Group -2
-
తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం నవంబరు 2, 3 తేదీల్లో.. గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే.. వచ్చే ఏడాది జనవరి 6, 7వ తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. కమిషన్ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చ అనంతరం గ్రూప్-2 వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. చదవండి: బంజారాహిల్స్‌లో భారీగా హవాలా నగదు పట్టివేత -
గ్రూప్–2కు తొలగిన అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్ : గ్రూప్–2 రాత పరీక్షల్లో బబ్లింగ్, వైట్నర్ వాడకం వివాదంపై హైకోర్టు ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. రెండుసార్లు బబ్లింగ్‌కు పాల్పడిన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోరాదన్న సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది. బబ్లింగ్ జరిగింది వ్యక్తిగత వివరాల నమోదులో మాత్రమేనని, ప్రశ్నలకు అభ్యర్థులు ఎంచుకున్న జవాబులకు కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది. దీనివల్ల ప్రతిభపై ఎలాంటి ప్రభావం ఉండబోదని, కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్–బీఎం విజయకుమార్ల మధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇక్కడ వర్తించదని ధర్మాసనం ఉదహరించింది. ఇన్విజిలేటర్లకు సరైన అవగాహన లేకపోవడం వల్లే అభ్యర్థులు రెండుసార్లు బబ్లింగ్‌కు పాల్పడ్డారన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వాదనతో ఏకీభవించింది. వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు జరిగిన కారణంగానే వైట్నర్ వినియోగించాల్సి వచ్చిందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నియమించిన సాంకేతిక కమిటీ, సబ్ కమిటీల సిఫార్సుల మేరకు నియామక ప్రక్రియను కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ పి.కేశవరావులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. కమిటీ ఏర్పాటులో పక్షపాతం లేదు... టీఎస్పీఎస్సీ నియమించిన సాంకేతిక కమిటీలో టీఎస్పీఎస్సీ ప్రతినిధులు ఎవరూ లేకపోవడాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కమిటీలో ఓయూ, జేఎన్టీయూ, నేషనల్ బ్యాంకింగ్ సర్వీస్‌కు చెందిన వారున్నారని గుర్తించాలని పేర్కొంది. ఈ కమిటీ ఏర్పాటులో ఏమాత్రం పక్షపాతం కనబడలేదని తేల్చింది. కమిటీతో సమస్య జటిలమైంది... ‘ఇన్విజిలేర్ల పొరపాటు కూడా ఉంది. వ్యక్తిగత వివరాల నమోదులో బబ్లింగ్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. సాంకేతిక కమిటీ సిఫార్సులకు లోబడి టీఎస్పీఎస్సీ సబ్ కమిటీ వేసింది. సాంకేతిక కమిటీ సూచనల్ని అమలు చేయాలని సబ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ కారణంగా టీఎస్పీఎస్సీ తీసుకున్న నిర్ణయం సమర్ధనీయమే. అయితే సింగిల్ జడ్జి... సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా సాంకేతిక వ్యవహారాలపై ముగ్గురు సీనియర్ న్యాయవాదులతో కమిటీని ఏర్పాటు చేయడం తగదు. పైగా న్యాయవాదుల కమిటీ సమస్యను మరింత జటిలం చేసింది. సింగిల్ జడ్జి నియమించిన న్యాయవాదుల కమిటీ కారణంగా రోగికి ఉన్న జబ్బు కంటే చికిత్స దారుణంగా మారినట్లు అయింది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
వయోపరిమితి పెంచినా ఉపయోగమేదీ?
• రెండేళ్లుగా వయోపరిమితి పెంచుతున్నా.. నోటిఫికేషన్లు లేవు • గ్రూపు–2 మినహా సాధారణ డిగ్రీతో పోస్టులను భర్తీ చేయలేదు • అదనంగా మరో రెండేళ్లు వయోపరిమితి పెంచాలంటున్న నిరుద్యోగులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులకు వయో పరిమితి తంటాలు తప్పడం లేదు. తెలంగాణ ఏర్పడిన తరువాత సాధారణ డిగ్రీతో భర్తీ చేసే గ్రూప్–2 మినహా మరే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాలేదు.దాదాపు 5లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇంతవరకు మోక్షం లభించలేదు. ప్రస్తుతం డిసెంబరు నెలాఖరు వచ్చేసింది. అయినా నోటిఫికేషన్లు జారీ కాలేదు. దీంతో ప్రభుత్వం 2015 నుంచి పెంచుతూ వచ్చిన గరిష్ట వయో పరిమితి ప్రయోజనం లక్షల మందికి అంద కుండా పోతోంది. గతంలోనూ పెద్దగా ఉద్యో గాల భర్తీ లేనందున 2015లో తెలంగాణ ప్రభుత్వం గరిష్ట వయోపరిమితిని పదేళ్లు పెంచింది. దీంతో 2015 జూలై 1 నాటికి 44 ఏళ్లు ఉన్న వారికి కూడా అవకాశం వచ్చింది కానీ టీచర్ పోస్టుల భర్తీకి, గ్రూప్–1, గ్రూప్–3, గ్రూప్–4 వంటి నోటిఫికేషన్లు ఆ సంవత్సరంలో వెలువడలేదు. దీంతో జనరల్ అభ్యర్థులకు వయోపరిమితి పెంచినా ఆ ప్రయోజనం చేకూరలేదు. ఇక 2016 జూలైలో నూ ఆ పదేళ్ల వయోపరిమితిని మరో ఏడాది పొడిగిస్తూ జీవో 264ను జారీ చేసింది. కానీ గ్రూప్–2 మినహా సాధారణ డిగ్రీతో భర్తీ చేసే గ్రూప్–1,3,4 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ కాలేదు. అలాగే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో ఈ ఏడాదిలో నూ లక్షల మందికి వయో పరిమితి పెంపు ప్రయోజనం చేకూరని పరిస్థితి. టీచర్ పోస్టుల భర్తీకోసం ఎదురుచూస్తున్న వారిలో దాదాపు లక్ష మంది 43, 44 ఏళ్లు వయస్సు ఉన్న వారు ఉంటారని, గ్రూప్–1, గ్రూప్–3, గ్రూప్–4 కోసం ఎదురుచూస్తున్న వారిలోనూ అలాంటి వారు మరో లక్ష వరకు ఉంటారని అంచనా. దీంతో వారందరికి గరిష్ట వయో పరిమితి పెంపు ప్రయోజనం చేకూరని పరిస్థితి నెలకొందని నిరుద్యోగులు వాపోతు న్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పందిం చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చే నెలాఖరు, లేదా ఫిబ్రవరిలో పాఠశాలల్లో టీచర్, గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో పదేళ్ల గరిష్ట వయోపరిమితి పెంపును మరో రెండేళ్లు కలిపి 12 ఏళ్లకు పెంచాలని, అప్పుడే నష్టపోయిన తమకు ప్రయోజనం చేకూరు తుందని కోరుతున్నారు. సీఎం కేసీఆర్‌కు విజ్ఞాపనలు ఈ పరిస్థితుల నేపథ్యంలో గరిష్ట వయో పరిమితి 12 ఏళ్లకు పెంచాలని, త్వరలో జారీ చేసే నోటిఫికేషన్లలో 46 ఏళ్ల వయసు వరకు అనుమతించాలని నిరుద్యోగులు కోరుతు న్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞాపనలు అందజేశారు. ప్రభుత్వం పదే ఏళ్లు గరిష్ట వయోపరిమితి పెంచినా, నోటిఫి కేషన్లు జారీ కాకపోవడంతో ఆ ప్రయో జనం చేకూరలేదని నిరుద్యోగులు చెబుతున్నారు. కేలండర్ ఇయర్‌కే కటాఫ్ టీఎస్పీఎస్సీ వంటి ఉద్యోగ నియా మక ఏజెన్సీలు ఏ నోటిఫికేషన్‌ను కేలండర్ ఇయర్లో ఎప్పుడు జారీ చేసినా గరిష్ట వయోపరిమితిని ఆ సంవత్సరపు