governament offices
-
వేలం వేయరు.. దుకాణాలు తెరవరు
సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రం నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ దుకాణాలకు అధికారులు, పాలకులు వేలం వేయడంలేదు.. దుకాణాలను తెరవడంలేదు. ఫలితంగా సర్కారు ఖజానాకు చిల్లు పడుతోంది. పట్టణంలోని పాతబస్టాండ్ ఏరియాలో రూ.1.56 కోట్ల వ్యయంతో నిర్మించిన 28 దుకాణాలను, అలాగే కూరగాయల మార్కెట్లో రూ.38 లక్షల వ్యయంతో 16 దుకాణాలను నిర్మించారు. వాటిని గతేడాది ఫిబ్రవరి 17న అప్పటి మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఆ దుకాణాలకు వేలం వేయకుండా తెరవకుండా ఉండటంతో మార్కెట్ యార్డుకు దాదాపు ఇప్పటివరకు రూ.30 లక్షల మేర ఆదాయం రాకుండా పోయింది. గ్రీన్‌సిగ్నల్ ఎప్పుడో? మార్కెట్‌యార్డు పాలకవర్గాన్ని పొడగించేందుకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఇటీవలే ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఏడాది కాలంలో పాలకవర్గం షాపింగ్కాంప్లెక్స్లోని దుకాణాలను వేలం వేయడంలో విఫలమైంది. ఈ అంశం గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా ఎమ్మెల్యే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి.. వారంరోజుల్లో టెండర్లకు ఆహ్వానిస్తామని అధికారులు అంటున్నారు. వ్యాపారులు ఆ సిగ్నల్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తా నుంచి మార్కండేయ దేవాలయం వరకు రోడ్డు విస్తరణ పనులు జోరందుకున్నాయి. రోడ్డుకు ఇరువైపుల ఉన్న దుకాణాలు తొలగించారు. వ్యాపారస్తులకు సిద్ధంగా ఉన్న దుకాణాలు కావాలంటే నూతనంగా నిర్మించిన ఈ దుకణాలే దిక్కు. వాటిని ఎప్పుడు వేలం వేస్తారోనని ఏడాదిన్నరగా వేచి ఉన్నారు. రూ.30 లక్షల ఆదాయం పోయినట్టే.. మార్కెట్ విలువను బట్టి రైతుబజార్‌లోని 16 దుకాణాల సముదాయంలో ఒక్కొక్కదానికి రూ.2,200, వాణిజ్య సముదాయ దుకాణాలకు ఒక్కొక్క దానికి రూ.5,200 సర్కార్పాటను వేలానికి సిద్ధం చేశారు. కానీ రూ.5,200 అద్దె ఎక్కువ అవుతుందని వాటిని రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు తగ్గించాలని ఇంతవరకు దుకాణాలకు వేలం నిర్వహించలేదు. నిబంధనల ప్రకారం వేలం వేసిన తర్వాత ఆ దుకణాలకు టెండర్లు ఎవరూ వేయకపోతే మళ్లీ రెండోసారి పిలవడం అప్పుడు రానట్లయితే మూడోసారి టెండర్లను రీకాల్చేస్తూ అద్దెలో మార్పులు చేర్పులు తీసుకునే అవకాశం ఉంటుంది. దుకాణాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో టెండర్లను ఇదివరకే పిలిచి ఉంటే ఇప్పటివరకు మార్కెట్‌కు రూ.30 లక్షల ఆదాయం వచ్చేది. ఇకనైనా పాలకులు, అధికారులు పట్టించుకుని వేలం వేసి దుకాణాలను వినియోగంలోకి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభించాలని వ్యాపారులు కోరుతున్నారు. -
‘పసుపు రంగు’ కోడ్‌లోకి రాదా?
సాక్షి, దెందులూరు: మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు పసుపు రంగు వేయటం ఏమిటని, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చి వారం రోజులు కావస్తున్నా పర్యవేక్షణ అధికారులు ఏం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బొమ్మనబోయిన నాని ప్రశ్నించారు. ఆదివారం పోతునూరు గ్రామ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీతంపేట, ఉప్పుగూడెం, పోతునూరు, చల్లచింతలపూడి, దెందులూరు, గోపన్నపాలెం, జోగన్నపాలెం, శ్రీరామవరంలతో పాటు గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు, స్త్రీ శక్తి భవనాలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలకు పసుపు రంగు వేశారన్నారు. ఎన్నికల కోడ్ అమలుకు మండల, డివిజన్, జిల్లా అధికారులను ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నియమించినప్పటికీ పసుపు రంగుపై పర్యవేక్షణ అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వ కార్యాలయాలపై పసుపు రంగుపై ఫిర్యాదు చేస్తామన్నారు. -
కల్కిని నేను.. ఆఫీసుకు రాను..!
అహ్మదాబాద్: ‘విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కిని నేను. ప్రపంచాన్ని మార్చేందుకు యాగం చేస్తున్నా. అందుకే ఆఫీసుకు రావట్లేను. నా యజ్ఞం వల్లే ఇరవయ్యేళ్లుగా దేశంలో పుష్కలంగా వానలు కురుస్తున్నాయి’ అంటూ గుజరాత్ ప్రభుత్వ అధికారి ఒకరు ప్రకటించుకున్నారు. రమేశ్చంద్ర ఫెఫర్(55) అనే ఆయన సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్వాసితులకు పరిహారం అందించే శాఖలో సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన గత ఆరు నెలలుగా ఆఫీసుకు రావట్లేదు. అధికారులు మూడు రోజుల క్రితం ఆయనకు షోకాజ్ నోటీసులిచ్చారు. నోటీసులు అందుకున్న రమేశ్చంద్ర..‘కల్కి అవతారంలో ఈ లోకాన్ని మార్చేందుకు యాగం చేస్తున్నా. ఆఫీసులో యాగం చేయడం కుదరదు. అందుకే ఇంట్లో చేస్తున్నా. యాగం ఫలించి 19ఏళ్లుగా దేశంలో సమృద్ధిగా వానలు పడుతున్నాయి’ అంటూ రెండు పేజీల వివరణ ఇచ్చారు. శుక్రవారం రాజ్‌కోట్‌లో మాట్లాడారు. ‘ఆఫీసులో కూర్చుని కాలక్షేపం చేయటం ముఖ్యమా లేక దేశాన్ని కరువు నుంచి కాపాడటం ముఖ్యమా అనేది పైఅధికారులే నిర్ణయించాలన్నారు. -
ఖజానాలో ఆన్లైన్ లావాదేవీలు
నెల్లూరు(పొగతోట) : ప్రభుత్వ ఖజానా కార్యాలయాల్లో ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియ ఈ నెల రెండు నుంచి ప్రారంభమైంది. ఉద్యోగుల వేతనాలు, ఇతర బిల్లులు, పింఛన్లను ఖజానాల ద్వారా చెల్లిస్తున్నారు. ఇక నుంచి ఉద్యోగుల వేతనాలను ఈ – కుబేర్ విధానంలో చెల్లించనున్నారు. గతంలో సంబంధిత శాఖల డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారులు ఖజానా కార్యాలయాల్లోని ఎస్టీఓలకు బిల్లులు సమర్పించే వారు. వారు పరిశీలించి ఏటీఓలకు, అక్కడ ఆమోదించిన అనంతరం బిల్లులను బ్యాంకులకు పంపించేవారు. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగేది. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వస్తే వేతనాల చెల్లింపు నాలుగైదు రోజుల పాటు జాప్యం జరిగేది. ఈ – కుబేర్‌తో అక్రమాలకు చెక్ తాజాగా చేపట్టిన ఈ – కుబేర్ విధానంలో అక్రమాలకు చెక్ పెట్టే అవకాశం ఉంది. దీని వల్ల డీడీఓలకు జవాబుదారీతనం పెరగనుంది. గతంలో బిల్లుల మంజూరు కోసం ప్రభుత్వోద్యోగులు రోజుల తరబడి ఖజానా కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. అయితే ప్రస్తుత విధానంతో సమస్య తీరనుంది. వేతనాలు, ఇతర బిల్లులను ఈ – కుబేర్ విధానంలో ఆన్లైన్లో పొందుపరిస్తే ఖజానా అధికారులు బిల్లులను పరిశీలించి ఆయా బ్యాంకులకు నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటారు. ఉన్నతాధికారులదే బాధ్యత జిల్లాలో జిల్లా ఖజానా కార్యాలయం, 15 ఉప ఖజానా కార్యాలయాలు ఉన్నాయి. సుమారు 26400 మంది ప్రభుత్వోద్యోగులకు ప్రతి నెలా రూ.96 కోట్లను వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. 23500 మంది పింఛనర్లకు ప్రతి నెలా రూ.54 కోట్లు చెల్లిస్తున్నారు. ఇవే కాకుండా ప్రతి నెలా రూ.25 నుంచి రూ.30 కోట్ల ఇతర బిల్లులను మంజూరు చేస్తున్నారు. ఈ – కుబేర్ విధానంలో వేతనాలు, బిల్లులు అధికంగా లేదా తక్కువగా చెల్లించినా దానికి ఉన్నతాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జిల్లా ఖజానా, సబ్ ట్రెజరీ అధికారులకు ఎలాంటి సంబంధం ఉండదు. ప్రస్తుతం ఒకట్రెండు శాఖల మినహా అన్ని శాఖల ఉద్యోగుల వేతనాలు, పింఛన్లను చెల్లించారు. ఇతర బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఆన్లైన్లో బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. ఏ సెక్షన్ వారు ఏయే శాఖల బిల్లులు చెల్లిస్తున్నారనే వివరాలను సేకరించాల్సి ఉంది. సెక్షన్ల వారీగా సంబంధిత అధికారులు, ఉద్యోగులకు పాస్‌వర్డ్‌ను కేటాయించాల్సి ఉంది. దీని తర్వాత శాఖల వారీగా ప్రత్యేక నంబర్లను కేటాయించి పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తి కావడానికి 15 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నెల 20 తర్వాత పూర్తి స్థాయిలో బిల్లుల చెల్లింపు ప్రక్రియ యథావిధిగా జరగనుంది. ప్రక్రియ ద్వారా అక్రమాలు జరిగే అవకాశం లేకపోయినా ఈ – కుబేర్‌లో లోపాలను కనుగొని మామూళ్లు వసూలు చేసే అవకాశం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైసలిస్తే కానీ బిల్లులు కదలని శాఖలో ఈ – కుబేర్ ఎంత వరకు ఫలితాలను తీసుకొస్తుందో వేచ్చి చూడాల్సి ఉంది. పూర్తి స్థాయిలో అమలు చేస్తాం ప్రభుత్వోద్యోగుల వేతనాల చెల్లింపు, పింఛన్లను ఈ నెల రెండు నుంచి ఈ – కుబేర్ విధానంలో చెల్లిస్తున్నాం. ఒకట్రెండు రోజులు జాప్యం జరిగినా వేతనాలు, పింఛన్లను చెల్లించాం. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. సెక్షన్ల వారీగా ప్రత్యేక పాస్‌వర్డ్‌లను కేటాయించాల్సి ఉంది. ప్రక్రియ పూర్తయి బిల్లులు మంజూరు చేయడానికి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. –ఉదయలక్ష్మి, జిల్లా ఖజానా శాఖ డీడీ -
అద్దె భవనాల్లో కార్యాలయాలు
బోధన్‌టౌన్ : పట్టణంలోని వివిధ కాలనీల్లో అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగుతుండటంతో అడ్రస్ దొరకక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనాల్లో అధికారులు సైతం అరకొర వసతులతో అవస్థలు పడుతున్నారు. అద్దె భవనాలకు ప్రతినెల రూ.3 నుంచి రూ.4 వేల అద్దె చెల్లిస్తున్నారు. పట్టణంలోని రాకాసీపేట్‌లో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. గతంలో ఐసీడీఎస్, తూనికలు కొలతలు కొనసాగాయి. డివిజనల్ లేబర్ అధికారి కార్యాలయంలో గతంలో శక్కర్‌నగర్ చౌరస్తాలో ఉండేది. ప్రస్తుతం ఐసీడీఎస్ కార్యాలయంలో శక్కర్‌నగర్‌లోని కమ్యూనిటీ భవనంలోకి మార్చారు. లేబర్ అధికారి కార్యాయలాన్ని రాకాసీపేట్‌కు మార్చారు. తూనికలు కొలతల కార్యాలయం సరస్వతి నగర్ కాలనీకి మార్చారు. దీంతో కార్యాలయ అడ్రస్‌లు దొరకక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనాల్లో ఎక్సైజ్, తూనికలు కొలతలు, లేబర్, డివిజనల్ సహకార అధికారి కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇందులో ఐసీడీఎస్, బీసీ సంక్షేమ, డివిజనల్ సహకార అధికారి శాఖ కార్యాలయాలు కమ్యూనిటీ భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ కార్యాలయాలకు సొంత భవనాలు లేక పోవడంతలో ఇళ్ల మధ్య ఉండడంతో ప్రజలు కార్యాలయాలు తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లేబర్ అధికారి కార్యాలయం అడ్రస్ దొరకదు పట్టణంలోని లేబర్ అధికారి కార్యాలయం శక్కర్‌నగర్ ప్రధాన రహదారి పక్కన ఉండేది. కార్యాలయం అడ్రస్ ఎవరిని అడిగినా చెప్పేవారు. లేబర్ డివిజనల్ అధికారి కార్యాలయానికి శాశ్వత భవనం లేకపోవడంతో రాకాసీపేట్‌లోని ఓ ఇంటిలో ఏర్పాటు చేశారు. అడ్రస్ తెలిసేలా బోర్డు ఏర్పాటు చేయాలి. –ఖలీమ్, పట్టణ వాసి కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయాలి ప్రభుత్వ కార్యాలయాలకు పనులకోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే వద్ద ఉండేలా చూడాలి. అద్దె భవనాలు కాకుండ శాశ్వత భవనాలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – బి. మల్లేశ్, కార్మిక సంఘం నాయకుడు -
రిపబ్లిక్ డే సంబరాలు
కోరుట్లటౌన్ : 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కోరుట్ల నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గ్రంథాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో మువ్వన్నెల పతాకం ఎగిరింది. జాతీయ గీతాలాపనతో గణతంత్ర సంబరాలు అంబరాన్ని అంటాయి.కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో కమీషనర్ అల్లూరి వాణిరెడ్డి, వయోవృద్ధుల సంఘంలో మున్సిపల్ చైర్మన్ శీలం వేణు జెండా ఆవిష్కరించారు. కోరుట్ల : పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం సేవా సమితి ఆధ్వర్యంలో జాతీయ పతాకం ఆవిష్కరణ కన్నుల పండువగా జరిగింది. కోరుట్లరూరల్ : మండలంలోని అన్ని గ్రామాల్లో 69వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మార్కెట్ చైర్మన్ నారాయణ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సత్యనారాయణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సంతోష్‌కుమార్ జెండాను ఆవిష్కరించారు. మెట్పల్లి : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. పట్టణంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా శాఖల అధికారులు, మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జెండా ఆవిష్కరించారు. పట్టణంలో వివిధ పార్టీల కార్యాలయాల్లో ఆయా పార్టీల అధ్యక్షులు జెండావిష్కరించారు. కథలాపూర్ : కథలాపూర్ మండలంలోని గ్రామాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో, తహసీల్దార్ కార్యాలయంలో, పోలీస్‌స్టేషన్‌లో, మార్కెట్ కార్యాలయం, సింగిల్‌విండో కార్యాలయాల్లో, గ్రామపంచాయతీ కార్యాలయాల్లో, ప్రభుత్వ, ప్రై వేట్ పాఠశాలల్లో జాతీయజెండాను ఎగురవేసి ఉత్సవాలు జరిపారు. ఇబ్రహీంపట్నం : మండలంలో 69వ గణతంత్ర వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ కందరి లక్ష్మీ, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రామ్‌నాయక్, జెండావిష్కరించారు. మల్లాపూర్ : మల్లాపూర్ మండల కేంద్రంతో పాటు అన్నిగ్రామాల్లో శుక్రవారం 69వ గణతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, పాఠశాలల్లో హెచ్ఎంలు జెండా ఆవిష్కరించారు. -
మినహాయిస్తే మేలు..
విద్యాసంస్థల భవనాల్లో కార్యాలయాలు వద్దన ప్రభుత్వం పెద్దపల్లి ఐటీఐ భవనంలో సాగుతున్న కలెక్టరేట్ పనులు భవిత పాఠశాల భవనం ఎస్ఎస్ఏకు కేటాయింపు వసతిగృహాలను తరలించే యోచనలోనే అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, సంఘాలు పెద్దపల్లిరూరల్/జగిత్యాల అర్బన్ : ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన భవనాల్లో కొత్త జిల్లాలకు సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. విద్యాసంస్థల భవనాలను తీసుకోవడాన్ని నిరసిస్తూ పలుచోట్ల విద్యార్థులు ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం విద్యాసంస్థలను నిర్వహిస్తున్న భవనాలను మినహాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అలాంటి భవనాలను ఎంపిక చేస్తే.. వాటి స్థానంలో ప్రత్యామ్నాయం చూడాలని సూచించింది. అయితే జగిత్యాల, పెద్దపల్లిలో పలు విద్యాసంస్థల భవనాల్లో మాత్రం పనులు యథాతథంగా కొనసాగుతుండటం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. పెద్దపల్లి ఐటీఐలో కలెక్టరేట్.. పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ భవనాల్లోనే కలెక్టరేట్ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించడంతో పనులు చకాచకా సాగుతున్నాయి. ఐటీఐలో ప్రభుత్వ కార్యాలయాలు వద్దని, వసతిగహాలకు మినహాయింపు ఇవ్వాలని పెద్దపల్లిలో విద్యార్థులు ఆందోళనలకు దిగిన విషయం విదితమే. అయినా పెద్దపల్లిలో జిల్లా కార్యాలయాలకు కేటాయించిన విద్యాసంస్థలు, వసతిగహ భవనాల్లోనే కొత్త కార్యాలయాల పనులను అధికారులు కొనసాగిస్తున్నారు. పెద్దపల్లిలో 52 ఏళ్ల క్రితం ఏర్పాౖటెన ఐటీఐ ఇప్పుడు క్యూఐసీ (క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)కు ఎంపికైంది. ఇందులో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతోపాటు విద్యార్థుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి తరుణంలో ఐటీఐ భవనాల్లో కలెక్టరేట్‌కు అనుగుణంగా పనులు చేపడుతున్నారు. ఐటీఐ విద్యార్థులను ఆవరణలోని షెడ్లలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న ఐటీఐ చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఆదాయం రావడంతోపాటు విద్యార్థుల అవసరాలకు తగ్గట్టు నిర్మాణాలు చేసుకునేందుకు వీలుండేదంటున్నారు. ప్రభుత్వాదేశాలను ఇక్కడి అధికారులు అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం విద్యాసంస్థలను మినహాయించాలని ఇచ్చిన ఆదేశాల మేరకైనా ఐటీఐలో నిర్మాణాలు ఆపితే బాగుండేదని ప్రిన్సిపాల్ సురేందర్ అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో... పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో ఆర్ఐవో, ఆర్వీఈవో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాలేజీలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇబ్బందులు ఎదురవుతాయని కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి. భవిత కేంద్రంలో... పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో బుద్ధిమాంద్యం, ప్రత్యేకావసరాలు గల పిల్లలకోసం నిర్మించిన భవిత కేంద్రాన్ని ఖాళీ చేయించి సర్వశిక్షాభియాన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవిత కేంద్రాన్ని ఏదైనా పాఠశాల ఆవరణలోకి మార్చాలని సూచించారు. అయితే బుద్ధిమాంద్యం, వైకల్యం గల పిల్లలకోసం ర్యాంపును నిర్మించి పైపులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవేవీ పట్టని అధికారులు ఖాళీ చేయాలంటూ ఆదేశాలివ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 16మంది విద్యార్థులున్నారు. తప్పనిసరైతే ప్రత్యామ్నాయ భవనంలో పిల్లల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టిన తర్వాతే అందులోకి పంపాలని కోరుతున్నారు. ప్రగతినగర్ హాస్టల్‌పై కన్ను.. పెద్దపల్లి ప్రగతినగర్ చౌరస్తావద్ద కొత్తగా నిర్మించిన ఎస్సీ బాలుర వసతిగహాన్ని అన్ని ఇంజనీరింగ్ శాఖల ఎస్ఈలకు కేటాయించారు. ఈ హాస్టల్లో ఉన్న విద్యార్థులను సమీపంలోని ఎస్సీ హాస్టల్–2కు పంపించే యోచనలో ఉన్నారు. రాజీవ్ రహదారి పక్కనే ఉండటంతో ఈ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకే అధికారులు మొగ్గు చూపుతున్నారు. అయితే కొత్త హాస్టల్లో నీటివసతి ఉందని, అవసరమైతే ఎస్సీ హాస్టల్–2నే ఇందులోకి మార్చి, అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నా అభ్యంతరం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. తమను ఇబ్బందులకు గురిచేసి తమ చదువులను పాడు చేయవద్దని వేడుకుంటున్నారు. ఆదేశాలు అందలేదు.. –అశోక్‌కుమార్, ఆర్డీఓ జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు విద్యాసంస్థలను మినహాయింపు ఇవ్వాలనే ఆదేశాలేమీ అందలేదు. ప్రభుత్వ ఐటీఐలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టరేట్ కార్యాలయ పనులు సాగుతున్నాయి. ప్రగతినగర్ వసతిగహంతోపాటు రంగంపల్లిలోని ఆనంద నిలయంలోనూ కార్యాలయాల ఏర్పాటు చేస్తాం. విద్యార్థుల పరిస్థితి ఎలా? జగిత్యాల అర్బన్ : జగిత్యాలలోని ఎస్టీ హాస్టల్‌ను జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి కేటాయించారు. హాస్టల్లో 96 మంది విద్యార్థులు ఉంటున్నారు. పక్కన ఎస్సీ–1, ఎస్సీ–2 వసతిగహాలు ఉన్నాయి. ఎస్సీ–1 హాస్టల్లో ఉన్న 70 మంది విద్యార్థులను ఎస్సీ–2 హాస్టల్‌కు తరలించారు. ఎస్సీ–1 భవనంలోకి ఎస్టీ విద్యార్థులను తరలించారు. ఎస్సీ–2 హాస్టల్లో ఉన్న 70 మంది, ఎస్సీ–1లోని 70 మంది మొత్తం 140 మంది విద్యార్థులు ఒకే వసతిగహంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నూతన బిల్డింగ్‌లో కొనసాగుతున్న ఎస్సీ హాస్టల్ వసతిగహాన్ని పాత ఎస్సీ హాస్టల్–1లోకి కేటాయించారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందులో మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. పాతభవనం కావడంతో బాత్రూమ్లు సక్రమంగా లేవు. రూములు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. వంటగదులు అనుకూలంగా లేవు. నీటివసతి లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఎస్టీ హాస్టల్ భవనంలో ఎస్పీ, ఏఎస్పీ ఆఫీసులతోపాటు ఇతర చాంబర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.6లక్షల వ్యయంతో మరమ్మతులు చేపడుతున్నారు. గదులను కూల్చి చాంబర్లకు అనుకూలమైన రీతిలో కడుతున్నారు. ఇప్పటికే సగం మేర మరమ్మతులు పూర్తిచేశారు. విద్యాసంస్థల భవనాలను మినహాయించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు తర్జనభర్జనపడుతున్నారు.