పోటీ పరీక్షల్లో మార్పులకు శ్రీకారం | Making changes in competitive examinations | Sakshi
Sakshi News home page

పోటీ పరీక్షల్లో మార్పులకు శ్రీకారం

Published Sat, Jan 10 2015 3:54 AM | Last Updated on Sat, Sep 2 2017 7:27 PM

Making changes in competitive examinations

* టీఎస్‌పీఎస్‌సీ చర్యలు
* మొదటిసారి సమావేశమైన సమీక్ష కమిటీ
* పరీక్షల విధానం, సిలబస్ మార్పులపై చర్చ
* ప్రతిపాదనల రూపకల్పనకు సబ్ కమిటీ
లు ఏర్పాటు
* ఈ నెల 17న మరో సమావేశం

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోటీ పరీక్షల విధానం, సిలబస్‌లో మార్పులపై కసరత్తు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) కార్యాలయంలో టీఎస్‌పీఎస్‌సీ నియమించిన కమిటీ మొదటి సమావేశం శుక్రవారం జరిగింది. సమీక్ష, మార్పుల కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పోటీ పరీక్షల్లో తీసుకురావాల్సిన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏయే పోటీ పరీక్షలో ఎలాంటి పేపర్లు ఉండాలి.. ఎన్ని పేపర్లు అవసరం.. ఏయే పరీక్షలకు ఇంటర్వ్యూలు అవసరం.., ఇంటర్వ్యూలు ఉన్న వాటిల్లో ఎన్ని మార్కులకు పెట్టాలి.. పరీక్షల వారీగా సిలబస్ ఎలా ఉండాలి.. ఏయే పాఠ్యాంశాలను చేర్చాలి అనే అంశాలపై కమిటీ చర్చించింది. ప్రధానంగా గ్రూపు-1, గ్రూపు-2 పోటీ పరీక్షల్లో ఎలాంటి విధానాలు అమలు చేయాలన్న అంశంతోపాటు సిలబస్‌లో ఎలాంటి మార్పులు అవసరమో చర్చించారు.
 
 కాగా, ఇంటర్వ్యూలు ఉంటే అందులో కనీస, గరిష్ట మార్కుల విధానం తప్పనిసరిగా ఉండాలన్న అంశంపై ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలిసింది.  వీటన్నింటిపై మరింత లోతుగా అధ్యయనం చేసి, మార్పులపై పూర్తి స్థాయి ప్రతిపాదనలను రూపొందించేందుకు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఒక కమిటీని, ప్రొఫెసర్ లింగమూర్తి నేతృత్వంలో మరో కమిటీని ఏర్పాటు చేశారు. వీటితోపాటు మరో మూడు సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈనెల 17న మరోసారి సమావేశమై సబ్ కమిటీలు చేసే మార్పులపై తుది నివేదికను రూపొందించి సర్వీసు కమిషన్‌కు అందజేయాలని నిర్ణయించారు. ఆ నివేదికలోని అంశాలపై సర్వీసు కమిషన్ చర్చించి ప్రభుత్వ ఆమోదానికి పంపుతుంది. ప్రభుత్వ ఆమోదం రాగానే ఇదే కమిటీ పూర్తి స్థాయి సిలబస్‌ను ప్రతిపాదించనుంది. ఆ తరువాత శాఖల వారీగా ఇండెంట్లు వస్తే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేస్తారు. కాగా, ఈ కమిటీ రెండు నివేదికలను కమిషన్‌కు అందజేయనుంది. అందులో ఇప్పటికిప్పుడు చేపట్టాల్సిన మార్పులపై ఒకదాన్ని, 2016 నాటికి తీసుకురావాల్సిన పూర్తిస్థాయి మార్పులపై మరొకదానిని కమిషన్‌కు అందజేస్తుందని సమాచారం.
 
 టీఎస్‌పీఎస్‌సీని సందర్శించిన సీఎస్
 తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్  (టీఎస్‌పీఎస్‌సీ) కార్యాలయాన్ని శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ  సందర్శించారు. సర్వీసు కమిషన్ ఆహ్వానం మేరకు సీఎస్‌తోపాటు సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, ప్రభుత్వ సలహాదారు పాపారావు సర్వీసు కమిషన్‌కు వచ్చారు. వారికి కమిషన్ చైర్మన్ చక్రపాణి, సభ్యులు విఠల్, చంద్రావతి సాదరంగా స్వాగతం పలికారు. తాము చేపట్టిన కార్యక్రమాలను సీఎస్‌కు వివరించారు.  
 
 అవసరం మేర మార్పులు: హరగోపాల్
 ప్రతి ఐదేళ్లు, పదేళ్లకోసారి సర్వీసు కమిషన్ సిలబస్‌లో మార్పులు చేస్తుంది. విద్యా విషయాలు, సమాజ విజ్ఞానంలో వచ్చిన మార్పులపై నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసి, వాటి సిఫారసులను సర్వీసు కమిషన్లు తీసుకుంటాయి. వివిధ పోటీ పరీక్షల్లో ఇన్నాళ్లు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, సంస్కృతికి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వగా, కొత్త రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఇకపై తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది. ఈ మార్పులు ఆంధ్రప్రదేశ్-తెలంగాణకు సంబంధించిన అంశాల్లోనే ఉంటాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, భౌగోళిక అంశాలు, ఎకానమీ, తెలంగాణ సంస్కృతి తదితర అంశాలు సిలబస్‌లో చేరే అవకాశం ఉంటుంది. మిగిలిన అంశాల్లో కొత్తగా చోటు చేసుకున్న పరిణామాల మేరకు (ఆవిష్కరణల ప్రకారం) బయాలజీ వంటి వాటిల్లో మార్పులు ఉంటాయి.
 
 గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినట్లే ఇలాంటి మార్పులు ఉంటాయి. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక ప్రభుత్వ అవసరాల మేరకు ఆయా శాఖల నుంచి ఇండెంట్లు వచ్చాక, సర్వీసు కమిషన్ నోటిఫికేషన్లను జారీచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మా తరఫున ఎలాంటి జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరగా నివేదికలు అందజేస్తాం. అయితే పరీక్షల విధానంలో ఇప్పటికిప్పుడే భారీగా మార్పులు ఉండకపోవచ్చు. మొత్తం సిస్టంను మార్చే సాహసం మేము చేయం. తర్వాత కాలంలో మాత్రం పూర్తి స్థాయిలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అప్పటి అభ్యర్థులకు ఇబ్బందేమీ ఉండదు. మా కమిటీ ఎలాంటి నిర్ణయాలు చేయదు.. కమిషన్‌కు సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తుంది. తెలంగాణ పునర్నిర్మాణం కోసం చాలా మంది ఉద్యోగులు అవసరం. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన వీలైనంత త్వరగా నియామకాలు చేపట్టాలని ప్రభుత్వానికి మా సలహా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement