న్యూఢిల్లీ: పెట్టుబడి సలహాలిచ్చే ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు, పరిశోధనా అనలిస్టులకు సంబంధించి పారదర్శకత పెంచే దిశగా సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. తమ ప్రకటనల్లో సెబీ రిజిస్ట్రేషన్ నంబర్, పూర్తి పేరు, లోగో, పూర్తి చిరునామా, టెలిఫోన్ నంబర్లను వెల్లడించాలని పేర్కొంది. సెబీ ఇచ్చిన రిజిస్ట్రేషన్ కానీ, బీఎస్‌ఈ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్‌విజన్ సభ్యత్వం కానీ, రాబడులు, పనితీరుకు భరోసాగా, హామీగా చూడొద్దంటూ విధిగా ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుందని సెబీ ఆదేశించింది.
వారు ప్రచురించే పబ్లికేషన్లు, కేవైసీ పత్రాలు, క్లయింట్లతో చేసుకునే ఒప్పంద పత్రాలు, ఇన్వెస్టర్లతో నిర్వహించే అన్ని రకాల సంప్రదింపుల్లోనూ ఈ వివరాలు ఉండాలని సెబీ స్పష్టం చేసింది. దీనికి అదనంగా ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్లు, రీసెర్చ్ అనలిస్టులు ఇచ్చే ప్రకటనల్లో సెబీ లోగో వాడకుండా నిషేధం విధించింది. కొంత మంది పెట్టుబడుల సలహాదారులు, పరిశోధనా విశ్లేషకులు తమ ప్రకటనలు, ఇన్వెస్టర్లతో నిర్వహించే సంప్రదింపులు, ఒప్పందాల సమయంలో సెబీ వద్ద నమోదు చేసుకున్న పేరు, రిజిస్ట్రేషన్ నంబర్‌కు బదులు బ్రాండ్ లేదా లోగోను వాడుతున్నట్టు సెబీ దృష్టికి రావడంతో ఈ మేరకు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment