పారదర్శకతకే పెద్దపీట! | importance Transparency | Sakshi
Sakshi News home page

పారదర్శకతకే పెద్దపీట!

Published Tue, Aug 18 2015 12:59 AM | Last Updated on Sun, Sep 3 2017 7:37 AM

పారదర్శకతకే పెద్దపీట!

పారదర్శకతకే పెద్దపీట!

ఉద్యోగపరీక్షల వ్యవహారాల్లో టీఎస్‌పీఎస్సీ కసరత్తు
వెబ్‌సైట్ ద్వారా సమగ్ర సేవలు అందించే చర్యలు
అభ్యర్థులు కమిషన్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు
సమస్యలపై వెబ్‌సైట్ ద్వారానే సేవలందించేలా చర్యలు
ఆన్‌లైన్ పరీక్షల విధానంపైనా ఆలోచనలు

 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది. పోటీ పరీక్షల నిర్వహణ విధానంతోపాటు జవాబు పత్రాల నకలు కాపీ, ‘కీ’ల ప్రకటన, ఫలితాల వెల్లడి వరకు అన్నీ పారదర్శకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. నోటిఫికేషన్లు జారీ చేయనున్న నేపథ్యంలో వీటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులోభాగంగా సమగ్ర సేవలను ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు కసరత్తు చేస్తోంది. సాధ్యమైనన్ని సేవలను తమ వెబ్‌సైట్ ద్వారా అందించేలా చర్యలు చేపడుతోంది. అభ్యర్థులు తమ కార్యాలయం చుట్టూ తిరిగే పని లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు తమ ఇంటి నుంచే వెబ్‌సైట్ ద్వారా సేవలు పొందేలా ఈ-మెయిల్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఫోన్ ద్వారా సమాచారమిచ్చేలా కాల్ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సర్వీసు కమిషన్ పనితీరుపై వచ్చినట్లు విమర్శలు, ఆరోపణలకు తావివ్వకుండా పారదర్శకంగా ఉండేలా కసరత్తు చేస్తోంది.
 
వన్‌టైం రిజిస్ట్రేషన్‌తో ఆరంభం
 టీఎస్‌పీఎస్సీ ఏర్పడగానే మొదట ప్రారంభించిందీ వన్ టైం రిజిస్ట్రేషన్ విధానాన్నే. కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ప్రత్యేక శ్రద్ధ వహించి దేశంలో ఎక్కడాలేని విధంగా దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఇతర రాష్ట్రాల సర్వీసు కమిషన్లతోపాటు యూపీఎస్సీ కూడా ఈ విధానాన్ని అభినందించింది. ఇప్పటికే దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు దీనికింద నమోదు చేసుకున్నారు. ఇక వన్‌టైం రిజిస్ట్రేషన్ చేసుకోని వారు కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ స్టేటస్‌ను వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు, హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ వంటి విషయాల్లోనూ సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా టెక్నికల్ టీంను సంప్రదించేలా ఫోన్ నెంబర్లు ఇచ్చింది. వీటితోపాటు ఫేస్‌బుక్, ట్వీటర్ వంటి సోషల్ మీడియా ద్వారా కూడా కమిషన్ సేవలను విసృ్తతం చేస్తోంది.

ఆన్‌లైన్ పరీక్షలు
వీటితో పాటు ఆన్‌లైన్ పరీక్షల ద్వారా పారదర్శకతను పెంచాలని కమిషన్ యోచిస్తోంది. ఇప్పటికే జేఈఈ మెయిన్ పరీక్షను సీబీఎస్‌ఈ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వనరుల (కంప్యూటర్ ల్యాబ్ తదితర ఏర్పాట్లు కలిగిన కార్యాలయాలు, విద్యా సంస్థలు) ప్రకారం ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తే దాదాపు 30 వేల మందికి చేపట్టవచ్చు. అంతకంటే ఎక్కువ మంది ఉంటే సరిపడా వనరులు లేవు. అందుకే తక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలనే ఆలోచనలు చేస్తోంది. ఇది అమలైతే పరీక్ష జరిగిన వారంలోగా పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వొచ్చు.

అభ్యంతరాలు ఆన్‌లైన్‌లో...
ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే పరీక్షలకు తెల్లారే ప్రాథమిక కీని ప్రకటించవచ్చు. లేదంటే ప్రైమరీ కీని ముందుగానే రూపొందించి ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేసే సాఫ్ట్‌వేర్‌తో.. అభ్యర్థి పరీక్ష రాస్తుండగానే అతని స్కోర్‌ను లెక్కించవచ్చు. ముందుగా ప్రకటించిన లేదా ఆన్‌లైన్‌లోనే పొందుపరిచిన కీపై అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరించి, ఒకట్రెండు రోజుల్లోనే అవసరమైతే మార్పులు చేసి ఫలితాలను ప్రకటించే వీలుంది. అభ్యర్థులు పోస్టింగ్ ఆర్డర్లు తీసుకునేందుకు మాత్రమే కమిషన్ కార్యాలయానికి వచ్చేలా ఉండాలన్న యోచన కమిషన్ వర్గాల్లో ఉంది. ఇందులో పరీక్షరాసే వారికి బయోమెట్రిక్ విధానం ఉంటుంది. దీంతో ఒకరికి బదులు మరొకరు రాసే విధానాన్ని అరికట్టవచ్చు. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే రాత పరీక్షల్లో అభ్యర్థులకు వారు రాసిన ఓఎంఆర్ జవాబు పత్రం నకలును అందించనుంది. ఇలా వీలైనంత మేరకు పారదర్శకత పెరిగేలా టీఎస్‌పీఎస్సీ కృషిచేస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement