కంప్యూటర్‌లోనూ స్మార్ట్ ఫోన్ నోటిఫికేషన్లు
న్యూయార్క్: స్మార్ట్ ఫోన్లకు వచ్చే ప్రతి నోటిఫికేషన్ ఇక నుంచి డెస్క్ టాప్‌ల పైకి రానుంది. అది ఎలా అనుకుంటున్నారా! సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాప్ట్ ఈ సేవలను విండోస్ 10 డెస్క్ టాప్ మీద అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. డెస్క్‌టాప్ మీద పనిచేస్తున్నప్పుడు స్మార్ట్ ఫోన్లకు వచ్చే ఏ నోటిఫికేషన్ అయినా దానిమీద కనిపించేలా రూపొందిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ను జేబులోంచి బయటకు తీయకుండానే కంప్యూటర్ డెస్క్‌టాప్ మీద నోటిఫికేషన్ లను చూసి, తొలగించేయడం దీని ప్రత్యేకత అని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
దీనివల్ల డెస్క్‌టాప్ మీద పనిచేసే వారికి, పదేపదే స్మార్ట్ ఫోన్లకు వచ్చే నోటిఫికేషన్ చిక్కులు తొలుగుతాయని శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన రెండురోజుల 'బిల్డ్ కాన్ఫరెన్స్'లో మెక్రోసాప్ట్ చెప్పింది. మొదట మైక్రోసాప్ట్ కార్టనా యాప్ ద్వారా ఈ సర్వీసులను అందించి, తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్‌కు అనుసంధానించనున్నారు. కానీ ఈ సేవలు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయన్న విషయాన్ని మైక్రోసాప్ట్ ప్రకటించలేదు. విండోస్ 10 ఏడాది పండగ సందర్భంగా ఈ సేవలు మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తాయని సమాచారం. ఐఫోన్ ను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాప్ట్ ఈ ఫీచర్స్ ను రూపొందిస్తోంది.