జూలై 1వ తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించి నోటిఫికే షన్లు ఇస్తాయి. అంటే ఒక కేలండర్ ఇయర్ లోని జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చినా, డిసెంబరులో నోటిఫికేషన్ ఇచ్చినా ఆ సంవ త్సరపు జూలై 1నే వయోపరిమితి కటాఫ్ తేదీగా పరిగణనలోకి తీసుకుంటారు. సద రు కేలండర్ ఇయర్‌లోని డిసెంబర్ దాటితే కనుక ఆ కటాఫ్ తేదీ మారిపోతుంది. దీంతో కటాఫ్ తేదీ ప్రకారం గరిష్ట వయోపరిమితి కలిగిన వారందరికీ అన్యాయం తప్పదు. -
15 వరకు గ్రూప్-2 దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ తేదీని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈనెల 15వ తేదీ వరకు పొడిగించింది. గత కొద్ది రోజులుగా ఏపీపీఎస్సీ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో గ్రూప్-2 ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రూప్-2కు ఏడు లక్షలకు పైగా దరఖాస్తులు రావచ్చని ఏపీపీఎస్సీ అంచనా వేయగా రెండు రోజుల క్రితం వరకు కేవలం 2.5 లక్షల దరఖాస్తులు మాత్రమే అప్లోడ్ అయ్యాయి. వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అప్లోడింగ్లో సమస్యలతోపాటు గ్రూప్-2 దరఖాస్తుల స్వీకరణలో కూడా ఇబ్బందులు తలెత్తాయి. నోటిఫికేషన్లు వెలువడుతున్న సమయంలో ఒక్కసారిగా ఓటీపీఆర్ల నమోదు పెరగడంతో ఏపీపీఎస్సీ సర్వర్‌పై లోడ్ పెరిగి సాంకేతిక సమస్యలు ఏర్పడ్డారుు. ఓటీపీఆర్ అప్లికేషన్లోనూ మార్పులు చేశారు. సమస్యలు కొంత తీరినా వెబ్సైట్ మాత్రం ఇంకా పూర్తిస్థారుులో అభ్యర్థులకు అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో గురువారం ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్, కార్యదర్శి వైవీఎస్టీ సారుు ఏపీ ఆన్లైన్ ప్రతినిధులతో మరోసారి సమీక్షించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు సమర్పణలో మరికొన్ని మార్పులు చేశారు. వెబ్సైట్ కొంతవరకు మెరుగుపడినా గ్రూప్-2 దరఖాస్తు గడువు ఈనెల 10వ తేదీతోనే ముగుస్తుండడంతో అభ్యర్థులంతా దరఖాస్తు చేయడానికి సమయం సరిపోదని భావించారు. గురువారం వరకు 4 లక్షల దరఖాస్తులు అప్లోడ్ అయ్యాయి. ఓటీపీఆర్ల సంఖ్య 6 లక్షలకు చేరుకుంది. కాగా గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగిస్తూ ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. నెగిటివ్ మార్కులు లేవు: ఉదయభాస్కర్ ఇలా ఉండగా ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఆబ్జెక్టివ్ తరహా పోటీ పరీక్షలకు నెగిటివ్ మార్కుల విధానానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అరుుతే ఇది రానున్న నోటిఫికేషన్లకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వెలువరించిన గ్రూప్-2కు గానీ, అంతకు ముందరి నోటిఫికేషన్లకు కానీ వర్తించదని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ ‘సాక్షి’కి వివరించారు. నెలాఖరులోగా గ్రూప్-3, గ్రూప్-1 నోటిఫికేషన్లు వెలువరిస్తామని, వీటిలోని ఆబ్జెక్టివ్ పరీక్షలకు నెగిటివ్ మార్కుల విధానం వర్తిస్తుందని స్పష్టం చేశారు. -
గ్రూప్-2 కటాఫ్ ఎంత?
