మినహాయిస్తే మేలు..
-
విద్యాసంస్థల భవనాల్లో కార్యాలయాలు వద్దన ప్రభుత్వం
-
పెద్దపల్లి ఐటీఐ భవనంలో సాగుతున్న కలెక్టరేట్ పనులు
-
భవిత పాఠశాల భవనం ఎస్‌ఎస్‌ఏకు కేటాయింపు
-
వసతిగృహాలను తరలించే యోచనలోనే అధికారులు
-
నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, సంఘాలు
పెద్దపల్లిరూరల్/జగిత్యాల అర్బన్ : ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన భవనాల్లో కొత్త జిల్లాలకు సంబంధించిన కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటం విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. విద్యాసంస్థల భవనాలను తీసుకోవడాన్ని నిరసిస్తూ పలుచోట్ల విద్యార్థులు ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం విద్యాసంస్థలను నిర్వహిస్తున్న భవనాలను మినహాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అలాంటి భవనాలను ఎంపిక చేస్తే.. వాటి స్థానంలో ప్రత్యామ్నాయం చూడాలని సూచించింది. అయితే జగిత్యాల, పెద్దపల్లిలో పలు విద్యాసంస్థల భవనాల్లో మాత్రం పనులు యథాతథంగా కొనసాగుతుండటం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది.
పెద్దపల్లి ఐటీఐలో కలెక్టరేట్..
పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ భవనాల్లోనే కలెక్టరేట్ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించడంతో పనులు చకాచకా సాగుతున్నాయి. ఐటీఐలో ప్రభుత్వ కార్యాలయాలు వద్దని, వసతిగహాలకు మినహాయింపు ఇవ్వాలని పెద్దపల్లిలో విద్యార్థులు ఆందోళనలకు దిగిన విషయం విదితమే. అయినా పెద్దపల్లిలో జిల్లా కార్యాలయాలకు కేటాయించిన విద్యాసంస్థలు, వసతిగహ భవనాల్లోనే కొత్త కార్యాలయాల పనులను అధికారులు కొనసాగిస్తున్నారు. పెద్దపల్లిలో 52 ఏళ్ల క్రితం ఏర్పాౖటెన ఐటీఐ ఇప్పుడు క్యూఐసీ (క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)కు ఎంపికైంది. ఇందులో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతోపాటు విద్యార్థుల సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి తరుణంలో ఐటీఐ భవనాల్లో కలెక్టరేట్‌కు అనుగుణంగా పనులు చేపడుతున్నారు. ఐటీఐ విద్యార్థులను ఆవరణలోని షెడ్లలోకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజీవ్ రహదారికి ఆనుకుని ఉన్న ఐటీఐ చుట్టూ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఆదాయం రావడంతోపాటు విద్యార్థుల అవసరాలకు తగ్గట్టు నిర్మాణాలు చేసుకునేందుకు వీలుండేదంటున్నారు. ప్రభుత్వాదేశాలను ఇక్కడి అధికారులు అమలు చేయకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం విద్యాసంస్థలను మినహాయించాలని ఇచ్చిన ఆదేశాల మేరకైనా ఐటీఐలో నిర్మాణాలు ఆపితే బాగుండేదని ప్రిన్సిపాల్ సురేందర్ అన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు చెప్పారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో...
పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ఆవరణలో ఆర్‌ఐవో, ఆర్‌వీఈవో కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కాలేజీలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో విద్యార్థుల సంఖ్య పెరిగితే ఇబ్బందులు ఎదురవుతాయని కళాశాల వర్గాలు పేర్కొంటున్నాయి.
భవిత కేంద్రంలో...
పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో బుద్ధిమాంద్యం, ప్రత్యేకావసరాలు గల పిల్లలకోసం నిర్మించిన భవిత కేంద్రాన్ని ఖాళీ చేయించి సర్వశిక్షాభియాన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవిత కేంద్రాన్ని ఏదైనా పాఠశాల ఆవరణలోకి మార్చాలని సూచించారు. అయితే బుద్ధిమాంద్యం, వైకల్యం గల పిల్లలకోసం ర్యాంపును నిర్మించి పైపులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవేవీ పట్టని అధికారులు ఖాళీ చేయాలంటూ ఆదేశాలివ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 16మంది విద్యార్థులున్నారు. తప్పనిసరైతే ప్రత్యామ్నాయ భవనంలో పిల్లల అవసరాలకు తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టిన తర్వాతే అందులోకి పంపాలని కోరుతున్నారు.
ప్రగతినగర్ హాస్టల్‌పై కన్ను..
పెద్దపల్లి ప్రగతినగర్ చౌరస్తావద్ద కొత్తగా నిర్మించిన ఎస్సీ బాలుర వసతిగహాన్ని అన్ని ఇంజనీరింగ్ శాఖల ఎస్‌ఈలకు కేటాయించారు. ఈ హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను సమీపంలోని ఎస్సీ హాస్టల్–2కు పంపించే యోచనలో ఉన్నారు. రాజీవ్ రహదారి పక్కనే ఉండటంతో ఈ భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకే అధికారులు మొగ్గు చూపుతున్నారు. అయితే కొత్త హాస్టల్‌లో నీటివసతి ఉందని, అవసరమైతే ఎస్సీ హాస్టల్–2నే ఇందులోకి మార్చి, అక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నా అభ్యంతరం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. తమను ఇబ్బందులకు గురిచేసి తమ చదువులను పాడు చేయవద్దని వేడుకుంటున్నారు.
ఆదేశాలు అందలేదు..
–అశోక్‌కుమార్, ఆర్డీఓ
జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు విద్యాసంస్థలను మినహాయింపు ఇవ్వాలనే ఆదేశాలేమీ అందలేదు. ప్రభుత్వ ఐటీఐలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. కలెక్టరేట్ కార్యాలయ పనులు సాగుతున్నాయి. ప్రగతినగర్ వసతిగహంతోపాటు రంగంపల్లిలోని ఆనంద నిలయంలోనూ కార్యాలయాల ఏర్పాటు చేస్తాం.
విద్యార్థుల పరిస్థితి ఎలా?
జగిత్యాల అర్బన్ : జగిత్యాలలోని ఎస్టీ హాస్టల్‌ను జిల్లా పోలీసు శాఖ కార్యాలయానికి కేటాయించారు. హాస్టల్‌లో 96 మంది విద్యార్థులు ఉంటున్నారు. పక్కన ఎస్సీ–1, ఎస్సీ–2 వసతిగహాలు ఉన్నాయి. ఎస్సీ–1 హాస్టల్‌లో ఉన్న 70 మంది విద్యార్థులను ఎస్సీ–2 హాస్టల్‌కు తరలించారు. ఎస్సీ–1 భవనంలోకి ఎస్టీ విద్యార్థులను తరలించారు. ఎస్సీ–2 హాస్టల్‌లో ఉన్న 70 మంది, ఎస్సీ–1లోని 70 మంది మొత్తం 140 మంది విద్యార్థులు ఒకే వసతిగహంలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. నూతన బిల్డింగ్‌లో కొనసాగుతున్న ఎస్సీ హాస్టల్ వసతిగహాన్ని పాత ఎస్సీ హాస్టల్–1లోకి కేటాయించారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇందులో మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. పాతభవనం కావడంతో బాత్‌రూమ్‌లు సక్రమంగా లేవు. రూములు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. వంటగదులు అనుకూలంగా లేవు. నీటివసతి లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఎస్టీ హాస్టల్ భవనంలో ఎస్పీ, ఏఎస్పీ ఆఫీసులతోపాటు ఇతర చాంబర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు రూ.6లక్షల వ్యయంతో మరమ్మతులు చేపడుతున్నారు. గదులను కూల్చి చాంబర్‌లకు అనుకూలమైన రీతిలో కడుతున్నారు. ఇప్పటికే సగం మేర మరమ్మతులు పూర్తిచేశారు. విద్యాసంస్థల భవనాలను మినహాయించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు తర్జనభర్జనపడుతున్నారు.