జిల్లా కేంద్రంలోని ఖజానా కార్యాలయం
నెల్లూరు(పొగతోట) : ప్రభుత్వ ఖజానా కార్యాలయాల్లో ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియ ఈ నెల రెండు నుంచి ప్రారంభమైంది. ఉద్యోగుల వేతనాలు, ఇతర బిల్లులు, పింఛన్లను ఖజానాల ద్వారా చెల్లిస్తున్నారు. ఇక నుంచి ఉద్యోగుల వేతనాలను ఈ – కుబేర్ విధానంలో చెల్లించనున్నారు. గతంలో సంబంధిత శాఖల డ్రాయింగ్ అండ్ డిస్బర్స్‌మెంట్ అధికారులు ఖజానా కార్యాలయాల్లోని ఎస్టీఓలకు బిల్లులు సమర్పించే వారు. వారు పరిశీలించి ఏటీఓలకు, అక్కడ ఆమోదించిన అనంతరం బిల్లులను బ్యాంకులకు పంపించేవారు. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగేది. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వస్తే వేతనాల చెల్లింపు నాలుగైదు రోజుల పాటు జాప్యం జరిగేది.
ఈ – కుబేర్‌తో అక్రమాలకు చెక్
తాజాగా చేపట్టిన ఈ – కుబేర్ విధానంలో అక్రమాలకు చెక్ పెట్టే అవకాశం ఉంది. దీని వల్ల డీడీఓలకు జవాబుదారీతనం పెరగనుంది. గతంలో బిల్లుల మంజూరు కోసం ప్రభుత్వోద్యోగులు రోజుల తరబడి ఖజానా కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. అయితే ప్రస్తుత విధానంతో సమస్య తీరనుంది. వేతనాలు, ఇతర బిల్లులను ఈ – కుబేర్ విధానంలో ఆన్‌లైన్లో పొందుపరిస్తే ఖజానా అధికారులు బిల్లులను పరిశీలించి ఆయా బ్యాంకులకు నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటారు.
ఉన్నతాధికారులదే బాధ్యత
జిల్లాలో జిల్లా ఖజానా కార్యాలయం, 15 ఉప ఖజానా కార్యాలయాలు ఉన్నాయి. సుమారు 26400 మంది ప్రభుత్వోద్యోగులకు ప్రతి నెలా రూ.96 కోట్లను వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. 23500 మంది పింఛనర్లకు ప్రతి నెలా రూ.54 కోట్లు చెల్లిస్తున్నారు. ఇవే కాకుండా ప్రతి నెలా రూ.25 నుంచి రూ.30 కోట్ల ఇతర బిల్లులను మంజూరు చేస్తున్నారు. ఈ – కుబేర్ విధానంలో వేతనాలు, బిల్లులు అధికంగా లేదా తక్కువగా చెల్లించినా దానికి ఉన్నతాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జిల్లా ఖజానా, సబ్ ట్రెజరీ అధికారులకు ఎలాంటి సంబంధం ఉండదు. ప్రస్తుతం ఒకట్రెండు శాఖల మినహా అన్ని శాఖల ఉద్యోగుల వేతనాలు, పింఛన్లను చెల్లించారు. ఇతర బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగే అవకాశం ఉంది.
పూర్తి వివరాలు ఆన్‌లైన్లో
బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. ఏ సెక్షన్ వారు ఏయే శాఖల బిల్లులు చెల్లిస్తున్నారనే వివరాలను సేకరించాల్సి ఉంది. సెక్షన్ల వారీగా సంబంధిత అధికారులు, ఉద్యోగులకు పాస్‌వర్డ్‌ను కేటాయించాల్సి ఉంది. దీని తర్వాత శాఖల వారీగా ప్రత్యేక నంబర్లను కేటాయించి పూర్తి వివరాలను ఆన్‌లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తి కావడానికి 15 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నెల 20 తర్వాత పూర్తి స్థాయిలో బిల్లుల చెల్లింపు ప్రక్రియ యథావిధిగా జరగనుంది. ప్రక్రియ ద్వారా అక్రమాలు జరిగే అవకాశం లేకపోయినా ఈ – కుబేర్‌లో లోపాలను కనుగొని మామూళ్లు వసూలు చేసే అవకాశం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైసలిస్తే కానీ బిల్లులు కదలని శాఖలో ఈ – కుబేర్ ఎంత వరకు ఫలితాలను తీసుకొస్తుందో వేచ్చి చూడాల్సి ఉంది.
పూర్తి స్థాయిలో అమలు చేస్తాం
ప్రభుత్వోద్యోగుల వేతనాల చెల్లింపు, పింఛన్లను ఈ నెల రెండు నుంచి ఈ – కుబేర్ విధానంలో చెల్లిస్తున్నాం. ఒకట్రెండు రోజులు జాప్యం జరిగినా వేతనాలు, పింఛన్లను చెల్లించాం. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. సెక్షన్ల వారీగా ప్రత్యేక పాస్‌వర్డ్‌లను కేటాయించాల్సి ఉంది. ప్రక్రియ పూర్తయి బిల్లులు మంజూరు చేయడానికి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
–ఉదయలక్ష్మి, జిల్లా ఖజానా శాఖ డీడీ
Comments
Please login to add a commentAdd a comment