గ్రూప్-2 కటాఫ్ ఎంత?
గ్రూప్-2 కటాఫ్ ఎంత?
Published Sun, Nov 20 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM
టీఎస్‌పీఎస్‌సీ...
తెలంగాణ రాష్ట్రంలో తొలి గ్రూప్-2 రాత పరీక్ష ముగిసింది. ఈనెల 11, 13 తేదీల్లో నాలుగు పేపర్లుగా టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-2 పరీక్ష నిర్వహించింది. మొత్తం 1032 పోస్టులకు జరిగిన పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్య 4,98,944. అంటే.. ఒక్కో పోస్టుకు 483 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇప్పుడు వారందరి మదిలో మెదిలే ప్రశ్న.. కటాఫ్ ఎంత ఉండొచ్చు? అనేదే! గ్రూప్-2 నాలుగు పేపర్లల సరళి, కటాఫ్‌పై నిపుణుల విశ్లేషణ..
అన్వయ సామర్థ్యం: టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్-2 నాలుగు పేపర్లలో అడిగిన ప్రశ్నలు అభ్యర్థి అవగాహన సామర్థ్యాన్ని అన్ని కోణాల్లో పరీక్షించేలా ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు. సిలబస్‌లో ఇచ్చిన అంశాలకు సంబంధించి ప్రతి పేపర్‌లో ప్రాథమిక భావనలు, అన్వయ సామర్థ్యం, సమకాలీన అంశాలతో బేరీజు వేసే నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు అడిగారు. స్టాండర్‌డ మెటీరియల్‌తో పాటు గత రెండేళ్లుగా దేశంలో, రాష్ట్రంలో సంభవించిన సమకాలీన పరిణామాలను అధ్యయనం చేసిన అభ్యర్థులు పరీక్షను బాగానే రాశారు.
తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం: అన్ని పేపర్లలో తెలంగాణ ప్రాంత అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. పేపర్-1, పేపర్-2, పేపర్-3ల్లో తెలంగాణ ప్రాంత అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ.. దాదాపు 140 ప్రశ్నలు అడిగారు. పూర్తిగా తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం వరకు జరిగిన పరిణామాల కోణంలో కొత్తగా పొందుపర్చిన పేపర్-4లో మొత్తం 150 ప్రశ్నలు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినవే. అయితే ఈ ప్రశ్నలు అడిగిన సరళిని పరిశీలిస్తే స్వాతంత్య్ర పూర్వం నాటి తెలంగాణ పరిస్థితుల నుంచి 2013లో కేంద్రం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వరకు.. ప్రశ్నలు వచ్చాయి. అభ్యర్థులకు తెలంగాణ ప్రాంతంపై ఉన్న అవగాహన స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది.
పేపర్-1.. 95 నుంచి 120: పేపర్-1(జనరల్ స్టడీస్)ను విశ్లేషిస్తే సమకాలీన అంశాల్లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవి అడిగారు. ప్రాణహిత-చేవెళ్ల పథకం పరిధిలోకి రాని జిల్లాలు? 2016 జూన్ 21న మరణించిన తెలంగాణ కవి గూడ అంజయ్యకు సంబంధం లేని పాట? లాంటి ప్రశ్నలను ఇందుకు ఉదాహరణగా పేర్కొనొచ్చు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మిగతా ప్రశ్నల్లో ముఖ్యమైన కట్టడాలు, వ్యక్తులు, కవులు, ఉద్యమాల గురించే అధిక ప్రశ్నలు కనిపించాయి.
