రిజర్వేషన్ల అమలులో పారదర్శకత అవసరమని హెచ్‌సీయూ వైస్ ఛాన్సలర్ ఈ. హరిబాబు పేర్కొన్నారు.
సెంట్రల్‌యూనివర్సిటీ (హైదరాబాద్ సిటీ): రిజర్వేషన్ల అమలులో పారదర్శకత అవసరమని హెచ్‌సీయూ వైస్ ఛాన్సలర్ ఈ. హరిబాబు పేర్కొన్నారు. గురువారం హెచ్‌సీయూలోని సీవీరామన్ ఆడిటోరియంలో హెచ్‌సీయూ జాయింట్ రిజిస్ట్రార్ పీహెచ్.నాయక్ అధ్యక్షతన సెంట్రల్ వర్సిటీలలో రిజర్వేషన్ విధానాల అమలు’ అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాపు ప్రారంభమైంది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సెంట్రల్ వర్సిటీలలో రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించడం అవసరమన్నారు. పలు రాష్ట్రాలలోని వర్సిటీలకు ఆదర్శంగా ఉండేలా కేంద్రీ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇనిస్టిట్యూట్(బెంగుళూర్) డెరైక్టర్ డాక్టర్ హెచ్‌ఎస్ రాణా మాట్లాడుతూ నియామకాలు, పదోన్నతులలో పారదర్శకంగా రిజర్వేషన్లు అమలు కావడంలేదంటూ తరచు పలువురు కోర్టులను ఆశ్రయిస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి సమస్యలు తలేత్తకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మాజీ జాయింట్ సెక్రటరీ కె.జి.వర్మ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశ్యంతో అంబేద్కర్ రాజ్యాంగ రచన చేశారని పేర్కొన్నారు. ఈ వర్క్ షాపులో 40 వ ర్సిటీలకు చెందిన రిజిస్ట్రార్‌లు, రిజర్వేషన్ అధికారులు, అసిస్టెంట్, డిప్యూటీ రిజిస్ట్రార్‌లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.