
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం
మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుందనే సమాచారంతో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికార పార్టీ నేతల ధన దాహం పెరిగిపోయింది. రూ.50 లక్షలు దాటిన చెల్లింపులు కౌన్సిల్ సాధారణ సమావేశంలో పెట్టడం ఇష్టం లేక బిల్లులను విభజించి స్టాండింగ్ కమిటీలో ఉంచి ఆమోదింపజేసుకున్నారు. కాంట్రాక్టర్లు కూడబలుక్కుని రూ.కోట్ల విలువ చేసే పనులను నిర్ణీత ధరల కంటే 4.97 శాతం అధిక మొత్తానికి దక్కించుకున్నారు. రూ.1.57 కోట్ల విలువైన పనులకు సింగిల్ దరఖాస్తుతో టెండర్లు చేజిక్కించుకున్నారు.
చిత్తూరు అర్బన్: ప్రభుత్వం మారిపోతే ఏమీ చేయలేమని, ఉన్నదంతా ఉన్నఫళంగా ఊడ్చేయాలన్నట్లుంది చిత్తూరు అధికార పార్టీ నేతల తీరు. చిత్తూరు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ అజెండా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సమావేశం మేయర్ హేమలత అధ్యక్షతన శుక్రవారం ఉదయం నిర్వహించారు. కమిటీలో మేయర్ కాకుండా ఐదుగురు కార్పొరేటర్లు సభ్యులుగా ఉన్నప్పటికీ శ్రీకాంత్, నవీన్ అనే వ్యక్తులు ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వీరు సమావేశానికి గైర్హాజరయ్యారు. మిగిలిన ముగ్గురిలో నళిని, లోకనాథం ప్రేక్షకపాత్ర వహించగా గుణశేఖర్‌నాయుడు కీలకంగా వ్యవహరించారు. మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, డెప్యూటీ మేయర్ సుబ్రమణ్యం తదితరులు సమావేశంలో పాల్గొని కమిటీ ఆమోదించిన వాటిని పుస్తకాల్లో రాసుకున్నారు.
వీటికి ఆమోదం..
♦ నగరంలో అద్దెనీటి ట్యాంకర్లకు గతేడాది జూలై నుంచి డిసెంబరు వరకు రూ.80 లక్షల బకాయిలున్నాయి. వీటిని కరవు నిధుల్లోంచి చెల్లించాలి. కానీ కరువు నిధులు వచ్చేలోపు ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలి యదు. అందుకే మున్సిపల్ సాధారణ పద్దుల నుంచి ఈ మొత్తాన్ని చెల్లించేలా ప్రణాళిక వేశారు. రూ.80 లక్షలు ఒక్కసారిగా చెల్లించా లంటే కౌన్సిల్ సమావేశంలో ఉంచాలి. ఇప్పటికిప్పుడు అంత సమయం లేదు. స్టాండింగ్ కమిటీకి రూ.50 లక్షల్లోపు బిల్లులను ఆమోదించే అవకాశం ఉండటంతో ఈ మొత్తాన్ని రూ.44.29 లక్షలుగా, రూ.34.94 లక్షలుగా విభజించి కాంట్రాక్టర్లు మునిరత్నంనాయుడు, రాజశేఖర్‌నాయుడుకు సాధారణ పద్దుల నుంచి చెల్లించేలా ఆమోదింపజేసుకున్నారు.
♦ మేయర్‌కు చెందిన 33వ డివిజన్‌లోని గంగనపల్లెలో శ్మశాన వాటిక అభివృద్ధి, ప్రహరీగోడ, అంతర్గత రోడ్ల నిర్మాణానికి 4.97 శాతం అధిక ధరతో రూ.34.97 లక్షలకు టెండర్, సబ్ ప్లాన్ నిధుల నుంచి బాలంబట్టు హరిజనవాడలో మురుగునీటి కాలువను నిర్మించడానికి 4.97 శాతం అధిక ధరతో రూ.35.21 లక్షలతో వేసిన టెండర్లను మునిరత్నంనాయుడు అనే వ్యక్తికి అప్పగిస్తూ తీర్మానించారు.
♦ కరువు నిధుల నుంచి నగరంలో నీటి బోర్ల డీపినింగ్, ఫ్లషింగ్ (అదనపు పైపులు వేయడం) కోసం 4.97 శాతం అధిక ధరతో రూ.17.79 లక్షల టెండర్ రాజశేఖర్‌నాయుడుకు కేటాయిస్తూ ఆమోదించారు.
♦ నీటి బోర్లకు మోటార్లు బిగించడం కోసం 4.97 శాతం అధిక ధరతో దాఖలు చేసిన రెండు టెండర్లను (రూ.37.80 లక్షలు) మనిదీప్ ట్రేడర్స్‌కు అప్పగించారు.
♦ గత రెండేళ్లలో రూ.84 లక్షలు, రూ.90 లక్షలు పలికిన చిత్తూరు కూరగాయల మార్కెట్‌లో గేటు వసూళ్ల టెండరును ఈ సారి వేలం పాటలో రూ.47 లక్షలకే వేలం దక్కించుకున్న లోకనాథనాయుడు అనే వ్యక్తికి
గుత్తాధిపత్యం అప్పగిస్తూ తీర్మానం.
∙నగరంలోని 11 ప్రాంతాల్లో రూ.44.22 లక్షల విలువ చేసే పనులకు ఎలాంటి టెండర్లూ లేకుండా నామినేటెడ్ పద్ధతిలో వార్డ్ లెవల్ కమిటీల పేరిట టీడీపీ కార్యకర్తలకు అప్పగిస్తూ కమిటీ ఆమోదం తెలిపింది. వీటి అంచనాలను రూ.5 లక్షల్లోపు కుదించి తెలివిగా నామినేటెడ్‌లో చూపించారు.
∙తిమ్మసముద్రం, సీజీ పల్లె, ప్రశాంత్‌నగర్, పోతంబట్టు, గంగనపల్లె ప్రాంతాల్లో నీటి నిల్వ చేసే ఓవర్‌హెడ్ ట్యాంకర్ల నిర్మాణానికి 4.95 శాతం ఎక్కువ ధరకు సింగిల్ టెండరు దాఖలు చేసిన మునేశ్వర కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.1.57 కోట్ల విలువైన పనులు అప్పగిస్తూ తీర్మానం చేశారు.