వయోపరిమితి పెంచినా ఉపయోగమేదీ?
• రెండేళ్లుగా వయోపరిమితి పెంచుతున్నా.. నోటిఫికేషన్లు లేవు
• గ్రూపు–2 మినహా సాధారణ డిగ్రీతో పోస్టులను భర్తీ చేయలేదు
• అదనంగా మరో రెండేళ్లు వయోపరిమితి పెంచాలంటున్న నిరుద్యోగులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులకు వయో పరిమితి తంటాలు తప్పడం లేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత సాధారణ డిగ్రీతో భర్తీ చేసే గ్రూప్–2 మినహా మరే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాలేదు.దాదాపు 5లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇంతవరకు మోక్షం లభించలేదు. ప్రస్తుతం డిసెంబరు నెలాఖరు వచ్చేసింది. అయినా నోటిఫికేషన్లు జారీ కాలేదు. దీంతో ప్రభుత్వం 2015 నుంచి పెంచుతూ వచ్చిన గరిష్ట వయో పరిమితి ప్రయోజనం లక్షల మందికి అంద కుండా పోతోంది. గతంలోనూ పెద్దగా ఉద్యో గాల భర్తీ లేనందున 2015లో తెలంగాణ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని పదేళ్లు పెంచింది.
దీంతో 2015 జూలై 1 నాటికి 44 ఏళ్లు ఉన్న వారికి కూడా అవకాశం వచ్చింది కానీ టీచర్ పోస్టుల భర్తీకి, గ్రూప్–1, గ్రూప్–3, గ్రూప్–4 వంటి నోటిఫికేషన్లు ఆ సంవత్సరంలో వెలువడలేదు. దీంతో జనరల్ అభ్యర్థులకు వయోపరిమితి పెంచినా ఆ ప్రయోజనం చేకూరలేదు. ఇక 2016 జూలైలో నూ ఆ పదేళ్ల వయోపరిమితిని మరో ఏడాది పొడిగిస్తూ జీవో 264ను జారీ చేసింది. కానీ గ్రూప్–2 మినహా సాధారణ డిగ్రీతో భర్తీ చేసే గ్రూప్–1,3,4 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ కాలేదు. అలాగే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో ఈ ఏడాదిలో నూ లక్షల మందికి వయో పరిమితి పెంపు ప్రయోజనం చేకూరని పరిస్థితి. టీచర్ పోస్టుల భర్తీకోసం ఎదురుచూస్తున్న వారిలో దాదాపు లక్ష మంది 43, 44 ఏళ్లు వయస్సు ఉన్న వారు ఉంటారని, గ్రూప్–1, గ్రూప్–3, గ్రూప్–4 కోసం ఎదురుచూస్తున్న వారిలోనూ అలాంటి వారు మరో లక్ష వరకు ఉంటారని అంచనా.
దీంతో వారందరికి గరిష్ట వయో పరిమితి పెంపు ప్రయోజనం చేకూరని పరిస్థితి నెలకొందని నిరుద్యోగులు వాపోతు న్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పందిం చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చే నెలాఖరు, లేదా ఫిబ్రవరిలో పాఠశాలల్లో టీచర్, గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో పదేళ్ల గరిష్ట వయోపరిమితి పెంపును మరో రెండేళ్లు కలిపి 12 ఏళ్లకు పెంచాలని, అప్పుడే నష్టపోయిన తమకు ప్రయోజనం చేకూరు తుందని కోరుతున్నారు.
సీఎం కేసీఆర్‌కు విజ్ఞాపనలు
ఈ పరిస్థితుల నేపథ్యంలో గరిష్ట వయో పరిమితి 12 ఏళ్లకు పెంచాలని, త్వరలో జారీ చేసే నోటిఫికేషన్లలో 46 ఏళ్ల వయసు వరకు అనుమతించాలని నిరుద్యోగులు కోరుతు న్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞాపనలు అందజేశారు. ప్రభుత్వం పదే ఏళ్లు గరిష్ట వయోపరిమితి పెంచినా, నోటిఫి కేషన్లు జారీ కాకపోవడంతో ఆ ప్రయో జనం చేకూరలేదని నిరుద్యోగులు చెబుతున్నారు.
కేలండర్ ఇయర్‌కే కటాఫ్
టీఎస్‌పీఎస్సీ వంటి ఉద్యోగ నియా మక ఏజెన్సీలు ఏ నోటిఫికేషన్‌ను కేలండర్ ఇయర్‌లో ఎప్పుడు జారీ చేసినా గరిష్ట వయోపరిమితిని ఆ సంవత్సరపు జూలై 1వ తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించి నోటిఫికే షన్లు ఇస్తాయి. అంటే ఒక కేలండర్ ఇయర్ లోని జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చినా, డిసెంబరులో నోటిఫికేషన్ ఇచ్చినా ఆ సంవ త్సరపు జూలై 1నే వయోపరిమితి కటాఫ్ తేదీగా పరిగణనలోకి తీసుకుంటారు. సద రు కేలండర్ ఇయర్‌లోని డిసెంబర్ దాటితే కనుక ఆ కటాఫ్ తేదీ మారిపోతుంది. దీంతో కటాఫ్ తేదీ ప్రకారం గరిష్ట వయోపరిమితి కలిగిన వారందరికీ అన్యాయం తప్పదు.