హెచ్-1 బి వీసా లాటరీ పద్ధతిపై పిటిషన్
వాషింగ్టన్: హెచ్-1బి వీసాల జారీ ప్రక్రియపై అమెరికాకు చెందిన రెండు టాప్ అమెరికన్ ఇమ్మి గ్రేషన్ సలహా సంస్థలు ఫెడరల్ ప్రభుత్వంపై పోరాటానికి దిగాయి వీసాల జారీ ప్రక్రియలో పారదర్శకతను పాటించాలంటూ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్, అమెరికన్ లాయర్స్ అసోసియేషన్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, అమెరికా పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కు వ్యతిరేకంగా ఈ ఒక పిటిషన్ దాఖలు చేశాయి. లాటరీ పద్ధతి ద్వారా వీసాను మంజూరు చేసేపద్ధతిని సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈఎంపిక విధానాన్ని పూర్తిగా ప్రజలకు వివరించకుండా అమలు ప్రక్రియను ప్రకటించారని ఇవి ఆరోపించాయి. మొదటినుంచీ, చివరివరకు జరిగే వీసా జారీ ప్రక్రియ, చట్టబద్ధంగా జరుగుతుందా లేదా అనేది అమెరికా ప్రజానీకానికి బహిరంగ పర్చాలనేది తమ ఉద్దేశమని లీగల్ డైరెక్టర్ మెలిస్సా క్రో తెలిపారు.
కాగా 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్-1బి వర్క్ వీసాలకోసం దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 1 నుంచి మొదలుకాగా ఇంతవరకు వీసా జారీ ప్రక్రియ మొదలుకాలేదు. అమెరికా కంపెనీలు సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ ప్రోగామింగ్ వంటి అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఉద్యోగులను తమ కంపెనీలలో తీసుకునేందుకు హెచ్-1బి వీసాలను వినియోగిస్తుంటాయి. వీరిలో ఎక్కువమంది భారతీయులే . ఈ సం.రం నిర్దేశిత సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. అయితే 65వేలకు పైగా దరఖాస్తులు అందుతాయని ఆశిస్తున్నట్టు యూఎస్ సిటిజన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. ఒకవేళ యూఎస్సీఐఎస్ అనుకున్నదానికంటే ఎక్కువమొత్తంలో హెచ్-1బి దరఖాస్తులు అందినట్లైతే కంప్యూటర్ అధారిత లాటరీ విధానం ద్వారా దరఖాస్తులను ఎంపిక చేస్తామన్న సంగతి తెలిసిందే.