SEBI orders
-
వడ్డీతో సహా చెల్లించాల్సిందే.. కార్వీ కేసులో బ్యాంకులకు ఊరట
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్వీ స్టాక్ బ్రోకింగ్ కేసులో బ్యాంకింగ్‌కు అనుకూలంగా సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) బుధవారం కీలక ఉత్తర్వులు వెలువరించింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్)లు సంయుక్తంగా బ్యాంకులకు కార్వీ తాకట్టు పెట్టిన షేర్లను తిరిగి ఇవ్వాలని లేదా బ్యాంకులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కార్వీ రుణదాతలకు (బ్యాంకులకు) ఎన్ఎస్డీఎల్, ఎన్ఎస్ఈ, సెబీలు వార్షికంగా 10 శాతం వడ్డీ సహా షేర్ల విలువ రూ. 1,400 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కేసు వివరాల్లోకి వెళితే... క్లయింట్ సెక్యూరిటీలను కార్వీ స్టాక్ బ్రోకింగ్ దుర్వినియోగం చేసిననట్లు సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) 2019లో ధ్రువీకరించింది. బ్యాంకుల వద్ద రూ.2,300 కోట్లకుపైగా విలువైన ఖాతాదారుల సెక్యూరిటీలను స్టాక్ బ్రోకర్ తాకట్టు పెట్టినట్లు పేర్కొంది. అయితే తాము బ్రోకరేజ్ సంస్థకు ఇచ్చిన రుణాలకుగాను (ప్లెడ్జ్ ఆధారంగా) ఈ తనఖా షేర్లను సర్దుబాటు చేసుకుంటామని యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ సెబీని అభ్యర్థించాయి. అయితే దీనిని సెబీ తిరస్కరించింది. తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను బ్యాంకులకు బదిలీ చేయవద్దని రెగ్యులేటర్ డిపాజిటరీని ఆదేశించిన సెబీ, ఈ షేర్లను తిరిగి క్లయింట్ ఇన్వెస్టర్లకు బదిలీ చేయాలని డిపాజిటరీని ఆదేశించింది. దీనితో రుణ దాతలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ట్రిబ్యునల్‌లో తాజాగా రెండు వేర్వేరు రూలింగ్ ఇస్తూ, సెబీ ఆదేశాలను తప్పుపట్టింది. -
SEBI: అన్ని వివరాలూ వెల్లడించాలి
న్యూఢిల్లీ: పెట్టుబడి సలహాలిచ్చే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, పరిశోధనా అనలిస్టులకు సంబంధించి పారదర్శకత పెంచే దిశగా సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. తమ ప్రకటనల్లో సెబీ రిజిస్ట్రేషన్ నంబర్, పూర్తి పేరు, లోగో, పూర్తి చిరునామా, టెలిఫోన్ నంబర్లను వెల్లడించాలని పేర్కొంది. సెబీ ఇచ్చిన రిజిస్ట్రేషన్ కానీ, బీఎస్ఈ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్విజన్ సభ్యత్వం కానీ, రాబడులు, పనితీరుకు భరోసాగా, హామీగా చూడొద్దంటూ విధిగా ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుందని సెబీ ఆదేశించింది. వారు ప్రచురించే పబ్లికేషన్లు, కేవైసీ పత్రాలు, క్లయింట్లతో చేసుకునే ఒప్పంద పత్రాలు, ఇన్వెస్టర్లతో నిర్వహించే అన్ని రకాల సంప్రదింపుల్లోనూ ఈ వివరాలు ఉండాలని సెబీ స్పష్టం చేసింది. దీనికి అదనంగా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, రీసెర్చ్ అనలిస్టులు ఇచ్చే ప్రకటనల్లో సెబీ లోగో వాడకుండా నిషేధం విధించింది. కొంత మంది పెట్టుబడుల సలహాదారులు, పరిశోధనా విశ్లేషకులు తమ ప్రకటనలు, ఇన్వెస్టర్లతో నిర్వహించే సంప్రదింపులు, ఒప్పందాల సమయంలో సెబీ వద్ద నమోదు చేసుకున్న పేరు, రిజిస్ట్రేషన్ నంబర్‌కు బదులు బ్రాండ్ లేదా లోగోను వాడుతున్నట్టు సెబీ దృష్టికి రావడంతో ఈ మేరకు ఆదేశించింది. -
సత్యం స్కాం.. రూ. 1800 కోట్ల జరిమానా
దాదాపు ఏడేళ్లుగా నలుగుతున్న సత్యం కంప్యూటర్స్ స్కాం మరో కొత్త మలుపు తిరిగింది. ఈ స్కాంలో ప్రధాన నిందితుడు రామలింగరాజుకు చెందిన పది సంస్థలు అక్రమంగా పోగేసుకున్న రూ. 1800 కోట్ల సొమ్మును తిరిగి చెల్లించాలని సెబి ఆదేశించింది. 2009 జనవరి ఏడో తేదీ నుంచి జరిమానా విధించాల్సి ఉన్నందున.. ఆ మొత్తం మీద వడ్డీగా మరో రూ. 1500 కోట్లు కూడా చెల్లించాలని తెలిపింది. ఈ పది సంస్థలు రామలింగరాజు సమీప బంధువులవే. వాళ్లలో ఆయన తల్లి, సోదరుడు, కుమారుడు.. కూడా ఉన్నారు. తన కుటుంబ సభ్యుల పేర్లతో అకౌంట్లు తెరిచి, ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినందుకు గాను ఈ జరిమానాలు విధించారు. రామలింగరాజుతో పాటు మరో నలుగురిని 14 ఏళ్ల పాటు మార్కెట్ల నుంచి సెబి బహిష్కరించిన విషయం తెలిసిందే. అక్రమ పద్ధతుల ద్వారా ఆర్జించిన రూ. 1849 కోట్లను వడ్డీతో సహా చెల్లించాలని గత సంవత్సరం జూలైలోనే సెబి ఆదేశించింది. రామలింగరాజు, ఆయన సోదరుడు (నాటి సత్యం ఎండీ) రామరాజు, వడ్లమాని శ్రీనివాస్ (మాజీ సీఎఫ్ఓ), జి.రామకృష్ణ (నాటి వైస్ ప్రెసిడెంట్), వీఎస్ ప్రభాకర గుప్తా (అంతర్గత ఆడిట్ విభాగం మాజీ అధిపతి)లపై ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో.. రామలింగరాజు, ఆయన ఇద్దరు సోదరులు, ఇతర వ్యక్తులు, కంపెనీలను కూడా సెబి ఈ కేసులో పెట్టింది. ఈ కంపెనీలలో ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ (ఇంతకుముందు మేటాస్ ఇన్ఫ్రా) ఉన్నాయి. రామలింగరాజు తల్లి అప్పలనరసమ్మ, ఆమె ఇద్దరు కుమారులు తేజరాజు, రామరాజు, సోదరుడు సూర్యనారాయణ రాజు, ఆయన భార్య ఝాన్సీ రాణి, చింతలపాటి శ్రీనివాస్ (నాటి డైరెక్టర్), ఆయన తండ్రి దివంగత అంజిరాజు తదితరులు కూడా ఉన్నారు. -
పదవి నుంచి వైదొలగిన ‘మురుగప్ప’ చైర్మన్ వేలాయన్
- ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో సెబీ ఉత్తర్వుల నేపథ్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుకు సంబంధించి మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి ఉత్తర్వులు నేపథ్యంలో మురుగప్ప గ్రూపు చైర్మన్ పదవి నుంచి వేలాయన్ వైదొలిగారు. గురువారం రాత్రి వేలాయన్‌పై సెబీ అభియోగాలను మోపి, నగదు స్వాధీనానికి ఉత్తర్వులు జారీచేసింది. దాంతో గ్రూపు చైర్మన్ పదవితో పాటు అనుబంధ కంపెనీలు కోరమాండల్ ఇంటర్నేషనల్, ఈఐడీ ప్యారీ సంస్థల చైర్మన్ పదవి నుంచి కూడా పక్కకు తప్పుకున్నట్లు మురుగప్ప గ్రూప్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సెబీ కొన్ని సంశయాలతో వేలాయన్‌పై మోపిన అభియోగాలను గ్రూప్ తోసిపుచ్చింది. వేలాయన్ తన నిజాయితీని నిరూపించుకోవడానికి న్యాయపరమైన చర్యలను తీసుకుంటామని గ్రూప్ పేర్కొంది. వేలాయన్‌కు ఉన్న కీర్తి, కంపెనీకి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని చైర్మన్ పదవి నుంచి వైదొలిగారని, కానీ కంపెనీ బోర్డులో డెరైక్టర్‌గా కొనసాగుతారని మురుగప్ప గ్రూపు వెల్లడించింది. సెబీ ఆరోపణలను వేలాయన్ ఖండిస్తూ, దర్యాప్తు పూర్తయితే నిర్దోషిగా బయటపడతానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి సెబీకి పూర్తి సహకారాన్ని అం దిస్తానని వేలాయన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదీ కేసు..: సబిరో ఆర్గానిక్ అనే గుజరాత్ కంపెనీని కొనుగోలు చేస్తున్నప్పుడు బయటకు చెప్పకూడని సమాచారాన్ని బంధువులకు చేరవేయడం ద్వారా వేలాయన్, ఆయన సమీప బంధువు మురుగప్పన్‌లు ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లఘించినట్లు సెబీ ఆరోపించింది. 2011లో మురుగప్ప గ్రూప్ కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్, సబిరోను టేకోవర్ చేసిన సందర్భంలో వారు ఇన్సైడర్ సమాచారాన్ని చేరవేసినట్లు సెబి ఆరోపించింది. ఈ కేసులో వేలాయన్, మురుగప్పన్‌లతో పాటు వై.కరుప్పాయి, గోపాలకృష్ణన్లపై సెబీ అభియోగాలను నమోదు చేసింది. సమాచారం ఆధారంగా ట్రేడ్‌చేయడం ద్వారా గోపాలకృష్ణన్ రూ. 1.30 కోట్లు, కురుప్పాయి రూ. 15.93 లక్షల చొప్పున లబ్దిపొందారని సెబీ ఆరోపించింది. వడ్డీతో కలిపి రూ. 2.15 కోట్లు వారి ఖాతాల నుంచి స్వాధీనం చేసుకునేందుకు సెబీ ఉత్వర్వులిచ్చింది. ఈ మొత్తం వారి అకౌంట్లలో లేకపోతే ఈ మొత్తానికి సమానమైన షేర్లను వారి డీమ్యాట్ ఖాతాల్లో స్తంభింపచేస్తామని సెబీ పేర్కొంది.