భలే ఆప్స్ | New apps download | Sakshi
Sakshi News home page

భలే ఆప్స్

Published Wed, Aug 27 2014 11:23 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

New apps download

చేయి తడితే క్లిక్ క్లిక్ క్లిక్!
 
ఈ రోజుల్లో సెల్ఫీలదే హవా. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే సెల్ఫీలే సెల్ఫీలు. కానీ గ్రూప్ ఫోటో తీసుకోవాలంటే? అందంగా పోజిచ్చిన తరువాత క్లిక్ మనిపించాలంటే? ఇంకొకరి సాయం కావాలా? ఊహూ అవసరం లేదంటోంది స్నాప్ క్లాప్ అప్లికేషన్. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌లో ఉచితంగా లభించే ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే మీ కెమెరాతో ఎన్నో ట్రిక్కులు చేయవచ్చు. మీరు చేయాల్సిందల్లా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టడమే. సెల్ఫీల్లా ఫ్రంట్ కెమెరాతో మాత్రమే కాకుండా ఎక్కువ రెజల్యూషన్ ఉండే ప్రధాన కెమెరాతోనూ ఫొటోలు తీసుకోవచ్చు. ఫొటోకు అవసరమైన లైటింగ్ సరిగా లేకపోతే ఈ అప్లికేషన్ వార్నింగ్ కూడా ఇస్తుంది. ఫొటోల ఎడిటింగ్, మిత్రులతో షేరింగ్ వంటివి అదనపు ఫీచర్లు!
 
ఇన్‌స్టాబ్రిడ్జ్‌తో ఫ్రీ వైఫై


వీధి వెంబడి వెళుతూంటే ‘‘వైఫై నెట్‌వర్క్ అవైలబుల్’ అన్న నోటిఫికేషన్లు తరచూ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతూంటాయి. ఈ నెట్‌వర్క్‌లలో కొన్ని ఉచితంగానూ లభించవచ్చు. కానీ ఆ నెట్‌వర్క్‌లేవో తెలియకపోవడం వల్ల మనం వాటిని ఉపయోగించుకోలేము. ఇన్‌స్టా బ్రిడ్జ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే ఈ కొరత తీరిపోతుంది. ఉచిత వైఫై హాట్‌స్పాట్‌లను గుర్తించడంతోపాటు ఆయా నెట్‌వర్క్‌ల స్పీడ్‌ను లెక్కకట్టేందుకు, డేటా యూసేజ్‌ను తెలుసుకునేందుకు కూడా ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. అంతే కాకుండా పాస్‌వర్డ్ పంచుకోకుండానే వైఫై నెట్‌వర్క్‌ను ఇతరులతో షేర్ చేసుకునేందుకు దీంట్లో ఏర్పాట్లు ఉన్నాయి. అన్ని కనెక్షన్లకూ క్లౌడ్ బ్యాకప్ ఉండటం మరో విశేషం. ఉచిత వైఫై హాట్‌స్పాట్‌లలో సక్రమంగా పనిచేయని వాటిని గుర్తించి ఎప్పటికప్పుడు వాటిని వదిలించుకోవచ్చు కూడా.
 
బుడతల ఐడియాలకు రూపమిచ్చే ‘మై ఇండియా’

దేశంలోని అనేక సమస్యలపై పిల్లల్లోనూ అవగాహన పెంపొందించేందుకు, వాటిపై తమతమ ఆలోచనలను ఇతరులతో పంచుకునేందుకు బోధ్‌గురు అనే సంస్థ వినూత్నమైన మొబైల్ అప్లికేషన్లను విడుదల చేసింది. భారత 68వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ అప్లికేషన్లతో చిన్నారులు తమ ఆలోచనలను ఆడియో, వీడియోలతో ఒక పుస్తక రూపంలోకి తీసుకురావచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన మైగవ్ వెబ్‌సైట్ స్ఫూర్తితో తాము ఈ అప్లికేషన్లను అభివృద్ధి చేశామని నాలుగేళ్లు మొదలుకొని 18 ఏళ్ల యువకుల వరకూ ఎవరైనా ఈ అప్లికేషన్‌ను ఉపయోగించవచ్చునని కంపెనీ తెలిపింది. పారిశుద్ధ్యంతోపాటు, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ ఇండియా వంటి అంశాలపై పిల్లలు చిన్న చిన్న కథలు, ఐడియా బుక్‌ల రూపంలో తమ ఆలోచనలను పొందుపరచవచ్చు. ఈ డిజిటల్ ఐడియా బుక్‌ల రూపకల్పనకు కావాల్సిన అంశాలన్నింటినీ అప్లికేషన్‌లో పొందుపరిచామని కంపెనీ డెరైక్టర్ సమీర్ జైన్ తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement