలగేలా చర్యలు తీసుకుంటాం. ఈ క్రమంలో అన్ని నేపథ్యాల అభ్యర్థులు పోటీపడేందుకు వీలుగా సిలబస్ రూపొందించాలని భావిస్తున్నాం. దీనికి సంబంధించి ఆయా రంగాలకు చెందిన మేధావులు, విద్యావేత్తలతో కమిషన్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షల విధివిధానాలు, సిలబస్ మార్పులపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. అన్ని అంశాలనూ అధ్యయనం చేశాక సిలబస్‌కు తుదిరూపమిస్తాం.
 
 చివరి సంవత్సరం అభ్యర్థుల విషయంలో
 యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో మొదటి దశ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌కు బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలాంటి విధానాన్ని టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీలోనూ అమలు చేయాలనే యోచన ఉంది. దీనివల్ల మరింత మంది అభ్యర్థులకు అవకాశం లభిస్తుంది.
 
 న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా
 ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రంలో సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లు అంటే కోర్టు కేసులు, ‘స్టే’లు, వాయిదాలు వంటి న్యాయపరమైన సమస్యలు సహజమనే అభిప్రాయం ఉంది. అందుకే ఒక నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తవ్వాలంటే ఏళ్ల తరబడి వేచి చూడాలనే భావన ఉంది. దీన్ని తొలగించేందుకు న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ముందే వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. వేగవంతంగా ప్రక్రియ పూర్తయ్యే దిశగా చర్యలు చేపడతాం.
 
 మేలైన విధానాల సమాహారం
 కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విధి విధానాల విషయంలో సొంత ఆలోచనలు ఉన్నాయి. కానీ ఇదే సమయంలో యూపీఎస్సీ మొదలు దేశవ్యాప్తంగా ఉన్న 28 సర్వీస్ కమిషన్‌లలో ఆదర్శవంతంగా ఉన్న అంశాలను కమిషన్‌లో అమలు చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అమలు చేస్తున్న ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమలు చేయాలనే ఆలోచనే ఇందుకు ఉదాహరణ. అదే విధంగా యూపీఎస్సీ తరహాలో అభ్యర్థి ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా జీఎస్‌తోపాటు ఒక పేపర్‌ను రూపొందించాలనే ఆలోచన కూడా ఉంది. అలాగని ఆ పేపర్ సీశాట్ మాదిరిగా ఉంటుందని, కొన్ని అకడమిక్ నేపథ్యాల అభ్యర్థులకు మాత్రమే అనుకూలంగా ఉంటుందని ఆందోళన చెందొద్దు. దీనిపై త్వరలో పూర్తి స్పష్టతనిస్తాం.
 
 స్వయంకృషిని నమ్ముకోండి
 కొత్త రాష్ట్రం ఏర్పడింది. లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి కమిషన్ నోటిఫికేషన్ల కోసం మరెన్నో లక్షల మంది ఎదురు చూస్తున్నమాట వాస్తవం. ఈ మేరకు కమిషన్ కూడా కృషి చేస్తుంది. సిలబస్, స్కీం ఆఫ్ ఎగ్జామినేషన్స్ తదితర అంశాలపై స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఔత్సాహిక అభ్యర్థులు స్వయంకృషితో కదలాలి. తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ, భౌగోళిక అంశాలపై ప్రాథమిక అవగాహన ఏర్పరుచుకుంటే సిలబస్ తుది రూపం వచ్చాక ప్రిపరేషన్ తేలికవుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో కొంత ఆలస్యమైనా ఖాళీల భర్తీ జరగడం ఖాయం. కాబట్టి ఆందోళనలు, నిరసనలకు దూరంగా ఉండి లక్ష్య సాధనపైనే దృష్టి కేంద్రీకరించండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement