సిటీ కమిషనరేట్‌లో ఎలక్షన్ సెల్
సాక్షి, సిటీబ్యూరో: సాధారణ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే ఇన్‌స్పెక్టర్ స్థాయి వరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేసిన నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ మరో కీలక చర్య తీసుకున్నారు. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ల విడుదలకు ముందే భవిష్యత్తులో ఎలాంటి అవాంతరాలకు ఆస్కారం లేకుండా కమిషనరేట్ పరిధిలో ఎలక్షన్ సెల్ ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల నుంచే పని ప్రారంభించిన ఈ విభాగానికి అదనపు పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) అంజనీకుమార్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) సంయుక్త పోలీసు కమిషనర్ బి.మల్లారెడ్డి సైతం కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ సెల్‌లో శాంతిభద్రతల విభాగం, ఎస్బీ సిబ్బందితో పాటు మినిస్టీరియల్ స్టాఫ్‌ను ఏర్పాటు చేశారు.
షెడ్యూల్‌కు ముందు సంప్రదింపుల బాధ్యత...
రాజధానిలో ఉన్న హైదరాబాద్ కమిషనరేట్‌ను ఎన్నికల కోణంలో అత్యంత కీలకమైంది. మరో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి ముందు రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాలు అనేక అంశాలపై నగర పోలీసుల నుంచి నివేదికలు కోరుతుంది. కొన్ని సందర్భాల్లో పోలీసులే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి కొన్ని వివరణలు తీసుకుంటారు. ఇటీవల ఇన్‌స్పెక్టర్ల బదిలీల అంశంలో అదే జరిగింది. షెడ్యూల్ విడుదలయ్యే వరకు ఎలక్షన్ సెల్ ఈ విధులను నిర్వర్తిస్తుంది. వివరాల సేకరణ, నివేదికల తయారీ సంప్రదింపులు ఇవన్నీ ఎలక్షన్ సెల్ సారథ్యంలోనే జరుగుతున్నాయి.
షెడ్యూల్ తర్వాతా కీలకభూమిక...
ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యాక కూడా ఎలక్షన్ సెల్ ఆ ఘట్టాన్ని ప్రశాంతంగా, వివాదరహితంగా పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నగరంలోని పరిస్థితులు ఎప్పటికప్పుడు బేరీజు వేయడానికి, సందర్భానుసారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి, అన్ని వేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండటానికి దీన్ని వినియోగించనున్నారు. కోడ్ అమలులో ఉన్నన్నాళ్లూ ప్రతి రోజూ ఓ డీఎస్‌ఆర్ (డెరుులీ సిట్యువేషన్ రిపోర్ట్) తయూరు చేసి కమిషనర్‌కు, అవసరమైతే ఎన్నికల సంఘానికి ఈ సెల్ పంపుతుంది. ఈ నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులు, జోనల్ ఇన్‌చార్జిలతో అదనపు సీపీ అంజనీకుమార్ మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఈ విభాగం కొనసాగుతుంది.
తనిఖీల కోసం ప్రణాళికలు...
ఎన్నికల సందర్భంగా అసాంఘిక శక్తులు రెచ్చిపోకుండా, నగదు, మద్యం అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు నగర వ్యాప్తంగా నాకాబందీలు, సోదాలు విస్తృతంగా చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనికోసం డీసీపీలతో పాటు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్‌ల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా నగరంలోకి దారితీసే మార్గాలతో పాటు శివార్లపై వీరు దృష్టి పెట్టనున్నారు.
బందోబస్తు వ్యూహాల ఖరారు...
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బందోబస్తుకు అవసరమైన అన్ని చర్యలను ఈ విభాగం ద్వారానే నిర్వర్తిస్తారు. నగరంలోని ఐదు జోన్లలో సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, ఎన్నికల విధుల నిర్వహణ, అవసరమై బలగాల కేటాయింపు, వారికి అవసరమైన వనరులు, సౌకర్యాలు ఏర్పాటు చేయడం వంటి విధులు కూడా ఎన్నికల సెల్ నిర్వహిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో ఎన్నికల విధుల పనుల పర్యవేక్షణ, రాష్ట్ర, కేంద్ర పోలీసు విభాగాలతో సమన్వయం కోసం ఈ సెల్ పని చేస్తుంది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ సెల్‌కు ప్రత్యేకంగా ఫోన్ నెంబర్లు కేటాయించాలని భావిస్తున్నారు.