సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇకమీదట జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ)ను విధిగా రిజిస్టర్ చేయాల్సి ఉంది. దాదాపు శతాబ్దం కిందటి రిజిస్ట్రేషన్ చట్టానికి కేంద్రం సవరణ తీసుకు రావడంతో జీపీఏలతో సాగించే అక్రమాలకు తెర పడనుంది. ఒకే భూమి లేదా ఇంటి స్థలాన్ని నలుగురైదుగురికి జీపీఏలు ఇవ్వడం ద్వారా మోసం చేయడానికి ఇక ముందు అసాధ్యం. జీపీఏ ఒకసారి రిజిస్టరైతే ఆ వివరాలు సత్వరమే తెలిసిపోతుంది. కనుక వేరే వ్యక్తికి మళ్లీ జీపీఏ ఇవ్వడం సాధ్యం కాదు.
దరిమిలా జనాన్ని మోసం చేయడం బాగా తగ్గుతుంది. కేంద్రం 1908 రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణ తీసుకు రావడానికి ముందు రాష్ట్రం అభిప్రాయాన్ని కూడా కోరింది. సవరణకు రాష్ర్ట ప్రభుత్వం కూడా సమ్మతించింది. దరిమిలా జీపీఏ మాత్రమే కాకుండా విల్, విక్రయ పత్రాలు, ఇంటి బాడుగ, లీజు ఒప్పందాలను రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇకమీదట రిజిస్టర్ చేయని జీపీఏలు చట్టబద్ధం కాబోవు. న్యాయ స్థానాల్లో వాటికి గుర్తింపు లభించదు. భూ వివాదాల సమయంలో రిజిస్టర్ చేయని జీపీఏలను కోర్టులు ఏమాత్రం పట్టించుకోబోవు.
భూ లావాదేవీలు, స్థిరాస్తుల లీజులు లాంటి వ్యవహారాలలో పారదర్శకతకు జీపీఏను రిజిస్టర్ చేయడం అనివార్యమని అధికారులు తెలిపారు. కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జీపీఏలు లేదా అగ్రిమెంట్లను దాఖలు చేసిన సమయంలో విధిగా ఫొటోలను సైతం అంటించాల్సి ఉంటుంది. కార్యాలయాల్లో కూడా డిజిటల్ కెమెరాలతో ఫొటోలు తీస్తారు.
కాగా స్థిరాస్తులు ఏ రాష్ట్రంలో ఉంటే రిజిస్ట్రేషన్లను కూడా ఆ రాష్ట్రాల్లోనే చేయించాల్సి ఉంటుంది. బ్రిటిష్ పాలనలో ఏ రాష్ర్టంలోని స్థిరాస్తినైనా చెన్నై, ముంబాయి, కోల్‌కతా, ఢిల్లీల్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే సదుపాయం ఉండేది. బెంగళూరులో గతంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను కొద్ది కాలం పాటు నిషేధించిన సమయాల్లో చెన్నైకి వెళ్లి చేయించుకునే వారు. ఇకమీదట ఆ సౌలభ్యం ఉండదు.
రియల్ చెక్
Published Sun, Sep 1 2013 3:13 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM
Advertisement
Advertisement