కొలువుల ఫైళ్లు నత్తనడక
ఉద్యోగ నియామకాల ఫైళ్లన్నీ ఎక్కడివక్కడే
- కీలకాంశాలపై స్పష్టత కరువు
- వయో పరిమితి పెంపుపై సందిగ్ధత
- పరీక్ష విధానం, జోన్ల వ్యవస్థ, టీఎస్‌పీఎస్‌సీ భర్తీ చేసే పోస్టులపై రాని స్పష్టత
- కమిటీలు, పరిశీలనతోనే కాలం వెళ్లబుచ్చుతున్న సర్కారు
- జూలై వచ్చినా జాడ లేని నోటిఫికేషన్లు
- ఆందోళనలో నిరుద్యోగులు
సాక్షి, హైదరాబాద్:
'త్వరలోనే 25 వేల ఉద్యోగాల భర్తీ...' అంటూ సర్కారు వెలువరించిన ప్రకటన నిరుద్యోగులను ఊరిస్తున్నా నియామకాలకు సంబంధించిన కసరత్తు నత్తనడకన సాగుతోంది. జూలై నుంచి నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలవుతుందని స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉంది. నోటిఫికేషన్లకు ఎంచుకున్న ముహూర్తం ముంచుకొస్తున్నా.. ఫైళ్లన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. శాఖల వారీగా ఖాళీల గుర్తింపు మినహా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అడుగు ముందుకు పడలేదు. కీలకమైన నిర్ణయాలన్నీ సీఎం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అభ్యర్థుల వయో పరిమితి ఎంత మేరకు సడలిస్తారు? జోనల్ విధానంలో మార్పుచేర్పులు ఉండబోతున్నాయా? అసలు పరీక్షల విధానం ఎలా ఉండబోతోంది? వీటికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.
మూడు వారాలు గడచినా..
సీఎం ఉద్యోగ నియామకాలపై ప్రకటన చేసి మూడు వారాలైంది. తొలి వారంలో 24 గంటల వ్యవధిలో ఖాళీల సమాచారం ఇవ్వాలని హడావుడి చేసిన సర్కారు.. ఆ తర్వాత వేగం తగ్గించింది. ఇంకా ఖాళీల గుర్తింపు ప్రక్రియే కొనసాగుతోంది. ఖాళీల వివరాలు కోరటం.. ప్రాధాన్యతా క్రమంలో ఏయే పోస్టులు భర్తీ చేయాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. 56 వేల ఖాళీలున్నట్టు వివిధ శాఖల నుంచి ఆర్థిక శాఖకు సమాచారం అందింది. నాలుగో తరగతి పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. కానీ జూనియర్ అసిస్టెంట్ స్థాయికి మించి ఎక్స్‌క్యూటివ్ పోస్టుల జాబితా సిద్ధం చేయాలని సర్కారు సూచింది. దీంతో ఆర్థికశాఖ తమ దగ్గరున్న ఖాళీల వివరాలను వడస్తోంది. తొలి విడతలో విద్య, వైద్యారోగ్యం, పురపాలక శాఖ, పంచాయతీరాజ్, హోంశాఖలోని ఖాళీలు భర్తీ చేసే అవకాశాలున్నాయి. ఈ అయిదు విభాగాల్లోని ఖాళీలపైనే సీఎస్ ఇటీవల ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించటం గమనార్హం. ఈ ఏడాది రాష్ట్ర స్థాయి పోస్టులు మినహా జోనల్, జిల్లా స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
వయో పరిమితిపై సందిగ్ధత
అభ్యర్థుల వయో పరిమితి పెంపుపై ప్రభుత్వం ఇప్పటికీ మార్గదర్శకాలు విడుదల చేయలేదు. జూన్ 10న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలోనూ దీనిపై చర్చించారు. 'అయిదేళ్లు పెంచాలా.. పదేళ్లా.. అనే దానిపై భిన్నమైన అభిప్రాయాలున్నాయి. చీఫ్ సెక్రెటరీ సారథ్యంలోని కార్యదర్శుల కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. వారం రోజుల్లో నాకు నివేదిక ఇస్తుంది' అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటికీ నిర్ణయం వెలువడలేదు. ఉద్యోగ నియామకాలకు ప్రస్తుతమున్న సాధారణ వయో పరిమితి 34 ఏళ్లు. యూనిఫాం సర్వీసులకు 28 ఏళ్లు. నిరుద్యోగులకు మాత్రమే వయోపరిమితి సడలింపు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న అభ్యర్థులకు గతంలో ఉన్న అయిదేళ్ల సడలింపు మాత్రమే వర్తింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
టీఎస్‌పీఎస్‌సీ పోస్టులేవీ ?
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా ఏయే పోస్టులు భర్తీ చేయాలన్న లెక్క తేలలేదు. టీఎస్‌పీఎస్‌సీ తొలి నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుంది? ఏయే పోస్టులు భర్తీ చేస్తారనేది సర్కారు వెల్లడించలేదు. ప్రభుత్వం భర్తీ చేయదలిచిన 25 వేల ఉద్యోగాల్లో వేటిని టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేస్తారు.. వేటిని డిపార్టుమెంట్ బోర్డుల ద్వారా భర్తీ చేస్తారో తేలాల్సి ఉంది. చీఫ్ సెక్రెటరీలు, డిపార్టుమెంట్ సెక్రెటరీలు చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీఎం చెప్పినా.. ఇప్పటికీ ఆ దిశగా తుది కసరత్తు జరగలేదు.
పరీక్ష విధానంపై సందిగ్ధత
టీఎస్‌పీఎస్‌సీ అధ్వర్యంలో నిర్వహించే పరీక్షల విధానం ఎలా ఉండబోతుందన్నది ఇప్పటికీ తేలలేదు. ఉద్యోగాల ప్రకటన అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సారథ్యంలో ముగ్గురు మంత్రుల సబ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలు, టీఎస్‌పీఎస్‌సీ చేసిన సిఫారసులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శుల కమిటీ ఇచ్చిన సలహాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సిన సబ్ కమిటీ ఎప్పుడు తమ నివేదిక ఇస్తుందో వేచి చూడాల్సిందే!
జోనల్ వ్యవస్థపై మల్లగుల్లాలు
జోనల్ వ్యవస్థపై అనేక సందేహాలు నిరుద్యోగులను పట్టి పీడిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 371(డీ) కింద ఆరు జోన్ల వ్యవస్థ ఉంది. విభజన అనంతరం తెలంగాణలో రెండే జోన్లు ఉన్నాయి. వీటిని రద్దు చేసి ఒక్కటిగా విలీనం చేయాలా లేదా నాలుగు జోన్లుగా పునర్వ్యవస్థీకరించాలా అన్నది చర్చనీయాంశంగానే ఉంది. పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల్లోనూ జోన్ల విధానం అమల్లో ఉంది. దీనికి మార్పులు చేర్పులు చేయాలంటే కేంద్రం అనుమతి పొందడంతోపాటు ప్రస్తుతమున్న చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది.