పదవి నుంచి వైదొలగిన ‘మురుగప్ప’ చైర్మన్ వేలాయన్ | Sebi charges Murugappa Group chairman with insider trading | Sakshi
Sakshi News home page

పదవి నుంచి వైదొలగిన ‘మురుగప్ప’ చైర్మన్ వేలాయన్

Published Sat, May 23 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

పదవి నుంచి వైదొలగిన ‘మురుగప్ప’ చైర్మన్ వేలాయన్

పదవి నుంచి వైదొలగిన ‘మురుగప్ప’ చైర్మన్ వేలాయన్

- ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసులో సెబీ ఉత్తర్వుల నేపథ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసుకు సంబంధించి మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి ఉత్తర్వులు నేపథ్యంలో మురుగప్ప గ్రూపు చైర్మన్ పదవి నుంచి వేలాయన్ వైదొలిగారు. గురువారం రాత్రి వేలాయన్‌పై సెబీ అభియోగాలను మోపి, నగదు స్వాధీనానికి ఉత్తర్వులు జారీచేసింది. దాంతో గ్రూపు చైర్మన్ పదవితో పాటు అనుబంధ కంపెనీలు కోరమాండల్ ఇంటర్నేషనల్, ఈఐడీ ప్యారీ సంస్థల చైర్మన్ పదవి నుంచి కూడా పక్కకు తప్పుకున్నట్లు మురుగప్ప గ్రూప్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. సెబీ కొన్ని సంశయాలతో వేలాయన్‌పై మోపిన అభియోగాలను గ్రూప్ తోసిపుచ్చింది.

వేలాయన్ తన నిజాయితీని నిరూపించుకోవడానికి  న్యాయపరమైన చర్యలను తీసుకుంటామని గ్రూప్ పేర్కొంది. వేలాయన్‌కు ఉన్న కీర్తి, కంపెనీకి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని చైర్మన్ పదవి నుంచి వైదొలిగారని, కానీ కంపెనీ బోర్డులో డెరైక్టర్‌గా కొనసాగుతారని మురుగప్ప గ్రూపు వెల్లడించింది. సెబీ ఆరోపణలను వేలాయన్ ఖండిస్తూ, దర్యాప్తు పూర్తయితే నిర్దోషిగా బయటపడతానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి సెబీకి పూర్తి సహకారాన్ని అం దిస్తానని వేలాయన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీ కేసు..: సబిరో ఆర్గానిక్ అనే గుజరాత్ కంపెనీని కొనుగోలు చేస్తున్నప్పుడు బయటకు చెప్పకూడని సమాచారాన్ని బంధువులకు చేరవేయడం ద్వారా వేలాయన్, ఆయన సమీప బంధువు మురుగప్పన్‌లు ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లఘించినట్లు సెబీ ఆరోపించింది. 2011లో మురుగప్ప గ్రూప్ కంపెనీ కోరమాండల్ ఇంటర్నేషనల్, సబిరోను టేకోవర్ చేసిన సందర్భంలో వారు ఇన్‌సైడర్ సమాచారాన్ని చేరవేసినట్లు సెబి ఆరోపించింది. ఈ కేసులో  వేలాయన్, మురుగప్పన్‌లతో పాటు వై.కరుప్పాయి, గోపాలకృష్ణన్‌లపై సెబీ అభియోగాలను నమోదు చేసింది.  

సమాచారం ఆధారంగా ట్రేడ్‌చేయడం ద్వారా గోపాలకృష్ణన్ రూ. 1.30 కోట్లు, కురుప్పాయి రూ. 15.93 లక్షల చొప్పున లబ్దిపొందారని సెబీ ఆరోపించింది. వడ్డీతో కలిపి రూ. 2.15 కోట్లు వారి ఖాతాల నుంచి స్వాధీనం చేసుకునేందుకు సెబీ ఉత్వర్వులిచ్చింది. ఈ మొత్తం వారి అకౌంట్లలో లేకపోతే ఈ మొత్తానికి సమానమైన షేర్లను వారి డీమ్యాట్ ఖాతాల్లో స్తంభింపచేస్తామని సెబీ పేర్కొంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement