హాంగ్ కాంగ్ : పారదర్శకతలో భారత సంస్థలే బెస్ట్ అట..చైనా సంస్థలు వరస్ట్ అని సర్వేలు తేల్చాయి. భారత్ లో అత్యంత పారదర్శకత కలిగిన కంపెనీలు ఉన్నాయని.. అదే చైనా సంస్థలలో పారదర్శకత లోపించిందని గ్లోబల్ యాంటీ-గ్రాప్ట్ వాచ్ డాగ్స్ సర్వే సోమవారం వెల్లడించింది. బ్రెజిల్, మెక్సికో, రష్యా, భారత్ లాంటి 15 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 100 కంపెనీలను ఈ రిపోర్టు కవర్ చేసింది. ఈ రిపోర్టులో పారదర్శకతలో భారత కంపెనీలే టాప్ లో ఉన్నట్టు తేలింది.
కఠినతరమైన ప్రభుత్వ నిబంధనలు, వివిధ దేశాల్లో ఆపరేట్ చేసే కంపెనీలకు ఇచ్చే సబ్బిడరీల వల్ల పనితీరు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. టెలికాం కంపెనీ భారతీ ఎయిర్ టెల్ 10 మార్కుల స్కోరులో 7.3 దక్కించుకుని టాప్ ప్లేస్ లో నిలిచినట్టు రిపోర్టు నివేదించింది. టాటా సంస్థ ఆరు యూనిట్లు, టెక్నాలజీ కంపెనీ విప్రోలు టాప్ లో చోటు దక్కించుకున్నాయి.
అయితే కేవలం ఒకే ఒక్క చైనా సంస్థ జడ్ టీఈ, టాప్ 25లో ఉన్నట్టు వాచ్ డాగ్స్ రిపోర్టు పేర్కొంది. సర్వేలో అతిపెద్ద గ్రూప్ గా తీసుకున్న చైనా 37 కంపెనీల పనితీరు చాలా బలహీనంగా ఉన్నట్టు తేలింది. మూడు కంపెనీలైతే 10 మార్కుల స్కోరులో జీరోను నమోదుచేశాయని తెలిపింది. ఆటోమేకర్ చెర్రీ, అప్లియన్స్ తయారీదారి గాలాంజ్, ఆటో పార్ట్ ల తయారీసంస్థ వాంక్సియాంగ్ గ్రూప్ లు జీరోను నమోదుచేసిన చైనా కంపెనీలుగా నిలిచాయి. పారదర్శకత లోపించి దిగువన నమోదైన 25 కంపెనీలు చైనావే.
2013 కార్పొరేట్ రిపోర్టింగ్ సర్వేతో పోలిస్తే ఈ సర్వేలో మొత్తంగా పారదర్శకత స్కోర్ పడిపోయింది. 10లో 3.4 ఫ్రాక్షన్ కిందకు జారింది. కంపెనీల మూడు త్రైమాసికాలు సగం కంటే ఎక్కువగానే పతనమైనట్టు సర్వే తేల్చింది. రిపోర్టు కనుగొన్న అంశాలు చాలా విషాదకరంగా ఉన్నాయని.. పెద్ద బహుళ జాతీయ కంపెనీలు అవినీతితో మరింత పోరాడాల్సినవసరం ఉందని సర్వే పేర్కొంది. కంపెనీలో అవినీతి వాతావరణం పెరగడం ప్రమాదకరమని బెర్లిన్ కు చెందిన ఈ వాచ్ డాగ్ సర్వే హెచ్చరించింది.