టీచర్ల భర్తీ మరికొన్నాళ్లు ఆలస్యం!
• విద్యాశాఖ టీచర్లే కాదు.. గురుకుల టీచర్ల భర్తీ ఆలస్యమే
• గ్రూపు-2 తరువాత భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం
• తేలని హేతుబద్ధీకరణ, టెట్ వెయిటేజీ..
• విద్యాశాఖలో 11 వేల వరకు ఖాళీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ మరికొన్నాళ్లు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. విద్యాశాఖ పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న దాదాపు 11 వేల టీచర్ పోస్టులే కాదు.. వివిధ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న, కొత్తగా సృష్టించిన దాదాపు 5 వేల టీచర్ల భర్తీకి కూడా మరికొంత సమయం పట్టనుంది. వాస్తవానికి గురుకుల టీచర్ల భర్తీకి జూలైలోనే నోటిఫికేషన్ వస్తుందని భావించినా అది జరగలేదు.
పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని అనుమతులు ఇంకా రావాల్సి ఉండటం, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) విషయంలో స్పష్టత రావాల్సి ఉండటం, మరోవైపు వచ్చే నెలలో గ్రూపు-2 నిర్వహణకు సంబంధించిన పనుల్లో టీఎస్‌పీఎస్సీ బిజీగా ఉన్న నేపథ్యంలో గురుకుల టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియకు ఇంకొన్నాళ్లు సమయం పట్టనుంది. వీటికి సంబంధించి వచ్చే నెలాఖరుకు స్పష్టత వస్తే డిసెంబర్ నాటికి పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
హేతుబద్ధీకరణ చిక్కు..: రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయమే తీసుకోలే దు. పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణ తరువాతే వాస్తవ అవసరాల మేరకు భర్తీపై నిర్ణయం తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. అందుకే 9,500 పైగా ఖాళీల్లో విద్యా వలంటీర్లను నియమించి బోధన కొనసాగిస్తోంది.
మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అధికారులంతా అదే పనుల్లో బిజీ అయ్యారు. దీంతో హేతుబ ద్ధీకరణపై పెద్దగా దృష్టిసారించలేని పరిస్థితి నెలకొంది. వీలైతే సంక్రాంతి నాటికి లేదా వేసవి సెలవుల్లో హేతుబద్ధీకరణ చేపట్టే అవకాశం ఉంది. సంక్రాంతి సెలవుల్లో కనుక హేతుబద్ధీకరణ పూర్తయితే అప్పుడే టీచర ్ల భర్తీకి చర్యలు చేపట్టే వీలుంది. లేదంటే వేసవి సెలవుల తరువాతే ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల భర్తీకి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
గురుకులాల్లో ఇదీ పరిస్థితి.. : రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలు, జూనియర్, డి గ్రీ కాలేజీల్లో పోస్టుల భర్తీపై గతంలోనే ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే అందులో అన్నింటికి సంబంధించిన అనుమతులు ఇంకా వెలువడలేదు. ఆరు నెలల కిందటే 2,444 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఓకే చెప్పింది. ఆ తరువాత మరో 1,794 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఆ తరువాత మరిన్ని పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వాటికి సంబంధించిన ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు సంబంధిత శాఖల నుంచి ఇండెంట్లు రావాల్సి ఉంది.
అర్హత పరీక్షగానే టెట్?: ఇప్పటివరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష స్కోర్‌కు (టెట్) ఉపాధ్యాయ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ ఉంది. కానీ ఇటీవల గురుకులాల్లో భర్తీ చేసే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల పరీక్ష విధానంలో టెట్ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో టీజీటీ పోస్టులకు టెట్ అవసరమా? లేదా? అన్న సందేహం నెలకొంది. అయితే టెట్‌ను కేవలం అర్హత పరీక్షగానే చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. టెట్ స్కోర్‌కు వెయిటేజీని తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
విద్యాశాఖ మాత్రం టెట్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే రాత పరీక్షకు అనుమతించాలని పేర్కొంటోంది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని, వెయిటేజీ ఇస్తారా? లేదా? అన్నది సంబంధిత యాజమాన్యాల ఇష్టమని, టెట్ మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందేనని పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో దీనిపై కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.