మిగిలిన విభాగాల విషయానికొస్తే.. సైన్స్ అండ్ టెక్నాలజీ, అంతర్జాతీయ ఒప్పందాలు, క్రీడల్లో సమకాలీన అంశాలకే అత్యధిక ప్రాధాన్యం కనిపించింది. స్టాక్ జీకే ప్రశ్నలు తక్కువగా ఉన్నాయి. స్టాక్ జీకే పరంగా ప్రశ్నలు అడిగిన పరిస్థితిని విశ్లేషిస్తే.. అధిక శాతం ప్రశ్నలు ఉద్యమాలు, వ్యక్తులకు సంబంధించినవని చెప్పొచ్చు. దాదాపు 20కు పైగా ప్రశ్నలు రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి వచ్చాయి. మొత్తంగా ఈ పేపర్‌లో 95 నుంచి 120 ప్రశ్నల వరకు సమాధానం ఇచ్చే విధంగా ఉన్నాయి.
పేపర్-2.. ఇలా: హిస్టరీ, పాలిటీ, సొసైటీ విభాగాలుగా పేర్కొన్న పేపర్-2లో ప్రశ్నలు అభ్యర్థుల్లో ఆయా అంశాల్లో లోతైన అవగాహనను పరీక్షించే విధంగా ఉన్నాయి. హిస్టరీకి సంబంధించి ముఖ్యమైన ఒప్పందాలు, తిరుగుబాట్లు, రాజవంశాలు-పరిపాలించిన కాలాలు, కళలు, సాహిత్యం, కట్టడాలకు (ఆలయాలు, శాసనాలు, స్థూపాలు) సంబంధించిన ప్రశ్నలు అడిగారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ వ్యక్తులు, సంస్థల గురించి కూడా ప్రశ్నలు వచ్చాయి.
ఉదాహరణకు.. హైదరాబాద్‌లో ‘హ్యుమానిటేరియన్ లీగ్’ అనే సంస్థను స్థాపించిందెవరు? ఆత్మగౌరవ ఉద్యమాన్ని ప్రారంభించినవారు? లాంటి ప్రశ్నలను పేర్కొనొచ్చు. అదేవిధంగా భారత చరిత్రకు సంబంధించి కూడా స్వాతంత్య్ర పోరాట కాలం నాటి సంఘటనలు, వ్యక్తులు, కమిషన్లకు సంబంధించి ప్రాధాన్యం స్పష్టమైంది. పాలిటీకి సంబంధించి అడిగిన ప్రశ్నలను పరిశీలిస్తే.. రాజ్యాంగం లక్షణాలు, అధికరణలు, ప్రకరణలు, సవరణలు-వాటికి అనుగుణంగా చేసిన చట్టాలపై అవగాహన ఉన్న వారు సులువుగా సమాధానం ఇచ్చేలా ఉన్నాయి.
ప్రధానంగా అధికరణలు(ఆర్టికల్స్), సవరణలపై ప్రశ్నలు ఎక్కువగానే అడిగారు. సొసైటీ విభాగానికి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో సామాజిక పరిస్థితులు, గతంలో నెలకొన్న సమస్యల గురించి అధిక ప్రశ్నలు అడిగారు. ఉదాహరణకు.. దేవదాసి లేదా జోగినిగా మారే బాలిక వయస్సమూహం? తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల జనాభా అధికంగా ఉన్న జిల్లా? ‘మా భూమి’ దేనితో సంబంధం కలిగి ఉంది? తెలంగాణలో ఫ్లోరోసిస్ ప్రబలంగా ఉన్న జిల్లా? గిరిజనులు ప్రకృతిని ఆరాధించే జాతర? లాంటి ప్రశ్నలను పేర్కొనొచ్చు.
ఈ పేపర్‌లోనూ అభ్యర్థులు గరిష్టంగా 125 మార్కుల వరకు పొందే అవకాశం ఉంది.
పేపర్-3.. కాన్సెప్ట్ + కాంటెంపరరీ: ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి పేరుతో నిర్వహించిన పేపర్-3 (ఎకానమీ)ని పరిశీలిస్తే.. ఆర్థిక శాస్త్రంపై ప్రాథమిక అవగాహన, సమకాలీన పథకాలు, సంక్షేమ ఫలాల గురించి తెలుసుకునేలా ప్రశ్నలున్నాయి. ఉదాహరణకు.. సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి ఏది? జాతీయ ఆహార భద్రత చట్టం 2013 కింద ఏ ప్రభుత్వ కార్యక్రమాలు/పథకాలు వర్తిస్తాయి? లాంటి ప్రశ్నలు. ఈ పేపర్‌లోనూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎక్కువగా సమకాలీన అంశాలకు ప్రాధాన్యం కనిపించింది. ఉదాహరణకు..
తెలంగాణలోని ఏ తాలూకాలో సాగునీటి కొరతను తీర్చడానికి జూరాల సాగునీటి పథకం (స్టేజ్-1)ను ఉద్దేశించారు? 2015-16 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన మొత్తం బడ్జెట్ వ్యయం ఎంత ఉంటుందని అంచనా వేసింది? తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి మొదటి ఫేజ్‌లో కింది వాటిలో భాగం కానిది? ముఖ్యంగా స్వాతంత్య్రం తర్వాత నుంచి భారత, తెలంగాణ ప్రాంత ఆర్థిక పరిస్థితులపై నైపుణ్యంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు కొంత సులువుగా సమాధానం ఇచ్చే విధంగా పేపర్-3 ఉందని చెప్పొచ్చు. ఈ పేపర్‌లో అభ్యర్థులు గరిష్టంగా 120 నుంచి 130 మార్కులు పొందే అవకాశముంది.
పేపర్-4... కవులు, కళలు, సంస్కృతి, ఉద్యమాల కలయికగా..: దశాబ్దాలుగా ఉద్యమాలు సాగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఈ ప్రాంతంపై అభ్యర్థులకున్న అవగాహనను పరీక్షించేలా ప్రత్యేకంగా ప్రవేశపెట్టినది.. పేపర్-4 (తెలంగాణ ఉద్యమం-రాష్ట్ర ఆవిర్భావం). స్వాతంత్య్ర కాలం నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు ముఖ్యమైన ఘట్టాలు, వ్యక్తులు, ఉద్యమాలు, చట్టాలు, ఈ ప్రాంతంలోని ముఖ్యమైన ప్రదేశాలు, ఆయా ప్రాంతాల్లోని ప్రజలు మాట్లాడే భాష (మాండలికాలు)కు సంబంధించిన ప్రశ్నలే ఉన్నాయి.
ఉదాహరణకు.. నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు? ప్రసిద్ధ నిర్మల్ బొమ్మలను కింద పేర్కొన్న ఏ రకం కర్రలతో చేస్తారు? రజాకార్లు అనే ఉర్దూ పదానికి అర్థం ఏంటి? 1978లో జగిత్యాలలో జరిగిన జైత్రయాత్ర ఎవరికి సంబంధించిన ప్రజా ప్రదర్శన? ఎవరి హయాంలో గద్వాల్ కోటను నిర్మించారు? తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన వివిధ కార్యక్రమాలను చారిత్రక, క్రమానుగతంగా గుర్తించండి? ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానించిన భారతీయ జనతా పార్టీ కాకినాడ సదస్సు ఎప్పుడు జరిగింది? రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉన్న 14-ఎఫ్ నిబంధనలో ఉన్న అంశం?
2011 మార్చిలో జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఎన్ని విగ్రహాలను ధ్వంసం చేశారు? తొలి ధూం-ధాం కార్యక్రమం ఎక్కడ జరిగింది? తెలంగాణ విషయంలో శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికలో ఆరు పరిష్కారాలను సూచించింది. వీటిలో మొట్టమొదటిది ఏది? ఇలా.. ఈ పేపర్‌లో స్వాతంత్య్రం ముందు నుంచి రాష్ట్రం ఆవిర్భావం వరకు అన్ని ముఖ్యమైన ఘట్టాలను స్పృశించేలా ప్రశ్నపత్రం రూపకల్పన జరిగింది. ఈ పేపర్‌లో అభ్యర్థులు 110 నుంచి 130 మధ్యలో మార్కులు పొందే అవకాశం ఉంది.
Advertisement
Advertisement