ప్రణాళికతో చదివితే విజయమే... | Plan With reading success ... | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో చదివితే విజయమే...

Published Sat, Sep 12 2015 1:04 AM | Last Updated on Mon, Aug 20 2018 8:09 PM

ప్రణాళికతో చదివితే విజయమే... - Sakshi

ప్రణాళికతో చదివితే విజయమే...

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ చరిత్రకు ప్రాధాన్యం ఇస్తోంది... చరిత్ర, సంస్కృతిని సంపూర్ణంగా అధ్యయనం చేయాలి. ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ, ప్రణాళికతో చదివితే విజయాలు సాధించడం సులభం.’ అని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, చరిత్ర పరిశోధకులు జి.సుదర్శన్‌రెడ్డి సూచించారు. ‘సాక్షి- భవిత’ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో గ్రూప్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.

నిరుద్యోగులు, విద్యార్థులు భారీ సంఖ్యలో సదస్సుకు తరలివచ్చారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూరు, బోధన్‌తో పాటు కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి, కోరుట్ల, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో హాజరయ్యారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారు ఉదయం 10  నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు వివిధ సబ్జెక్ట్‌లలో నిష్ణాతులైన ఉపన్యాసకుల ప్రసంగాలు ఓపికగా విన్నారు.

అనంతరం ఆ సబ్జెక్టులపై అభ్యర్థులు తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ప్రొఫెసర్ సుదర్శన్‌రెడ్డితోపాటు నిజామాబాద్ ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ వి.వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ తొంటి దేవన్న, అర్థశాస్త్ర నిపుణులు డాక్టర్ ఎస్. భూమన్నయాదవ్ పలు సూచనలు చేశారు. శాతవాహనుల కాలం నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దాకా ప్రతి అంశాన్ని అధ్యయనం చేయాలని ప్రొఫెసర్ సుదర్శన్‌రెడ్డి వివరించారు. శాతవాహనుల కాలంలో సామాజిక, సాంస్కృతిక అంశాలను గురించి తెలుసుకోవాలన్నారు.

ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక తెలంగాణపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, కాకతీయులు, వెచర్ల వంశస్తులు, కుతుబ్‌షాహీలు, నిజాం, రజాకార్ల పాలన నుంచి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు, ముగింపు వరకు పూర్తి వివరాలను అధ్యయనం చేయాలన్నారు. ముఖ్యంగా సామాజిక నిర్మాణాలు, కులమతాలు, చిత్రలేఖనం, నాట్యాలు, వాస్తుకళా నిర్మాణం, స్త్రీల స్థానం, తెలుగు భాష, కవులు, జమీందారీ వ్యవస్థ,  అణచివేతలు, తిరుగుబాట్ల గురించి చదవాలన్నారు.

1948 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు రెండో పేపర్‌లో ఉంటుందని వివరిస్తూ మిలిటరీ రూల్, పోలీస్ చర్య, తెలంగాణ సాయుధ రైతాంగ పోరు, ఏపీ ఏర్పాటు, పెద్దమనుషుల ఒప్పందంతోనే మొదలైన ఉల్లంఘనలు, కమిషన్లు, 1969 నాటి చరిత్రాత్మక పోరాటం, నక్సలైట్ల ఉద్యమం, మలిదశలో తెలంగాణ జనసభ, తెలంగాణ ప్రజాఫంట్, టీఆర్‌ఎస్, జేఏసీల ఉద్యమాలను అధ్యయనం చేయాలని సూచించారు.
 
అపజయాలతో కుంగిపోవద్దు

గ్రూప్స్ సాధించాలన్న పట్టుదలతో చదవాలి. ఒక్కోసారి అపజయాలు ఎదురైతే కుంగిపోకుండా మరింత పట్టుద ల, కసితో చదవాలి. మన ప్రభుత్వం ఎన్నో ఉద్యోగాల నియామకాల కోసం గ్రూప్స్ పరీక్షలు నిర్వహించనుంది. ఇప్పటి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలి.. స్నేహితులతో చర్చించుకోవాలి. లక్ష్యసాధ న కోసం కృషి చేస్తే తప్పక విజయం వరిస్తుంది.
- వి.వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్
 
ప్రణాళికాబద్ధంగా చదవాలి
పతీ అభ్యర్థి ప్రణాళిక రూపొందించుకుని ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి. అర్థశాస్త్ర అవగాహన పెంపొందించుకోవడం అవసరం.  ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి అన్న అంశాల నుంచి జీఎన్‌పీ, జీడీపీల దాకా అధ్యయనం చేయాలి. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి  చదవాలి.
- డాక్టర్ ఎస్. భూమన్న యాదవ్, ఆర్థిక శాస్త్ర నిపుణులు
 
చరిత్రపై పట్టు సాధించాలి
చరిత్రపై పట్టు సాధించకుండా గ్రూప్స్‌లో విజయం సాధించలేరు. చరిత్ర గొలుసులాంటిది. చరిత్రలో ఒకదానికి మరొకదానికి సంబంధం ఉంటుంది. చరిత్రను అధ్యయనం చేయడం అంటే ఇబ్బంది అన్న భావనను తొల గించుకుని చదివితే అందరికీ సులువే. పోటీ పరీక్షలకు చరిత్రను గుర్తు పెట్టుకోవడం చాలా తప్పనిసరి.   
- తొంటి దేవన్న, అసిస్టెంట్ ప్రొఫెసర్  
 
లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలి
ప్రతిఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవడం ద్వారా విజయాలను సొంతం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నందున లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకుసాగాలి.  గ్రూప్స్‌కు సంబంధించి జనరల్ స్టడీస్ సమాచారం ఎక్కువగా పత్రికల్లోనే ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి పత్రికలు చదివే అలవాటు ఉండటం వల్లే గ్రూప్-1 ద్వారా డీఎస్పీ ఉద్యోగం సంపాదించా. తెలుగు మీడియంలోనే చదివి, తెలుగు మీడియంలోనే పరీక్ష రాసి విజయం సాధించాను. ‘సాక్షి’ చేపట్టిన కార్యక్రమం అభినందనీయం.
- చంద్రశేఖర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement