సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో ఖాళీగా ఉన్న బిల్ కలెక్టర్ పోస్టులతోపాటు బేవరేజెస్ కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఈనెల 19న రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేయనుంది. జీహెచ్‌ఎంసీలోని 124 బిల్ కలెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, వాటిని గ్రూపు–4 పరిధిలోకి తీసుకురానుంది. అలాగే బేవరేజెస్ కార్పొరేషన్‌లో మరో 78 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. అందులో గ్రేడ్–2 అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 56 ఉండగా, గ్రేడ్–2 అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ పోస్టులు 13 ఉన్నాయి. అలాగే మరో 9 డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు వచ్చే వారం మరో 88 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీటిలో 50 హెల్త్ అసిస్టెంట్ పోస్టులు (బయాలజీతో ఇంటర్మీడియట్ అర్హతతో) ఉండగా, 35 శానిటరీ ఇన్‌స్పెక్టర్ పోస్టులు (బయాలజీతో డిగ్రీ అర్హతతో) ఉన్నాయి.
జిల్లాలకు ఎస్‌ఏ పోస్టుల మెరిట్ జాబితా
పాఠశాలల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీ ప్రక్రియను టీఎస్‌పీఎస్సీ వేగవంతం చేసింది. వచ్చే నెల మొదటి వారంలో స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు 1:3 రేషియోలో మెరిట్ జాబితాలను ఆయా జిల్లాలకు పంపించనుంది. దీనిపై డీఈవోలతో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్, పాఠశాల విద్య కమిషనర్ విజయ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్కూల్ అసిస్టెం ట్ జిల్లాల వారీ జాబితాలను గురువారం ఆయా జిల్లా కలెక్టర్లకు పంపించేందుకు చర్యలు చేపట్టారు.
13,665 మందితో ఎస్‌జీటీ మెరిట్ జాబితా
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టుల భర్తీలో భాగంగా వివిధ మీడియంలలో 1:3 రేషియోలో 13,665 మంది అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 5,415 పోస్టుల భర్తీ కోసం వారిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపిక చేసినట్లు తెలిపింది. రాష్ట్రంలోని పాత పది జిల్లా కేంద్రాల్లో వెరిఫికేషన్ ఉంటుందని, వెరిఫికేషన్ నిర్వహించే తేదీల వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను తమ వెబ్‌సైట్‌లో పొందవచ్చని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment