ఆదిలాబాద్ : ప్రభుత్వం ఇక నుంచి ఆధార్ నమోదును అంగన్‌వాడీ కేంద్రాలకు అప్పగించనుంది. దీంతో ఆధార్ నమోదు ప్రక్రియ సులభతరం కానుంది. ఇకపై ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలన్నీ ఆధార్ కేంద్రాలుగా మారనున్నాయి. ప్రస్తుతం మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసుల్లో, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శాశ్వత ప్రత్యేక కౌంటర్‌లో మాత్రమే ఆధార్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామస్థాయిలో ఈ కేంద్రాలు
లేకపోవడంతో ప్రజలంతా మండల కేంద్రాలు, సమీపంలోని పట్టణాలకు వెళ్లి ఆధార్ నమోదు చేయించుకోవాల్సి వస్తోంది. అంతేగాక చంటి పిల్లల ఆధార్ నమోదు తల్లిదండ్రులకు ఇబ్బంది కరంగా మారుతోంది. మరోవైపు ఆధార్ నమోదు కోసం రుసుం, రవాణా చార్జీలు, సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహకులకే ఆధార్ నమో దు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయిం చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు ఆధార్ రిజిస్ట్రేషన్ అధికారాలు ఇవ్వాలని భావి స్తోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో ఉన్న ఐసీడీఎస్‌లను ఆధార్ నమోదు ఏజెన్సీలుగా అభివృద్ధి చేయనుంది. ఈ ఏజెన్సీల పర్యవేక్షణలో ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు ఆధార్ నమోదును నిర్వహించనున్నాయి.
గ్రామీణుల చెంతకు..
జిల్లాలో 18 మండలాల్లోని 243 గ్రామ పంచాయతీల పరిధిలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 1256 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 90 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం, జనాభా ఆధారంగా అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో 8 నుంచి 10 కేంద్రాలు ఉండగా, చిన్న గ్రామాల్లో ఒక్కో కేంద్రం చొప్పున కొనసాగుతున్నాయి. తాజాగా ఐసీడీఎస్ పరిధిలోని సీడీపీఓ(శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి)కు ఆధార్ ఏజెన్సీ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా వ్యాప్తంగా ఆధార్ ఏజెన్సీలు ఏర్పాటు కానున్నాయి. ఏజెన్సీలో ఎంతమంది ఆపరేటర్లను ఏర్పాటు చేయాలనే అంశాలపైనా ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రతి గ్రామానికి ఒక కేంద్రం నిర్వహిస్తే సరిపోతుందని భావిస్తున్న ఆ శాఖ ఆ ప్రకారం ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమైంది. ప్రతి కేంద్రానికి ఒక ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కిట్ ఇవ్వనున్నారు.
పథకాల్లో పారదర్శకత..
ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల్లో ఆధార్ కీలకంగా మారింది. ఆసరా పింఛన్లు మొదలు బాలమృతం పథకానికి ఆధార్‌ను కీలకం చేసింది. శిశువుల పౌష్ఠికాహార పథకాల్లో ఆధార్ సంఖ్య కావాల్సి ఉన్నప్పటికీ చిన్నపిల్లలకు కార్డుల జారీలో ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా వాటిని మినహాయింపు ఇస్తోంది. అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలకు వెంటనే ఆధార్ నమోదు చేపట్టి కార్డులు జారీ చేస్తే పథకాల అమలు పారదర్శకంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం పథకంతోపాటు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్నా.. బ్యాంక్ ఖాతా తెరవాలన్నా.. పాన్‌కార్డు, రేషన్‌కార్డు, హెల్త్‌కార్డు.. ఇలా ప్రతీదానికి ఆధార్‌కార్డు అవసరం ఉంటుంది. ఈ ఆధార్ నమోదు కోసం దూర ప్రాంతాలైన గ్రామీణులు పట్టణాలకు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా కూలీ పని మానుకొని వస్తారు. ఇలాంటి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గ్రామాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా వారి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఈ విషయంపై ఐసీడీఎస్ డీడబ్ల్యూఓ మిల్కాను వివరణ అడుగగా ఇంకా తమకు ప్రభుత్వం నుంచి ఇంకా సర్క్యూలర్ రాలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment