వ్యవసాయాధికారుల పోస్టుల భర్తీకి సన్నాహాలు
- అభ్యర్థుల జాబితా ప్రకటించాలని టీఎస్‌పీఎస్సీకి వ్యవసాయశాఖ లేఖ
- వారం రోజుల్లో అభ్యర్థులకు నియామక పత్రాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1,506 మంది వ్యవసాయాధికారులను నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తం 1,311 వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో), 120 వ్యవసాయాధికారులు (ఏవో), 75 ఉద్యానాధికారుల (హెచ్‌వో) పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో వాటి నియామకాలు కొద్ది నెలలుగా నిలిచిపోయాయి. ఇటీవల కోర్టు తీర్పు అనంతరం ఆయా పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా ప్రకటించాలని టీఎస్‌పీఎస్సీకి రాష్ట్ర వ్యవసాయశాఖ లేఖ రాసింది. జాబితా ప్రకటించిన అనంతరం వెంటనే వారందరికీ నియామక పత్రాలు పంపిస్తామని వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఏఈవో పోస్టులకు ఇంటర్వూ్యలు లేనందున వారందరికీ నేరుగా నియామకపత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. వారం రోజుల్లో నియామక పత్రాలు పంపించే అవకాశం ఉంది. సంక్రాంతి కానుకగా అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు.
6,250 ఎకరాలకు ఒక ఏఈవో
రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచడం కోసం ప్రతి 6,250 ఎకరాలకు ఒక ఏఈవోని నియమించనున్నారు. 1,311 ఏఈవో, 120 ఏవో పోస్టులను వ్యవసాయ శాఖ కోసం నియమిస్తారు. ఉద్యానశాఖ కోసం 75 ఉద్యానశాఖ అధికారి (హెచ్‌వో) పోస్టులను నింపుతారు. వీరి నియామకాల తర్వాత కొద్ది రోజులపాటు శిక్షణ ఇచ్చి రాబోయే ఖరీఫ్ నాటికి 1,506 మందిని అందుబాటులోకి తెస్తామని అధికారులు తెలిపారు. 6,250 ఎకరాలకు ఒక ఏఈవో అంటే దాదాపు ఒకట్రెండు గ్రామాలకు ఒక ఏఈవో ఉండే అవకాశం ఉంది. వీరు రైతులకు అందుబాటులో ఉండి రైతులకు సలహాలు సూచనలు ఇస్తారు.
ఎలాంటి పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు వేయాలో రైతులకు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. మండలాలు, గ్రామాల్లో పనిచేయబోయే ఏవో, ఏఈవో, హెచ్‌వోలలో సగానికి పైగా మహిళలే ఉండే అవకాశాలున్నాయి. వ్యవసాయ కోర్సులు చదివే వారిలో 60 నుంచి 70 శాతం వరకు మహిళలే ఉంటున్నారు. కాబట్టి 1,506 మందిలో సగానికిపైగా మహిళలే ఉంటారని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఒకట్రెండు గ్రామాలకు కలిపి ఒక ఏఈవో ఉంటారు కాబట్టి వారు తప్పనిసరిగా ఏదో ఒక పెద్ద గ్రామంలో ఉండి పనిచేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
అయితే మహిళలు ఏ మేరకు ఆయా గ్రామాల్లో ఉండి సేవలందిస్తారో చూడాల్సి ఉంటుందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. వారికి సంబంధిత గ్రామంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తారా? లేకుంటే మండల కేంద్రంలో ఉండి సంబంధిత గ్రామాలకు వచ్చి పోవాలా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏఈవోలు మండల కేంద్రం... లేకుంటే సమీపంలోని పట్టణంలో ఉంటూ గ్రామాలకు వచ్చి పోతున్నారు. దీనివల్ల రైతులకు వారు పూర్తిస్థాయిలో సూచనలు సలహాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోతోందన్న విమర్శలున్నాయి.