టీఎస్పీఎస్సీ... తెలంగాణ రాష్ట్రంలో తొలి గ్రూప్-2 రాత పరీక్ష ముగిసింది. ఈనెల 11, 13 తేదీల్లో నాలుగు పేపర్లుగా టీఎస్పీఎస్సీ గ్రూప్-2 పరీక్ష నిర్వహించింది. మొత్తం 1032 పోస్టులకు జరిగిన పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య 4,98,944. అంటే.. ఒక్కో పోస్టుకు 483 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇప్పుడు వారందరి మదిలో మెదిలే ప్రశ్న.. కటాఫ్ ఎంత ఉండొచ్చు? అనేదే! గ్రూప్-2 నాలుగు పేపర్లల సరళి, కటాఫ్‌పై నిపుణుల విశ్లేషణ.. అన్వయ సామర్థ్యం: టీఎస్పీఎస్సీ గ్రూప్-2 నాలుగు పేపర్లలో అడిగిన ప్రశ్నలు అభ్యర్థి అవగాహన సామర్థ్యాన్ని అన్ని కోణాల్లో పరీక్షించేలా ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు. సిలబస్‌లో ఇచ్చిన అంశాలకు సంబంధించి ప్రతి పేపర్లో ప్రాథమిక భావనలు, అన్వయ సామర్థ్యం, సమకాలీన అంశాలతో బేరీజు వేసే నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు అడిగారు. స్టాండర్డ మెటీరియల్‌తో పాటు గత రెండేళ్లుగా దేశంలో, రాష్ట్రంలో సంభవించిన సమకాలీన పరిణామాలను అధ్యయనం చేసిన అభ్యర్థులు పరీక్షను బాగానే రాశారు. తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం: అన్ని పేపర్లలో తెలంగాణ ప్రాంత అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. పేపర్-1, పేపర్-2, పేపర్-3ల్లో తెలంగాణ ప్రాంత అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ.. దాదాపు 140 ప్రశ్నలు అడిగారు. పూర్తిగా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన పరిణామాల కోణంలో కొత్తగా పొందుపర్చిన పేపర్-4లో మొత్తం 150 ప్రశ్నలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవే. అయితే ఈ ప్రశ్నలు అడిగిన సరళిని పరిశీలిస్తే స్వాతంత్య్ర పూర్వం నాటి తెలంగాణ పరిస్థితుల నుంచి 2013లో కేంద్రం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వరకు.. ప్రశ్నలు వచ్చాయి. అభ్యర్థులకు తెలంగాణ ప్రాంతంపై ఉన్న అవగాహన స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది. పేపర్-1.. 95 నుంచి 120: పేపర్-1(జనరల్ స్టడీస్)ను విశ్లేషిస్తే సమకాలీన అంశాల్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవి అడిగారు. ప్రాణహిత-చేవెళ్ల పథకం పరిధిలోకి రాని జిల్లాలు? 2016 జూన్ 21న మరణించిన తెలంగాణ కవి గూడ అంజయ్యకు సంబంధం లేని పాట? లాంటి ప్రశ్నలను ఇందుకు ఉదాహరణగా పేర్కొనొచ్చు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మిగతా ప్రశ్నల్లో ముఖ్యమైన కట్టడాలు, వ్యక్తులు, కవులు, ఉద్యమాల గురించే అధిక ప్రశ్నలు కనిపించాయి. మిగిలిన విభాగాల విషయానికొస్తే.. సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతర్జాతీయ ఒప్పందాలు, క్రీడల్లో సమకాలీన అంశాలకే అత్యధిక ప్రాధాన్యం కనిపించింది. స్టాక్ జీకే ప్రశ్నలు తక్కువగా ఉన్నాయి. స్టాక్ జీకే పరంగా ప్రశ్నలు అడిగిన పరిస్థితిని విశ్లేషిస్తే.. అధిక శాతం ప్రశ్నలు ఉద్యమాలు, వ్యక్తులకు సంబంధించినవని చెప్పొచ్చు. దాదాపు 20కు పైగా ప్రశ్నలు రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి వచ్చాయి. మొత్తంగా ఈ పేపర్లో 95 నుంచి 120 ప్రశ్నల వరకు సమాధానం ఇచ్చే విధంగా ఉన్నాయి. పేపర్-2.. ఇలా: హిస్టరీ, పాలిటీ, సొసైటీ విభాగాలుగా పేర్కొన్న పేపర్-2లో ప్రశ్నలు అభ్యర్థుల్లో ఆయా అంశాల్లో లోతైన అవగాహనను పరీక్షించే విధంగా ఉన్నాయి. హిస్టరీకి సంబంధించి ముఖ్యమైన ఒప్పందాలు, తిరుగుబాట్లు, రాజవంశాలు-పరిపాలించిన కాలాలు, కళలు, సాహిత్యం, కట్టడాలకు (ఆలయాలు, శాసనాలు, స్థూపాలు) సంబంధించిన ప్రశ్నలు అడిగారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ వ్యక్తులు, సంస్థల గురించి కూడా ప్రశ్నలు వచ్చాయి. ఉదాహరణకు.. హైదరాబాద్‌లో ‘హ్యుమానిటేరియన్ లీగ్’ అనే సంస్థను స్థాపించిందెవరు? ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించినవారు? లాంటి ప్రశ్నలను పేర్కొనొచ్చు. అదేవిధంగా భారత చరిత్రకు సంబంధించి కూడా స్వాతంత్య్ర పోరాట కాలం నాటి సంఘటనలు, వ్యక్తులు, కమిషన్లకు సంబంధించి ప్రాధాన్యం స్పష్టమైంది. పాలిటీకి సంబంధించి అడిగిన ప్రశ్నలను పరిశీలిస్తే.. రాజ్యాంగం లక్షణాలు, అధికరణలు, ప్రకరణలు, సవరణలు-వాటికి అనుగుణంగా చేసిన చట్టాలపై అవగాహన ఉన్న వారు సులువుగా సమాధానం ఇచ్చేలా ఉన్నాయి. ప్రధానంగా అధికరణలు(ఆర్టికల్స్), సవరణలపై ప్రశ్నలు ఎక్కువగానే అడిగారు. సొసైటీ విభాగానికి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో సామాజిక పరిస్థితులు, గతంలో నెలకొన్న సమస్యల గురించి అధిక ప్రశ్నలు అడిగారు. ఉదాహరణకు.. దేవదాసి లేదా జోగినిగా మారే బాలిక వయస్సమూహం? తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న జిల్లా? ‘మా భూమి’ దేనితో సంబంధం కలిగి ఉంది? తెలంగాణలో ఫ్లోరోసిస్ ప్రబలంగా ఉన్న జిల్లా? గిరిజనులు ప్రకృతిని ఆరాధించే జాతర? లాంటి ప్రశ్నలను పేర్కొనొచ్చు. ఈ పేపర్లోనూ అభ్యర్థులు గరిష్టంగా 125 మార్కుల వరకు పొందే అవకాశం ఉంది. పేపర్-3.. కాన్సెప్ట్ + కాంటెంపరరీ: ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి పేరుతో నిర్వహించిన పేపర్-3 (ఎకానమీ)ని పరిశీలిస్తే.. ఆర్థిక శాస్త్రంపై ప్రాథమిక అవగాహన, సమకాలీన పథకాలు, సంక్షేమ ఫలాల గురించి తెలుసుకునేలా ప్రశ్నలున్నాయి. ఉదాహరణకు.. సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి ఏది? జాతీయ ఆహార భద్రత చట్టం 2013 కింద ఏ ప్రభుత్వ కార్యక్రమాలు/పథకాలు వర్తిస్తాయి? లాంటి ప్రశ్నలు. ఈ పేపర్లోనూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎక్కువగా సమకాలీన అంశాలకు ప్రాధాన్యం కనిపించింది. ఉదాహరణకు.. తెలంగాణలోని ఏ తాలూకాలో సాగునీటి కొరతను తీర్చడానికి జూరాల సాగునీటి పథకం (స్టేజ్-1)ను ఉద్దేశించారు? 2015-16 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన మొత్తం బడ్జెట్ వ్యయం ఎంత ఉంటుందని అంచనా వేసింది? తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి మొదటి ఫేజ్‌లో కింది వాటిలో భాగం కానిది? ముఖ్యంగా స్వాతంత్య్రం తర్వాత నుంచి భారత, తెలంగాణ ప్రాంత ఆర్థిక పరిస్థితులపై నైపుణ్యంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు కొంత సులువుగా సమాధానం ఇచ్చే విధంగా పేపర్-3 ఉందని చెప్పొచ్చు. ఈ పేపర్లో అభ్యర్థులు గరిష్టంగా 120 నుంచి 130 మార్కులు పొందే అవకాశముంది. పేపర్-4... కవులు, కళలు, సంస్కృతి, ఉద్యమాల కలయికగా..: దశాబ్దాలుగా ఉద్యమాలు సాగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఈ ప్రాంతంపై అభ్యర్థులకున్న అవగాహనను పరీక్షించేలా ప్రత్యేకంగా ప్రవేశపెట్టినది.. పేపర్-4 (తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావం). స్వాతంత్య్ర కాలం నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు ముఖ్యమైన ఘట్టాలు, వ్యక్తులు, ఉద్యమాలు, చట్టాలు, ఈ ప్రాంతంలోని ముఖ్యమైన ప్రదేశాలు, ఆయా ప్రాంతాల్లోని ప్రజలు మాట్లాడే భాష (మాండలికాలు)కు సంబంధించిన ప్రశ్నలే ఉన్నాయి. ఉదాహరణకు.. నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు? ప్రసిద్ధ నిర్మల్ బొమ్మలను కింద పేర్కొన్న ఏ రకం కర్రలతో చేస్తారు? రజాకార్లు అనే ఉర్దూ పదానికి అర్థం ఏంటి? 1978లో జగిత్యాలలో జరిగిన జైత్రయాత్ర ఎవరికి సంబంధించిన ప్రజా ప్రదర్శన? ఎవరి హయాంలో గద్వాల్ కోటను నిర్మించారు? తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన వివిధ కార్యక్రమాలను చారిత్రక, క్రమానుగతంగా గుర్తించండి? ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానించిన భారతీయ జనతా పార్టీ కాకినాడ సదస్సు ఎప్పుడు జరిగింది? రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉన్న 14-ఎఫ్ నిబంధనలో ఉన్న అంశం? 2011 మార్చిలో జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఎన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు? తొలి ధూం-ధాం కార్యక్రమం ఎక్కడ జరిగింది? తెలంగాణ విషయంలో శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికలో ఆరు పరిష్కారాలను సూచించింది. వీటిలో మొట్టమొదటిది ఏది? ఇలా.. ఈ పేపర్లో స్వాతంత్య్రం ముందు నుంచి రాష్ట్రం ఆవిర్భావం వరకు అన్ని ముఖ్యమైన ఘట్టాలను స్పృశించేలా ప్రశ్నపత్రం రూపకల్పన జరిగింది. ఈ పేపర్లో అభ్యర్థులు 110 నుంచి 130 మధ్యలో మార్కులు పొందే అవకాశం ఉంది. -
టీచర్ల భర్తీ మరికొన్నాళ్లు ఆలస్యం!
• విద్యాశాఖ టీచర్లే కాదు.. గురుకుల టీచర్ల భర్తీ ఆలస్యమే • గ్రూపు-2 తరువాత భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం • తేలని హేతుబద్ధీకరణ, టెట్ వెయిటేజీ.. • విద్యాశాఖలో 11 వేల వరకు ఖాళీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ మరికొన్నాళ్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. విద్యాశాఖ పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు 11 వేల టీచర్ పోస్టులే కాదు.. వివిధ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న, కొత్తగా సృష్టించిన దాదాపు 5 వేల టీచర్ల భర్తీకి కూడా మరికొంత సమయం పట్టనుంది. వాస్తవానికి గురుకుల టీచర్ల భర్తీకి జూలైలోనే నోటిఫికేషన్ వస్తుందని భావించినా అది జరగలేదు. పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు ఇంకా రావాల్సి ఉండటం, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) విషయంలో స్పష్టత రావాల్సి ఉండటం, మరోవైపు వచ్చే నెలలో గ్రూపు-2 నిర్వహణకు సంబంధించిన పనుల్లో టీఎస్పీఎస్సీ బిజీగా ఉన్న నేపథ్యంలో గురుకుల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు ఇంకొన్నాళ్లు సమయం పట్టనుంది. వీటికి సంబంధించి వచ్చే నెలాఖరుకు స్పష్టత వస్తే డిసెంబర్ నాటికి పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టే అవకాశం ఉంది. హేతుబద్ధీకరణ చిక్కు..: రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయమే తీసుకోలే దు. పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ తరువాతే వాస్తవ అవసరాల మేరకు భర్తీపై నిర్ణయం తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. అందుకే 9,500 పైగా ఖాళీల్లో విద్యా వలంటీర్లను నియమించి బోధన కొనసాగిస్తోంది. మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అధికారులంతా అదే పనుల్లో బిజీ అయ్యారు. దీంతో హేతుబ ద్ధీకరణపై పెద్దగా దృష్టిసారించలేని పరిస్థితి నెలకొంది. వీలైతే సంక్రాంతి నాటికి లేదా వేసవి సెలవుల్లో హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం ఉంది. సంక్రాంతి సెలవుల్లో కనుక హేతుబద్ధీకరణ పూర్తయితే అప్పుడే టీచర ్ల భర్తీకి చర్యలు చేపట్టే వీలుంది. లేదంటే వేసవి సెలవుల తరువాతే ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. గురుకులాల్లో ఇదీ పరిస్థితి.. : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డి గ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీపై గతంలోనే ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే అందులో అన్నింటికి సంబంధించిన అనుమతులు ఇంకా వెలువడలేదు. ఆరు నెలల కిందటే 2,444 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఓకే చెప్పింది. ఆ తరువాత మరో 1,794 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఆ తరువాత మరిన్ని పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటికి సంబంధించిన ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు సంబంధిత శాఖల నుంచి ఇండెంట్లు రావాల్సి ఉంది. అర్హత పరీక్షగానే టెట్?: ఇప్పటివరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష స్కోర్‌కు (టెట్) ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ ఉంది. కానీ ఇటీవల గురుకులాల్లో భర్తీ చేసే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల పరీక్ష విధానంలో టెట్ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో టీజీటీ పోస్టులకు టెట్ అవసరమా? లేదా? అన్న సందేహం నెలకొంది. అయితే టెట్‌ను కేవలం అర్హత పరీక్షగానే చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. టెట్ స్కోర్‌కు వెయిటేజీని తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. విద్యాశాఖ మాత్రం టెట్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే రాత పరీక్షకు అనుమతించాలని పేర్కొంటోంది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని, వెయిటేజీ ఇస్తారా? లేదా? అన్నది సంబంధిత యాజమాన్యాల ఇష్టమని, టెట్ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందేనని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో దీనిపై కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
త్వరలో గ్రూప్-2 నోటిఫికేషన్
టీఎస్పీఎస్సీ కమిషనర్ ఘంటా చక్రపాణి హసన్‌పర్తి: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని కమిషనర్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు గ్రూప్ పరీక్షలపై ‘సుమార్గ్’ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఇందులో భాగంగా హన్మకొండలోని ఎస్వీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో చక్రపాణి ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ర్ట వ్యాప్తంగా గ్రూప్-2కు సంబంధించి సుమారు 453కు పైగా ఖాళీలు ఉన్నాయని తెలిపారు. వీటి భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని, గ్రూప్-1 ఖాళీలు 53 మాత్రమే ఉన్నట్లు గుర్తించినప్పటికీ వాటి భర్తీ ప్రకటన కొంత ఆలస్యం కావచ్చన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల తర్వాత కేవలం ఏడు నెలల్లోనే నియామకాలు సైతం చేపడతామని చెప్పారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ద్వారా 4,200 ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసి, పరీక్షలు సైతం నిర్వహించామని, త్వరలో ఇంటర్వ్యూలు చేపడతామన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా రూపొం దించిన వెబ్సైట్ ద్వారా ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి తనకు కావాల్సిన పోస్ట్ ఎంపిక చేసుకోవచ్చన్నారు. పరీక్ష నిర్వహించిన కేవలం 24 గంటల్లోనే ‘కీ’ విడుదల చేశామని, అభ్యర్థి తాను రాసిన సమాధానాలు చూసుకునేలా మరో ఓఆర్‌ఎం షీట్ అందజేశామన్నారు. పది, ఇంటర్ పాసైన వారికి... పదో తరగతి, ఇంటర్మీడియెట్ పాసైన వారి కోసం టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని చక్రపాణి తెలిపారు. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వివరించారు. అలాగే, హెల్త్ అసిస్టెంట్ పోస్టులు కూడా త్వరలో భర్తీ చేయనున్నామని చెప్పారు. రానున్న ఐదేళ్లల్లో టీఎస్పీఎస్సీ ద్వారా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.