విశ్లేషణ
విజిలెన్స్ అంటే అప్రమత్తంగా ఉండటం. తప్పు జరగకుండా నిరోధించడం. అందుకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని, వాటిని సక్రమంగా అమలు చేయడం.. కాని వ్యవస్థలే అవినీతికి దోహదం చేస్తే దాన్ని నివారించడం అసాధ్యం.
అవినీతి, లంచగొండితనాన్ని ఏ విధంగా తగ్గించాలనే విషయంలో చర్యల కన్న ఎక్కువగా చర్చలే జరుగుతుం టాయి. ఆ చర్చల పర్యవసానం పెద్దగా ఉండకపోయినా, చాలామందిలో కొంత ఆలోచన వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అక్టోబర్ చివరివారంలో విజిలెన్స్ వారోత్సవం జరుపుతారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆవిర్భవించిన సందర్భంలో ఈ వారోత్సవాలు నిర్వహించాలి. ఈ సంవత్సరం ‘నా కల అవినీతి రహిత భారతం’ అనే అంశం మీద చర్చలు సమావేశాలు, పోటీలు జరిపించాలని విజిలెన్స్ కమిషన్ సూచించింది. లంచాలు లేని సమాజం వినడానికి ఊహించడానికి చాలా బాగుంది. కాని అవినీతి అంటే కేవలం లంచాలు తీసుకోవడం మాత్రమే కాదు. నోటికొచ్చినట్టు అబద్ధం ఆడటంతో మొదలై, ఒక రీతి రివాజు లేకుండా అడ్డదిడ్డంగా వ్యవహరించడం, ఆలోచనా వివేకం లేకుండా తగాదాలు పెట్టుకోవడం, ఎప్పుడూ మరొకరిని ఏడిపిస్తూ వినోదించడం, పరోపకారం మాట అటుంచి అవసరమైన సమాచారం కూడా ఇవ్వకపోవడం అనేవి దారుణమైన వ్యక్తిత్వాలు. ఇదంతా అవినీతి.
విజిలెన్స్ అంటే జాగరూకత, అప్రమత్తంగా ఉండటం. తప్పు జరగకుండా నిరోధించడం. అందుకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం, ఆ వ్యవస్థలు ఉంటే వాటిని సక్రమంగా అమలు చేయడం.. కాని వ్యవస్థలే అవినీతికి దోహదం చేస్తే దాన్ని నివారించడం అసాధ్యమవుతుంది. ఉదాహరణకు హైవేల మీద పౌరులకు జాగ్రత్తలు తెలియజేసే వ్యవస్థ లేకపోవడం, రెండుమూడు మైళ్లదాకా కనీస వైద్య సదుపాయాలు సమాచార ప్రసార వ్యవస్థ లేకపోవడం తీవ్రమైన లోపాలు. శరవేగంగా వెళ్లగల జాతీయ రహదారులు ప్రగతికి మార్గాలే. కాని వాటి నిర్వహణలో అనుబంధ సేవల కల్పనలో నియమాలు పాటించకపోవడం వల్ల అవి మృత్యుకుహరాలుగా మారుతున్నాయి.
ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతుంటే ఎవరూ ఏమీ చేయడం లేదు. రైళ్లు పట్టాలు తప్పుతూ ఉంటే, ప్రమాదాలు జరుగుతూ ఉంటే పట్టించుకునే వాడు లేడు. రోడ్డు దాటే వంతెనలు లేక, మెట్రో, లోకల్ రైల్వేస్టేషన్ల ద్వారా జనం అవతలి పక్కకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ రద్దీలో ఇరుక్కుపోయి తొక్కిసలాటలో ప్రాణాలు పోతుంటే గాని పాదచారుల వంతెనలు రోడ్డు పక్కన కాలిబాటల అవసరాలు గుర్తుకు రావడం లేదు. ఇవన్నీ అక్రమాలు, ఇదంతా అవినీతి. వర్షాలకు అవిభాజ్య కవల సోదరులు వరదలు. రోడ్డుమీదనుంచి నీళ్లు ఎటుపోవాలో ప్రణాళికలో ఉండదు. అసలు వానలే రావనే నమ్మకంతో రోడ్ల నిర్మాణం చేస్తున్నారు.
అభివృద్ధి పనులకోసం పౌరుల భూములు ప్రభుత్వం స్వీకరిస్తుంది. దాన్ని సేకరణ అంటారు. నిజానికి అది స్వాధీనం చేసుకోవడమే. అవసరం ఏమిటో వారు నిర్ధారించి, వారే నష్టపరిహారాన్ని నిర్ణయించి, తప్పనిసరిగా భూమిని ఇచ్చేయాలని ఆదేశించడానికి కావలసిన అధికారాన్నిస్తూ భూసేకరణ చట్టం ఒకటి బ్రిటిష్ కాలంలో రూపొందించారు. దాన్నే 2013దాకా అమలు చేశారు. కాని అందులో అన్యాయంగా ప్రభుత్వం ప్రజల భూములను స్వాధీనంచేసుకుంటూ ఉంటే పరిష్కారం లేకుండా పోయింది. కోర్టుల్లో ఏళ్లతరబడి పోరాడితే న్యాయం దొరుకుతుందో లేదో తెలియని దుస్థితి నెలకొన్నది. ఎన్నెన్నో ప్రాజెక్టులకోసం భూములు స్వాధీనం చేసుకున్నారు కాని పరిహారాలే ఇవ్వలేదు.
వ్వజూపిన పరిహారం సరిపోదని వాదిస్తే కోర్టులెక్కాల్సి వచ్చేది. కోర్టుల్లో ఇరవై ఏళ్ల తరువాత కనీసం పది శాతం కూడా ధర పెరిగేది కాదు. ఖర్చులతో పోల్చితే పరిహారం పెంపు మరింత నష్టం కలిగించేది. ఈ చట్టం స్వతంత్ర భారత దేశంలో ప్రతిజిల్లాలో అవినీతిని పెంచి పోషించింది. వందల వేలు లక్షల కోట్లరూపాయల లంచగొండితనాన్ని ఈ చట్టం కనుసన్నల్లో ప్రజలు కళ్లారా చూసారు. ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు భూములను స్వాధీనం చేసుకుని తమకు అనుకూలంగా వాడుకున్న సందర్భాలు కోకొల్లలు. భూసేకరణ నోటిఫికేషన్ లు జారీ చేయడం కూడా భారీ కుంభకోణాల పుట్టగా తయారైంది. ఫలానా చోట ప్రాజెక్టు వస్తుందని ముందే సమాచారం లోపాయికారిగా కొందరికే చెప్పి, చుట్టు పక్కల భూములు తామే తక్కువ ధరకు కొని, ప్రాజెక్టు వల్ల భూమి ధర పెంచి లక్షల కోట్ల రూపాయలు దండుకొనే అవినీతి అసలు పట్టుకునే అవకాశమే లేదు.
ఈ దుర్మార్గపు చట్టం నుంచి విముక్తికోసం పోరాటాలు ఉద్యమాలు జరిగాయి. చివరకు ఎన్నో నియమాలను ప్రతిపాదించి, ఎందరితోనో చర్చించి 2013లో ఒక కొత్త చట్టాన్ని రూపొందించారు. లోపాలేమీ లేవని చెప్పడానికి వీల్లేకపోయినా ఈ చట్టం కింద భూమి కోల్పోయే వారికి కావలసినంత నష్టపరిహారం కోరే అవకాశం లభించింది. అన్నింటికన్నా ముఖ్యమైన అంశం ఏమిటంటే మొత్తం భూమి స్వాధీన వ్యవహారాలు పారదర్శకంగా సాగించాలనే నియమం. ఏ ప్రాజెక్టుకోసం ఎవరి భూమి ఎంత మేరకు, ఎంత ధర ఇచ్చి తీసుకుంటున్నారనే ప్రతి అంశాన్ని ప్రతిదశలో ప్రజలకు తెలియజేసే పారదర్శకత ఉండాలని ఈ చట్టం నిర్దేశిస్తున్నది. కాని ఆ పారదర్శకతను కూడా పాటించకుండా ఈ చట్టాన్నే పక్కకు బెట్టి భూములు సేకరించే విధానాలను కనిపెట్టారు. అవినీతికి ఆస్కా రంలేని పారదర్శక విధానాలు లేకుండా నిఘాలు, విజి లెన్స్‌లు ఉపయోగపడవు.
-మాడభూషి శ్రీధర్
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్
professorsridhar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment